ఓయ్…మెంటల్… ఇదేం పని….??

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వికృత చేష్టలకు, విపరీత పోకడలకు హద్దూ పద్దూ ఉండటం లేదు. ఆయన అనాలోచిత, అహంకారపూరిత వైఖరి చూసి సభ్య సమాజం తలవంచుకోవాల్సి [more]

Update: 2019-06-08 18:29 GMT

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వికృత చేష్టలకు, విపరీత పోకడలకు హద్దూ పద్దూ ఉండటం లేదు. ఆయన అనాలోచిత, అహంకారపూరిత వైఖరి చూసి సభ్య సమాజం తలవంచుకోవాల్సి వచ్చింది. ఆధునిక సమాజం ఆందోళన చెందుతుంది. అంతర్జాతీయ సమాజం గర్హిస్తోంది. ఆధునిక సేవాభావ ప్రపంచంలోనూ ఇటువంటి కిరాతకులు ఇంకా ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంతో మంది కరడు గట్టిన నియంతలను చూసినప్పటికీ కిమ్ లాంటి వింత వ్యక్తిని ఎవరూ చూసి ఉండరు.

ఐదుగురిని చంపి……

తాజాగా ఆయన దురాగతం గురించి తెలుసుకున్న వారికి నోటమాట రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలు విఫలం కావడానికి ఐదుగురు ఉన్నతాధికారులు కారణమని ఏకపక్షంగా పేర్కొని వారికి మరణశిక్ష విధించడాన్ని గర్హించడానికి మాటలు రావడం లేదు. ఖండించడానికి సరైన పదాలు దొరకడం లేదు. ఈ ఐదుగురు ఉన్నతాధికారులను ఈ ఏడాది మార్చి మిరిమి విమానాశ్రయంలో కాల్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఒక పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం చూసిన తర్వాత కిమ్ తీరుతెన్నులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో చర్చలు సందర్భంగా ఉత్తరకొరియాకు చెందిన రాయబారి కిమి హ్యాన్ చోల్ అన్నీ తానే అయి వ్యవహరించారు. అమెరికా అధికారులతో చర్చలకు రంగం సిద్దం చేశారు ఆయన. కిమ్ మూర్ఖత్వాన్ని తెలిసిన ట్రంప్ తొలుత చర్చలకు నిరాకరించినా తనలాంటి అగ్రనేత చిన్న వెనకబడిన దేశాధినేతతో చర్చలకు ఆయన సిద్ధపడలేదు. కానీ కిమ్ హ్యాన్ చోల్ ఆయనను చర్చలకు ఒప్పించారు. కిమ్ అందరూ అనుకున్నంత కఠినుడు కాడని, శాంతికాముకుడని నచ్చజెప్పారు. ఒక అవకాశమిస్తే వాస్తవం తెలుస్తుందని వివరించారు. ఎట్టకేలకు ట్రంప్ తలూపారు. దీంతో కిమ్ హ్యాన్ చోల్ స్వయంగా కిమ్ జోంగ్ ను ప్రయివేటు రైల్లో తీసుకెళ్లారు. ట్రంప్ తో చర్చల సందర్భంగా కిమ్ జోంగ్ అనుచితంగా వ్యవహరించారు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే ధోరణితో వ్యవహరించారు. ఎలాంటి షరతులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. చివరకు విసుగు చెందిన ట్రంప్ ” నో డీల్” అంటూ లేచి వెళ్లారు. ట్రంప్ కు తన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను వివరించి చెప్పడంలో ఒక్క ఆంగ్ల పదాన్ని తప్పుగా పలికిన మహిళా దుబాసీ షిన్ షైయాంగ్ ను జైలుకు పంపారు. చర్చల సందర్భంగా అమెరికా తరుపున ప్రత్యేక ప్రతినిధిగా స్టీఫెన్ బీగన్, ఉత్తరకొరియా తరుపున చోలే ప్రత్యేక ప్రతినిధిగా వ్వవహరించారు. చివరకు చర్చలు విఫలమయ్యాయి. అణ్వాయుధాలను వీడితే ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలగిస్తామంటూ ట్రంప్ ప్రతిపాదించారు. వియత్నాం రాజధాని హోనయి లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన చర్చల్లో ట్రంప్ ఈ విషయాన్ని కిమ్ దృష్టికి తీసుకెళ్లారు. చివరకు చర్చలు ఫలించలేదు. దీంతో సుప్రీం కమాండర్ అయిన కిమ్ ను అధికారులు మోసగించారంటూ అభియోగాలు మోపారు. ఏకపక్ష దర్యాప్తు అనంతరం ఐదుగురిని చంపేశారు.

కథనాలను విశ్వసించకున్నా….

ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా పత్రికా కథనాల ఆధారంగా ఒక నిర్ణయానికి రాలేమని పాంపియో స్పష్టం చేశారు. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత స్పందిస్తామన్నారు. ఉత్తర కొరియాలో ప్రక్షాళనలు, మరణశిక్షలపై దక్షిణ కొరియా పత్రికల్లో వచ్చిన కథనాలను పూర్తిగా విశ్వసించలేం. గతంలో అవాస్తవాలు ప్రచురితమయ్యాయి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సుదీర్ఘంగా వైరం ఉన్న విషయం తెలిసిందే. ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టదు. పొరుగున ఉన్న దక్షిణ కొరియా అనేక రంగాల్లో ప్రగతిి పథాన దూసుకుపోతుండగా, ఉత్తరకొరియా పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ అభివృద్ధి జాడలు కన్పించవు. ప్రజలు మౌలిక సౌకర్యాల లేమిలో సతమతమవుతుంటారు. దేశాధినేత కిమ్ ఎంతసేపటికీ అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు. అంతే తప్ప ప్రజల సంక్షేమం కిమ్ కు పట్టదు. ఐదుగురిని కాల్చిన నేపథ్యంలో కిమ్ ప్రతిష్ట పాతాళానికి తాకింది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News