సంచలనం నాల్గు రోజులే.. తర్వాత మామూలే

కొన్ని సెన్సేషనల్ కేసులు మన కంటి ముందు వారం పదిరోజులు మాత్రమే కనపడుతుంటాయి. ఆ తర్వాత అవి కనుమరుగవుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా తమకు రాజకీయంగా లబ్ది [more]

Update: 2019-09-19 12:30 GMT

కొన్ని సెన్సేషనల్ కేసులు మన కంటి ముందు వారం పదిరోజులు మాత్రమే కనపడుతుంటాయి. ఆ తర్వాత అవి కనుమరుగవుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా తమకు రాజకీయంగా లబ్ది ఉంటుందనుకుంటే తప్ప కేసుల్లో పురోగతి ఉండదు. ఎటువంటి ప్రయోజనం లేకుంటే ఆ కేసులు మరుగున పడతాయి. ఇలాంటి కేసులను మనం ఎన్నో చూశాం. గ్యాంగ్ స్టర్ నయీం కేసు దగ్గర నుంచి ఎంసెట్ లీకేజీ కేసు, డ్రగ్స్ కేసు, ఇటీవల ఎన్నికలకు ముందు వచ్చిన డేటా చోరీ కేసు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు మధ్యలోనే నీరుగారి పోతున్నాయి. ఈ కేసుల విషయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఏం చేస్తున్నాయన్నది ఎవరికీ తెలియదు.

వైఎస్ వివేకా హత్య కేసు…..

ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. అయితే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేసు ముందుకు సాగలేదన్నా ఒక అర్థం ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటుతున్నా ఆ కేసు అతీగతీ లేదు. నిందితులు ఎవరో తెలియదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన కారణాలు కూడా బయటకు రాలేదు. వివేకా కుటుంబ సభ్యులు ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారో చెప్పవచ్చు.

కోడెల ఆత్మహత్య కేసు…..

తాజాగా జరిగిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు కూడా ఇదే కోవలోకి చేరబోతున్నట్లు కన్పిస్తుంది. కోడెల శివప్రసాద్ ఫ్యాన్ కు ఉరివేసుకుని మరణించారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు నేటికి బయటకు రాలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడే ముందు కొందరితో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. ఆ ఫోన్ తర్వాతనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు సయితం అంగీకరిస్తున్నారు. కోడెల శివప్రసాద్ కు చెందిన ఫోన్ రెండు రోజుల కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

డేటా చోరీ కేసు ఏమైంది?

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డేటా చోరీ వ్యవహారం రచ్చ రచ్చ అయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. పేరున్న అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో విచారణ జరిపారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అమెజాన్ నుంచి సమాచారం రావాల్సి ఉందని అప్పట్లో ప్రకటన చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ డేటా చోరీ వ్యవహారంలో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అశోక్ దాకను పట్టుకోవడమే పోలీసులకు గగనమయి పోయింది. ఐటీగ్రిడ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కూడా అప్పట్లో పోటీగా సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఇంతకీ డేటా చోరీ జరిగిందా? లేదా? జరిగితే ఎవరు చేశారు? అన్న దానిపై స్పష్టత లేదు. ఇలా సంచలనం నాలుగు రోజులే. తర్వాత మామూలే అన్నట్లు తయారయింది ముఖ్య కేసుల వ్యవహారం.

Tags:    

Similar News