కోడెలను ఇలా వాడేసుకుంటున్నారే

కోడెల శివప్రసాద్ మరణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కోడెల ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. పోస్టు మార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే సాక్షాత్తూ [more]

Update: 2019-09-16 11:00 GMT

కోడెల శివప్రసాద్ మరణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కోడెల ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. పోస్టు మార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమంటున్నారు. కోడెల శివప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి అవమానాల పాలు చేసిందన్నారు. అవమానాలు తట్టుకోలేకనే కోడెల శివప్రసాద్ బలవన్మరణం పాలయ్యారని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పార్టీ అధ్యక్షుడే కోడెల శివప్రసాద్ మరణంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తున్నారు.

కేసులు ఆయనకు కొత్తేమీ…..

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కోడెల శివప్రసాద్ మెడపై గాయాలున్నట్లు చెప్పారు. అంటే సోమిరెడ్డి చెప్పిన దానిని బట్టి ఇది ఆత్మహత్య కాదని హత్యగా భావించాల్సి ఉంటుంది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదంటూనే ప్రభుత్వ వేధింపులే కోడెల శివప్రసాద్ మృతికి కారణమని చెప్పడం గమనార్హం. కోడెల శివప్రసాద్ పై కేసులు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయినా ఆయన ఏమాత్రం చలించలేదు.అయితే క్షణికావేశంలోనే ఆత్మహత్యలు జరుగుతాయని మానసిక వైద్యులు అంటున్నారు.

సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు…..

అయితే కోడెల శివప్రసాద్ నిన్న రాత్రి తన సన్నిహితులతో కూడా ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. తనపై కేసుల విషయంలో తాను భయపడబోనని, న్యాయపరంగా ఎదుర్కొంటానని వారితో అన్నట్లు చెబుతున్నారు. అయితే వరస కేసులతో తన పరువు పోతుందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోడెల శివప్రసాద్ నిన్న రాత్రి సన్నిహితులతో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి వాడు కాదని చెబుతున్నారు.

సంయమనం పాటించరా…?

మరోవైపు వైసీపీ నేతలు కోడెల శివప్రసాద్ మృతిని టీడీపీ రాజకీయం చేస్తుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నిజంగా ప్రభుత్వ వేధింపులే కారణమయితే ఆయన సూసైడ్ నోట్ ప్రభుత్వంపై రాసి ఉండేవారు కదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోడెల శివప్రసాద్ వంటి నేతలు మరణిస్తే…తాము చేసే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని కూడా నేతలు ఆలోచించడం లేదు. మొత్తం మీద కోడెల శివప్రసాద్ మరణం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా మార్చేశారు. కోడెల శివప్రసాద్ మృతి చెంది రెండు గంటలు కూడా గడవకముందే రాజకీయ దుమారం చెలరేగడం శోచనీయం. నేతలు సంయమనం పాటిస్తే బాగుంటుంది.

Tags:    

Similar News