పెద్దారెడ్డి పెద్దరికానికే పెద్ద ఇబ్బందటగా?

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 40 ఏళ్ల రాజ‌కీయం న‌డిపిన జేసీ బ్రద‌ర్స్‌కు షాకిస్తూ .. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున కేతిరెద్ది పెద్దారెడ్డి విజ‌యం [more]

Update: 2021-04-28 05:00 GMT

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 40 ఏళ్ల రాజ‌కీయం న‌డిపిన జేసీ బ్రద‌ర్స్‌కు షాకిస్తూ .. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున కేతిరెద్ది పెద్దారెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌న హ‌వా కావొచ్చు.. పార్టీ దూకుడు కావొచ్చు. మొత్తానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పాగా అయితే వేసింది. దీంతో ఇంకేముంది.. జేసీ వ‌ర్గం ప‌ని అయిపోయింద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి భావించారు. తొలి యేడాది జేసీ ఫ్యామిలీ సైలెంట్‌గా ఉండడంతో పెద్దారెడ్డి హ‌డావిడి మామూలుగా లేదు. ఇక ఆ త‌ర్వాత పెద్దారెడ్డి ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. నేరుగా జేసీ ప్రభాక‌ర్ రెడ్డి ఇంటికి వెళ్లి మ‌రీ.. హెచ్చరించి వ‌చ్చారు. దీంతో ఇంకేముంది.. తాడిప‌త్రిలో జేసీ వ‌ర్గం ప‌ని అయిపోయింద‌నే అనుకున్నారు అంద‌రూ.

దూకుడు వల్లనేనా?

కానీ, అనూహ్యంగా.. ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తాడిప‌త్రిలో జేసీ ప్రభాక‌ర్ రెడ్డి విజ‌యం సాధించి కౌన్సిల్ పీఠాన్ని ద‌క్కించుకున్నారు. ఏపీలో జ‌రిగిన కార్పోరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాల్టీ తాడిప‌త్రి ఒక్కటే. ఈ ప‌రిణామం.. స‌హ‌జంగానే ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ప్రభావం చూపింది. ఆయ‌న దూకుడు రాజ‌కీయం వ‌ల్లే.. సేవ్ తాడిప‌త్రి నినాదంతో జేసీ వ‌ర్గం దూసుకుపోయి.. సింప‌తీ పాలిటిక్స్ గెలిపించాయ‌ని.. పెద్దారెడ్డి సైలెంట్ గా ఉంటే.. వైసీపీనే విజ‌యం ద‌క్కించుకుని ఉండేద‌ని.. వైసీపీలోనే నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు.

అంతా ఎంపీ కే అప్పగించి…

ఇక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పెద్దారెడ్డిని ప‌క్కన పెట్టిన అనంత‌పురం ఎంపీ.. త‌లారి రంగ‌య్య.. త‌నే అన్నీ అయి చ‌క్రం తిప్పారు. ఇది.. పెద్దారెడ్డి పెద్దరికానికే పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. పోనీ.. సాహ‌సం చేసి.. ఎంపీని ఎదిరించాల‌ని అనుకుంటే.. తాడిప‌త్రి ఓట‌మి.. ఆయ‌న‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని.. అనుచ‌రులు చెబుతున్నారు. పోనీ సైలెంట్‌గా ఉంటే.. ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఒక్క ప్రత్యర్థుల నుంచే కాకుండా.. సొంత పార్టీలోని సీనియ‌ర్లు కూడా పెద్దారెడ్డిపై విమ‌ర్శలు చేస్తున్నారు.

హర్ట్ అయ్యారా?

ఈ ప‌రిణామాల‌తో హ‌ర్ట్ అయిన‌.. పెద్దారెడ్డి.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ గ‌తంలో ఉన్నంత యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదని టాక్ న‌డుస్తోంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌కు టికెట్ ద‌క్కుతుందా ? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒకే ఒక్క ఓట‌మి పెద్దారెడ్డి జీవితాన్ని పూర్తిగా త‌ల్లకిందులు చేసిన ప‌రిస్థితే ఉంది.

Tags:    

Similar News