వాళ్లు వేధిస్తే మీరు ఓదార్చారా….?

అవును పోయిన వారు ఎవరైనా…. మరణంతో వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏమీ అనలేం….! పోయాక తిట్టడం వల్ల ఏమి లాభం అనో., ప్రతిఫలం [more]

Update: 2019-09-17 08:00 GMT

అవును పోయిన వారు ఎవరైనా…. మరణంతో వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏమీ అనలేం….! పోయాక తిట్టడం వల్ల ఏమి లాభం అనో., ప్రతిఫలం అనుభవించకుండా పోయాడనే అసంతృప్తితోనో చాలా సార్లు క్లుప్తంగా RIP అని సరిపెట్టుకోవాలి. అప్పుడెప్పుడో ఆయన ఇంట్లో బాంబులు పేలి., పూదోట వాళ్ళబ్బాయి చనిపోయడంటే ఇంట్లో కథలు కథలుగా చెప్పుకోవడం గుర్తు. వాళ్ళ మేనల్లుడు చనిపోయాడని అమ్మ సహచరురాలు బాధ పడుతుంటే… తోటి ఉద్యోగిగా అమ్మ కూడా బాధ పడేది. మంచోడే కానీ బంధువుల్ని కూడా బలి చేశాడని ఊహ తెలిసిన రోజుల్లో కథలు, కథలుగా చెప్పేవాళ్ళు. అవన్నీ వినడమే కానీ ఎప్పుడు ఆయన ప్రత్యక్షంగా తెలీదు. పుష్కరం క్రితం పేటలో ఆమరణ దీక్ష చేసినప్పుడు ఓ వారం రోజుల పరిచయం. భలే ఉన్నాడే…ఫ్యాక్షన్ లీడర్ మోనార్క్ అనిపించింది. రాజకీయం ఇలాగే ఉంటుంది ఏమో అనిపించింది.

సుతిమెత్తని హెచ్చరికలు……

2008లో విజయవాడ బందరు రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ యజమానిని బెదిరించి, షట్టర్లు మూసి కొట్టి బలవంతంగా ఆయన కొడుకు రూ.5లక్షలు వసూలు చేసుకు పోయినపుడు మరో అనుభవం. ఆ వార్త ఇచ్చినందుకు పైనుంచి అక్షింతలు. ఆ ఘటన జరిగినప్పుడు నువ్వు ఉన్నావా.? చూశావా? అని దబాయింపు. క్షణాల్లో ఆ వార్త తెర నుంచి మాయం. ఇదే విషయంలో ఆ రోజు రాత్రి తెలిసిన వారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన అలాంటి వారు కాదే…? వారబ్బాయి బాగా తెలుసు. ఇందాకే నేను ఆయనతో మాట్లాడాను. ఈ గొడవ గురించి ఆయన నాతో ఏమి అనలేదే.? ఆయనలాంటి మంచివారిపై వార్తలు వేసే ముందు కాస్త జాగ్రత్తయ్యా అని సుతిమెత్తని హెచ్చరికలాంటిది చేశాడు. ఇదంతా తర్వాతి కాలంలో అలవాటై పోయింది.

