పల్నాటి పులి…కోడెల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తెలుగు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రవేశారు. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఆయ‌న డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గానే కాకుండా… [more]

Update: 2019-09-16 09:30 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తెలుగు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రవేశారు. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఆయ‌న డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గానే కాకుండా… కొన్ని సార్లు వివాస్ప‌ద నేత‌గా కూడా గుర్తింపు పొందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌ తర్వాత రాష్ట్ర శాసనసభకు మొదటి స్పీకర్‌గా కోడెల పనిచేశారు. డాక్టర్‌ కోడెలగా శివప్రసాదరావు సుపరిచితులు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న కోడెల జన్మించారు. 1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ నాయకత్వంలో తెదేపాలో చేరారు.

ఐదుసార్లు వరసగా…..

1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల.. అపజయమెరుగని నేతగా గుర్తింపు పొందారు. 1983 నుంచి 1999 వరకు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా… 2014లో సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కు తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఆయ‌న రికార్డుల‌కు ఎక్కారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన కోడెల.. 1987-88లో రాష్ట్ర హోంమంత్రిగా, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖమంత్రిగా, 1997-99లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సేవలు అందించారు.

ఎంబీబీఎస్ చదివి…..

ఆయనకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు. స‌త్య‌నారాయ‌ణ గ‌తంలోనే రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందారు. అప్పుడు కొడుకు మృతితోనే కోడెల మాన‌సికంగా కుంగిపోయారు. గుంటూరు జిల్లా సిరిపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన కోడెల.. గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. కర్నూలులో ఎం.ఎస్‌. సర్జన్‌ పూర్తిచేసిన కోడెల వైద్యుడిగా.. అనంతరం రాజకీయ నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు.

శిష్యులు ఎందరో…..

డాక్ట‌ర్ గానూ… ప‌ల్నాటి పులిగాను గుంటూరు జిల్లాలో కోడెల శివ‌ప్ర‌సాద్ ప్ర‌సిద్ధికెక్కారు. జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న ఎంతో మంది శిష్యుల‌ను త‌యారు చేశారు. య‌ర‌ప‌తినేని, జీవి.ఆంజ‌నేయులు, ఆల‌పాటి రాజా, న‌క్కా ఆనంద్‌బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావు వీళ్లంతా కోడెల శిష్యులే. ఇక టీడీపీలో ఆయ‌న అగ్ర‌నేత‌గా ఎదిగారు.
గత ఎన్నికల్లో ఓటమితో పాటు.. పలు వివాదాస్పద అంశాల కారణంగా ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. చివరికి ఆత్మహత్యకు పాల్పడి… హఠాన్మరణం పొందడం.. తెదేపా శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచింది.

Tags:    

Similar News