కిల్లి కలలు ఫ‌లిస్తున్నాయా

రాజ‌కీయాల్లో అదృష్టం వ‌చ్చినా.. దుర‌దృష్టం వెంటాడినా.. నాయ‌కులకు ఊహించ‌ని ప‌రిణామాలే ఎదుర వుతుంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న కిల్లి కృపారాణి ప‌రిస్థితి [more]

Update: 2019-09-09 02:00 GMT

రాజ‌కీయాల్లో అదృష్టం వ‌చ్చినా.. దుర‌దృష్టం వెంటాడినా.. నాయ‌కులకు ఊహించ‌ని ప‌రిణామాలే ఎదుర వుతుంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న కిల్లి కృపారాణి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఆమె గతంలో కేంద్రంలో మంత్రిగా చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కురాలిగా ఉన్నారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన ఆమె ఇటీవ‌ల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే టెక్క‌లి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం ఎంపీ సీటు ఆమె ఆశించారు. అయితే, అప్ప‌టికే పార్టీలో కీల‌కంగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిల‌క్‌ల‌కు జ‌గ‌న్ ఆరెండు సీట్ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు.

రాజ్యసభ దక్కనుందా?

దీంతో కిల్లి కృపారాణిని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా నియ‌మించారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచేలా ఆమె ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లారు. దీంతో టెక్క‌లి , ఇచ్ఛాపురం అసెంబ్లీ సీట్ల‌తో పాటు శ్రీకాకుళం ఎంపీ సీటు మిన‌హా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ విజ‌యం సాధించింది. దీంతో జ‌గ‌న్ ఆమెకు న్యాయం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటే చేసే అవ‌కాశం ఎలాగూ ఇవ్వ‌లేక పోయినందున ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కిల్లికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. తాజాగా శుక్ర‌వారం ప‌లాసలో జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ స‌హా .. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

పార్టీ కోసం కష్టపడటంతో….

దీనికి కిల్లి కృపారాణి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. సీఎం జ‌గ‌న్ పాల్గొనే స‌భ స‌హా అన్ని స‌భ‌ల‌కు ఆమె ప్రాతినిధ్యం వ‌హించారు అన్నీ ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి ఏవిధంగా తీసుకు వెళ్లేదీ కూడా కిల్లి కృపారాణి వివ‌రించారు. దీంతో జ‌గ‌న్ ఆమె కృషిని గుర్తించార‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే చేప‌ట్టే రాజ్య‌స‌భ టికెట్ల కేటాయింపులో కిల్లి కృపారాణికి ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్య‌లో అసెంబ్లీ స్థానాలు కైవ‌సం చేసుకున్న‌వైసీపీకి ఈ ద‌ఫా రాజ్య‌స‌భ‌లోనూ మంచి సంఖ్యా బ‌లం పెర‌గ‌నుంది.

సామాజిక వర్గం పరంగా….

దీనిని దృష్టిలో ఉంచుకుని పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిలో మ‌హిళా నాయ‌కురాలిగా అనుభ‌వం ఉన్న నేత‌గా కిల్లి కృపారాణికి జ‌గ‌న్ పెద్ద‌పీట వేస్తార‌ని అంటున్నారు. ఇక లోక్‌స‌భ‌లో వైసీపీకి ఇప్ప‌టికే న‌లుగురు ఎంపీలు ఉన్నారు. అర‌కు నుంచి గొడ్డేటి మాధ‌వి, అన‌కాప‌ల్లి నుంచి స‌త్య‌వ‌తి, అమ‌లాపురం నుంచి చింతా అనూరాధ‌, కాకినాడ నుంచి వంగా గీత ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఇక ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో కూడా కేంద్ర మాజీ మంత్రిగా ప‌నిచేయ‌డంతో పాటు ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మైన కాళింగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌హిళ కావ‌డంతో ఆమె పేరు రాజ్య‌స‌భ రేసులో ప్ర‌ముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News