చాలా కాలం తర్వాత……

మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత స్పీకర్ గా అసెంబ్లీలో కనిపించారు. జెంటిల్ మాన్ అనిపించింది మొదట్లో. సభలో ప్రత్యక్షంగా చూడటం మొదలయ్యాక ఇతనేంటి ఇంత సంకుచితంగా ఉన్నాడు అనిపించింది. సభ్యుల్ని మాట్లాడేందుకు అనుమతించే విషయంలో అతని తల కదిలించే తీరు ఓ సంజ్ఞలా అనిపించేది. ప్రత్యర్థుల్ని తిట్టేందుకు అధికార పక్ష సభ్యుల్ని ప్రోత్సహించేలా ఒకలా… విపక్ష సభ్యుల్ని నిరాకరించే క్రమంలో మరోలా ఆ తల ఊగేది. అంతకు మించి నోరు విప్పి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని చిరాకుగా అనిపించేది. అన్నింటికి మించి గత ఐదేళ్లలో ముఖ‌్యంగా అసెంబ్లీ అమరావతి తరలి వచ్చాక స్పీకర్ కుర్చీలో ప్యానల్ స్పీకర్‌ కూర్చునే అవకాశమే రాలేదు. విరామం ఇచ్చినా ఠంచనుగా మళ్లీ వచ్చి ఆ సీట్లో అతుక్కునే వారు. ఆ ఎదురుగా కూర్చుని ఉండే డిప్యూటీ మండలి బుద్ద ప్రసాద్ మీద పైన ఉన్న గ్యాలరీల నుంచి సెటైర్లు పేలేవి. ఆయన ఆ కుర్చీలో కూర్చునే అవకాశమే రాకుండా ఐదేళ్లు గడిచిపోయాయి. మెల్లగా అందులో ఆంతర్యం అర్ధమయ్యాక అవ్యక్తమైన భావన. తర్వాత ఓ ప్రత్యక్ష అనుభవం. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి తన కుమార్తె చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పత్రాలు నిబంధనల ప్రకారం ఉన్నా ఆ బిల్లులు మంజూరు కాలేదు. అప్పట్లో అక్కడ చక్రం తిప్పిన అధికారి సదరు ఎమ్మెల్యే నేరుగా వచ్చి అభ్యర్థిస్తే ఆ బిల్లు మంజూరు అవుతుందని ఎమ్మెల్యే కి తేల్చి చెప్పారు. ఆయన భరించలేని దుఃఖంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ బిల్లు కోసం ఆయన వెళ్లి అభ్యర్దించారో లేదో తెలీదు.

అదే సామంత రాజ్యం…

ఆయన హయాంలో ఆ ప్రాంగణం మొత్తం ఆయన రాజ్యంగా ఉండేది. ఎవరెవరో పెత్తనం చేసే వాళ్ళు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సొంత రాజ్యం నుంచే వచ్చే వాళ్ళు. వాళ్ళు కూడా కప్పం కడితేనే కొలువులోకి వచ్చామని చెప్పుకునే వాళ్ళు. ఇక ఆయన ప్రాపకం పొందాను అనుకున్న అధికారికి ప్రావిడెంట్ ఫండ్ మొత్తం ఖాళీ అయ్యాక కానీ తత్వం బోధ పడలేదు. విదేశీ ప్రయాణాల్లో ఖర్చుల భారం మోసేందుకు పొదుపు ఖాతా మొత్తం ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పూడ్చుకోవచ్చంటే ఆ అధికారి గుడ్డిగా నమ్మేశాడు. శాసనసభ సమావేశాల్లో ఏర్పాట్లు చేస్తే గట్టి లాభాలు వస్తాయని నమ్మి పల్నాడుకు చెందిన ఓ టెంట్ షాప్ యజమాని కూడా ఇలాగే ఆరిపోయాడు. ఎన్నికల కోడ్ వచ్చాక కొన్ని కోట్ల రూపాయల బిల్లుల మంజూరుకు సంబంధించి ఓ అధికారికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చేది. వేసవిలో పశువుల దాణా వినియోగించే సైలెజ్ సరఫరా బిల్లులు విడుదల చేయాలనేది దాని సారాంశం. అసలు పండించకుండా, రైతులకు సరఫరా చేయకుండా వాటి మేత ఖర్చు చెల్లించాలి అని నిత్యం ఫోన్లు వస్తే ఆ అధికారి తల పట్టుకునే వాడు. మూగ జీవాల తిండి కూడా వదలరా అని అతను విసుక్కునే వారు. ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి. ఆయన అదృష్టం కూడా తిరగబడింది. జనం మాత్రం ఏ బాధ లేకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు అనుకోవడం తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోయారు. ఇప్పుడు మాత్రం పోయినోళ్లంతా మంచోళ్ళు అనుకోవడమే.

