ఇక చాలు..చాలు.. ఈయన అన్నీ ఆపేసుకున్నట్లే?

ఆయ‌న నోరు విప్పితే.. ప‌దునైన వ్యాఖ్యలు దూసుకు వ‌స్తాయి. ప్రతిప‌క్షాల‌కు చెమ‌ట‌లు ప‌డ‌తాయి. మూడు భాష‌ల్లో అన‌ర్గళంగా మాట్లాడ‌గ‌లిగిన నేర్పు ఆయ‌న సొంతం. కేంద్రంలో మంత్రిగా కూడా [more]

Update: 2020-05-17 12:30 GMT

ఆయ‌న నోరు విప్పితే.. ప‌దునైన వ్యాఖ్యలు దూసుకు వ‌స్తాయి. ప్రతిప‌క్షాల‌కు చెమ‌ట‌లు ప‌డ‌తాయి. మూడు భాష‌ల్లో అన‌ర్గళంగా మాట్లాడ‌గ‌లిగిన నేర్పు ఆయ‌న సొంతం. కేంద్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే, రాజ‌కీయాల్లో వ్యూహాలు వేయ‌డంలోను, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయ‌డంలోను ఆయ‌న చొర‌వ చూప‌లేక పోయారు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా త‌న బ‌లా బ‌లాల‌ను కూడా అంచ‌నా వేయ‌లేక పోయారు. ఫ‌లితంగా నేడు పూర్తిగా రాజ‌కీయాల‌కే గుడ్ బై చెప్పాల్సిన ప‌రిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఆయ‌నే వైరిచెర్ల కిశోర చంద్ర సూర్యనారాయ‌ణ దేవ్‌. రాజుల వంశంలో జ‌న్మించిన ఆయ‌న త‌ర్వాత కాలంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. దాదాపు ఐదు సార్లు లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు.

మొత్తం కాంగ్రెస్ లోనే….

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ర‌ద్దయిన పార్వతీపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఆయ‌న అది ర‌ద్దయ్యి అర‌కు నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడ్డాక అర‌కు తొలి ఎంపీగా కూడా గెలిచారు. మ‌ధ్యలో ఒక సారి రాజ్యస‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. ఆయ‌న రాజ‌కీయాల్లో విజ‌య‌ప‌రంపర మొత్తం కూడా కాంగ్రెస్‌లోనే సాగింది. కేంద్రంలో అప్ప‌టి కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఈయ‌న ప్ర‌ధాన నాయ‌కుడిగా వెలుగులీనారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో 2011 నుంచి 2014 వ‌ర‌కు కూడా కిశోర్ చంద్రదేవ్ గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా చ‌క్రం తిప్పారు.

జగన్ పై విమర్శలు…..

అయితే, ఇన్ని సంవ‌త్సరాలు ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నా.. ప్రజాసేవ‌కే త‌న జీవితాన్ని అంకితం చేశాన‌ని చెప్పుకొన్నా కూడా.. ఆయ‌న రాజ‌కీయం అంతా కూడా ఓ పార్టీ నీడ‌లోనే సాగింది. దీంతో వ్యక్తిగ‌తంగా ఆయ‌న ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకోలేక పోయారు. ఈయ‌న మా మ‌నిషి అని చెప్పుకొన్నా.. కూడా ఓట్లు రాలే స్థాయిలో ఆయ‌న ప్రజ‌ల‌కు ఓన్ కాలేక పోయారు. దీంతో ఆయన ప‌రిస్థితి పార్టీ నీడ‌లోనే కొన‌సాగింది. సోనియా గాంధీ కుటుంబంతో ఉన్న స‌న్నిహిత సంబంధాల నేప‌థ్యంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఆయ‌న కుటుంబం కాంగ్రెస్‌లోనే కొన‌సాగింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా కాంగ్రెస్‌లోనే కొన‌సాగిన కిశోర్ చంద్రదేవ్ ఏపీలో కాంగ్రెస్ దెబ్బతిన‌డానికి వైసీపీ అధినేత జ‌గ‌నే కార‌ణ మంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు గుప్పించేవారు.

చివరి నిమిషంలో టీడీపీలోకి…..

వైసీపీ నాశ‌నం అయిపోతుందంటూ.. శాప‌నార్ధాలు పెట్టారు. నిజానికి వైసీపీ ఏర్పడక ముందు.. కాంగ్రెస్‌లోనే ఉన్న జ‌గ‌న్‌.. ఓదార్పు యాత్రలు చేస్తానంటే.. అడ్డుప‌డిన వారిలో దేవ్‌కూడా ఉన్నార‌ని ప్రచారం లో ఉంది. వ్యక్తిగ‌త క‌క్షలు లేక‌పోయినా.. కాంగ్రెస్‌పై ఉన్న అభిమానం ఆయ‌న‌తో అలా మాట్లాడేలా చేసింద‌ని, అప్పట్లో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వంటి వారు చెప్పేవారు. కాంగ్రెస్‌పై ఉన్న ఈ అభిమాన‌మే ఆయ‌న‌ను గ‌త ఏడాది ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కూడా కాంగ్రెస్‌లోనే ఉంచేలా చేసింది. అయితే, ఇక‌, కాంగ్రెస్ కోలుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఆయ‌న టీడీపీలోకి జంప్‌చేశారు.

ఇక కూతురి కోసమే…?

ఈ క్రమంలోనే అర‌కు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, గౌర‌వ‌ప్రద‌మైన ఓట్లు తెచ్చుకోవ‌డం ఒక్కటే ఆయ‌న‌కు ల‌భించిన ఉప‌శ‌మ‌నం. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న కుమార్తె శృతి దేవ్ కూడా రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అయితే, ఆమె కాంగ్రెస్ త‌ర‌ఫున అదే నియోజ‌క‌వ‌ర్గం అంటే అర‌కు నుంచే తండ్రిపై పోటీ చేశారు. ఈ క్రమంలో ఆమె కూడా ఓడిపోయారు. ఆమెకు అత్యంత దారుణంగా కేవ‌లం 17 వేల ఓట్లు మాత్రమే పోల‌య్యాయి. నిజానికి ఆ స‌మ‌యంలో శృతి దేవ్‌కు వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయిన‌ప్పటికీ.. ఆమె వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక‌, ఇప్పుడు ఈ తండ్రీ కూతుళ్లు ఎలాంటి రాజ‌కీయాలు చేయ‌డం లేదు. ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డం, కాంగ్రెస్ కోలుకోలేని స్థితి నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోవ‌డంతో వీరి రాజ‌కీయాలు ముందుకు సాగ‌వ‌ని అంటున్నారు ప‌రిశీలకులు.

Tags:    

Similar News