సింగిల్ టైమ్ తో సిగ్నల్స్ బంద్ అయిపోయినట్లేనా?

ఆయ‌న యువ‌కుడు. భారీ టార్గెట్‌ను పెట్టుకుని జీవితంలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్నారు. అయితే, కుటుంబంలో త‌లెత్తిన ఓ పెను కుదుపు ఆయ‌న‌ను రాజ‌కీయ బాట ప‌ట్టించింది. అనుకోని ల‌క్కుగా [more]

Update: 2020-03-07 08:00 GMT

ఆయ‌న యువ‌కుడు. భారీ టార్గెట్‌ను పెట్టుకుని జీవితంలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్నారు. అయితే, కుటుంబంలో త‌లెత్తిన ఓ పెను కుదుపు ఆయ‌న‌ను రాజ‌కీయ బాట ప‌ట్టించింది. అనుకోని ల‌క్కుగా (అనుకోవాలి) ఆయ‌న అత్యంత పిన్న వ‌య‌సులోనే మంత్రి కూడా అయిపోయారు. కానీ, ఇప్పుడు అదే వ్యక్తి దిక్కులు క‌నిపించ‌క రాజ‌కీయ చ‌క్ర బంధంలో చిక్కుకుని అల్లాడుతున్నారు. ప‌ట్టుమ‌ని ఏడాది గ‌డ‌వక ముందుగానే ఆయ‌న త‌న జీవితంలో కీల‌క కుదుపును ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏం చేయాల‌ని ? త‌ల‌ప‌ట్టుకుంటోన్న ప‌రిస్థితి. ఈ కీల‌క స‌మ‌యంలో ఆయ‌న‌కు అండ‌గా నిలిచేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాక‌పోవ‌డం మ‌రో చిత్రం. మ‌రి ఆయ‌నెవ‌రు? ఆయ‌న క‌థేంటి? తెలుసుకుందాం.

మావోయిస్టుల దాడిలో….

అర‌కు ఎమ్మెల్యేగా 2014 ఎన్నిక‌ల్లో కిడారి స‌ర్వేశ్వర‌రావు వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ శిష్యుడిగా ఉన్న ఆయ‌న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి జంప్ చేసి 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న 2017లో పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఈ క్రమంలో ఆయ‌న‌కు గిరిజ‌న మంత్రి పోస్టు ఇస్తాన‌ని చంద్రబాబు హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారంలో ఉంది. అయితే, ఇంత‌లోనే మావోయిస్టులు ప‌ట్టప‌గ‌లు ఆయ‌నను న‌డిరోడ్డుపై కాల్చి చంపారు. ఆ కాల్పుల్లో ఆయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కూడా హ‌త‌మ‌య్యారు.

తండ్రి లేని బిడ్డ కావడంతో…

దీంతో సానుభూతిని త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్రయ‌త్నించిన చంద్రబాబు ఎక్కడో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న కిడారి కుమారుడు శ్రవ‌ణ్‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. ఆయ‌న రెండో కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారు. ఇక‌, శ్రవ‌ణ్‌కు వెంట‌నే అంటే ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు మంత్రి ప‌ద‌విని కూడా క‌ట్టబెట్టారు. ఆరు మాసాలు గ‌డిచి పోయి 2019లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో అదే టికెట్‌ను శ్రవ‌ణ్‌కు ఇచ్చారు చంద్రబాబు. తండ్రిలేని బిడ్డ కాబ‌ట్టి ఈ సెంటిమెంట్‌తో అయినా గెలుపు గుర్రం ఎక్కేస్తాడ‌ని భావించారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. కాదు కాదు.. ఇంకా చెప్పుకోవాలంటే.. ఆయ‌న క‌నీస డిపా జిట్‌ను కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఇది శ్రవ‌ణ్‌కు ఘోర‌మైన అవ‌మాన‌మే.

ఎవరూ మద్దతివ్వకపోవడం….

ఒక‌ప‌క్క త‌మ్ముడు గ్రూప్ 1 అధికారిగా ఉండ‌గా తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఓట‌మి పాల‌వ‌డంతో తీవ్రంగా కుంగిపోయిన శ్రవ‌ణ్‌. కొన్నాళ్లపాటు బ‌య‌ట‌కు కూడా రాలేదు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న రాజ‌కీయంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీనికి కూడా ఓ కార‌ణం ఉంది. జ‌గ‌న్ ప్రభుత్వం త‌న‌కు ఉన్న సెక్యూరిటీని తొల‌గించ‌డ‌మే. ఈ క్రమంలో ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి జ‌గ‌న్‌పై విమ‌ర్శలు చేశారు. అయితే, ఇక్కడ పార్టీ త‌ర‌ఫున ఏఒక్కరు కూడా ఆయ‌న‌కు మ‌ద్దతివ్వలేదు. కిడారికి భ‌ద్రత త‌గ్గించ‌డంపై క‌నీసం దిగువ‌స్థాయి నేత‌లు కూడా ప‌ట్టించుకోలేదు. అధినేత అస‌లే మొహం చాటేశారు.

పార్టీలో ఉండలేక….

దీనికితోడు.. విశాఖ రాజ‌కీయాల్లో గ్రూపుల‌తో మ‌రింత‌గా శ్రవ‌ణ్ డీలా ప‌డుతున్నారు. పార్టీలో ఉన్న సీనియ‌ర్లే గ్రూపు త‌గాదాల‌తో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో శ్రవ‌ణ్‌ను అటు జిల్లా రాజ‌కీయాల్లో కాని రాష్ట్ర రాజకీయాల్లో కాని ప‌ట్టించుకునే వాళ్లే లేరు. ఉన్నంతలో లోకేష్ మాత్రమే శ్ర‌వ‌ణ్‌ను కాస్తో కూస్తో ప‌ల‌క‌రిస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు ఏం చేయాలి ? అస‌లు పార్టీలో ఉండాలా? వ‌ద్దా అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వాస్తవానికి 1999 త‌ర్వాత అర‌కులో టీడీపీ ఇక్కడ‌ గెలిచిన దాఖ‌లా లేదు. సో.. ఈ పార్టీలోనే ఉంటే.. త‌న‌కు ఎప్పటికైనా ఆద‌ర‌ణ ఉండే ప‌రిస్థితి ఉండ‌ద‌ని శ్రవ‌ణ్ దాదాపు నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అటు వైసీపీలోకి వెళ్లినా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

Tags:    

Similar News