జనం సులువుగానే గుర్తిస్తారు…..

కులానికి కష్టం వచ్చినపుడు దానిని అందరి కష్టంగా….. జనాల్ని మభ్య పెట్టడంలో మాధ్యమాలు ముందుంటాయి. వీటి ఉద్దేశాలు., ఆలోచనలు., ప్రయోజనాలు ఈ విషయంలో స్పష్టం. జాతి ప్రయోజనాలను జనం ప్రయోజనాలు మభ్య పెట్టడమే ఇందులో దాగి ఉన్న అర్ధం. పరమార్దం…. దీనికి రాజకీయ ముద్ర వేసుకోవడం., ప్రజల మెదళ్లలో సానుభూతి సంపాదించడం వాటి ఉద్దేశం. పోయిన వారి గురించి చెడుగా మాట్లాడటం సబబు కాదు కానీ, మరణానికి దైవత్వాన్ని, ధైర్యాన్ని, వీరత్వాన్ని అపాదించడం తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే ధోరణిని జనం పసిగట్టేస్తున్నారు. ఓ చావుతో కలిగే నష్టం ఎక్కువ ఆ కుటుంబానికి. వారిపై ఆధారపడి ఉండే వారికే ఎక్కువ ఉంటుంది. “నీతిమంతులు., నిజాయితీపరులు., ధైర్యవంతుల్ని బతకనివ్వరా…. అని ఆవేశంగా నిలదీయడం బాగుంటుంది కానీ ప్రజల్ని రెచ్చగొట్టి అందులో లబ్ది పొందాలనుకోవడం కూడా ఇట్టే గ్రహించొచ్చు. అలాంటి వారికి కష్టం వచ్చినపుడు అండగా నిలిచి, ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే బాగుండేది. ఆ ప్రయత్నం ఈ మూడు నెలల్లో ఎప్పుడు ఈ వైపు నుంచి కనిపించలేదు. ఇప్పుడు మరణంలో కూడా రాజకీయ లాభాన్ని వెదుక్కోవడాన్ని కూడా జనం సులువుగానే గుర్తిస్తారు.

పార్టీదీ అంతే బాధ్యత కాదా?

ఆ ఆత్మహత్యకు ప్రభుత్వ కక్ష సాధింపే కారణమైతే., అవసరానికి వాడుకుని వదిలేసిన పార్టీది కూడా అంతే బాధ్యత అవుతుంది. పదేళ్ల నిరీక్షణ…. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చాక అందరితో పాటే మంత్రి పదవి ఆశించినా నెరవేర్చని నాయకత్వానిది అవుతుంది. తన కంటే జూనియర్లకు మంత్రి పదవులు దక్కినా ఆయన మాత్రం ఓ నామమాత్రపు పదవికి పరిమితం చేసిన వారిది అవుతుంది. అపరిమితమైన ఆశలు., అవసరాలు ఉన్న చోట., ఆయన్ని ఓ గదికి పరిమితం చేసి రాజకీయం చేశారు. చివరి వరకు మంత్రి పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన విస్తరణలో పార్టీ ఫిరాయించిన వారికి పదవులు దక్కాయి. వారి ఫిరాయింపుల్ని చూసి చూడనట్లు వదిలేసినా అధినేత అనుగ్రహం మాత్రం లభించలేదు. చివరకు ఆయన చావు కూడా పార్టీ ప్రయోజనాలకే ఉపయోగపడుతోంది. రాజకీయాల్లో హత్యలుండవు…. ఆత్మహత్యలే….. ఈ ఆత్మహత్యకు అసలు కారణాలు ఆయనకు తప్ప ఎవరికి తెలీవు…. రెస్ట్‌ ఇన్ పీస్ అనుకోవడం తప్ప.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News