కృప ఉంటేనే రాణీ అవుతారు… ?

ఆమె సీనియర్ మహిళా రాజకీయ నాయకురాలు. ఉత్తరాంధ్రలో అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన నేత. ఆమెకు ఉన్న [more]

Update: 2021-09-11 00:30 GMT

ఆమె సీనియర్ మహిళా రాజకీయ నాయకురాలు. ఉత్తరాంధ్రలో అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన నేత. ఆమెకు ఉన్న మరో గొప్పతనం ఏంటి అంటే సిక్కోలులో దిగ్గజ రాజకీయ నాయకుడు, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుకి తొలిసారి ఓటమి రుచి చూపించి అక్కడ ఎంపీ అయ్యారు. జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి డాక్టర్ కూడా. ఆమె సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ జనంలో మంచి పేరు సంపాదించుకున్నారు. టెక్కలికి చెందిన కిల్లి కృపారాణి వైసీపీలో చేరాక ఇంతదాకా ఏ అధికారిక పదవీ చేపట్టలేదు. ఆమె ప్రస్తుతం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఎన్నో ఆటంకాలు….

కిల్లి కృపారాణిని జగన్ ఆప్యాయంగా 2014 ఎన్నికల ముందు పిలిచారు. కానీ ఆమె ససేమిరా అన్నారు. ఇక 2019 ఎన్నికల ముందు ఆమె పార్టీలో చేరారు. అయితే అప్పటికే అంతా సర్దుకున్నారు. దాంతో అధికారంలోకి వచ్చాక చూసుకుందామని చెప్పేశారు. ఇక్కడ కిల్లి కృపారాణి మీద జగన్ కీలకమైన బాధ్యతలు పెట్టారు. అందులో ఒకటి శ్రీకాకుళం ఎంపీ సీటును గెలిపించడం, రెండు టెక్కలి నుంచి వైసీపీని గెలిపించడం. ఈ రెండింటిలోనూ ఆమె ఫెయిల్ అయ్యారు. దాంతో జగన్ ఆమె విషయంలో కొంత తగ్గారు అంటారు. మరో వైపు చూస్తే రెండున్నరేళ్ళుగా కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. త్వరలో జరగబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమె సిక్కోలు లో వైసీపీ జెండాను ఎగరేస్తే పదవుల గురించి హై కమాండ్ మాట్లాడే అవకాశం ఉంది.

తమ్మినేని దెబ్బ …

ఇక ఒకే సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని, కిల్లి కృపారాణిలకు ఒకేసారి ఉన్నత పదవులు దక్కవు అంటున్నారు. తమ్మినేని ఇప్పటికే స్పీకర్ గా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కితే మాత్రం కృపారాణి వచ్చే ఎన్నికల దాకా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఆమె మాత్రం తనకు రాజ్యసభ సీటు కావాలని కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఆరు సీట్లలో ఒకటి తనకు కన్ ఫర్మ్ చేయాలని కిల్లి కృపారాణి గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. అయితే జగన్ పదవుల పందేరం చూసిన వారు మాత్రం ఆయన పార్టీని అట్టే పెట్టుకుని ఉన్న వారికీ, సీనియర్లకే పట్టం కడతారు అని చెబుతారు. 2019 ఎన్నికల వేళ కిల్లి కృపారాణితో పాటు చాలా మంది పార్టీలో చేరారు. అందువల్ల ఆమె 2024 వరకూ ఓపిక పట్టాల్సిందే అన్న మాట ఉంది. అదే టైమ్ లో తమ్మినేనికి మంత్రి పదవి ఖాయమైతే మాత్రం కిల్లి కృపారాణి రాజ్య సభ ఆశలు తల్లకిందులు కావాల్సిందే అంటున్నారు.

ఇదే ఆలోచనట….

ఇక జగన్ కి శ్రీకాకుళం ఎంపీ సీటు చాలా ముఖ్యం. ఈ సీటుని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. దానికి సరైన అభ్యర్ధి ఇంతవరకూ దొరకలేదు. కిల్లి కృపారాణి అయితే ఒకసారి గెలిచారు. అది కూడా కింజరాపు ఫ్యామిలీ మీద గెలిచారు. దానికి తోడు జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న కాళింగ సామాజిక వర్గం దన్ను కూడా ఉంటుంది. దాంతో 2024లో జరిగే ఎంపీ ఎన్నికలకు శ్రీకాకుళం నుంచి అభ్యర్ధిగా కిల్లి కృపారాణిని జగన్ డిక్లేర్ చేస్తారు అంటున్నారు. అంటే మరో రెండున్నరేళ్ళు ఆమె నిరీక్షణ చేయాల్సిందే. ఈ లోగా అధినాయకుడి కృప ఉంటే ఏదైనా ఇతర పదవి దక్కినా దక్కవచ్చు. మొత్తానికి ఈ డాక్టరమ్మ పెద్దల సభకు వెళ్ళాలన్న ఆశలు అంత సులువుగా నెరవేరవు అంటున్నారు.

Tags:    

Similar News