కోడెల అసలు టెన్షన్ అదే

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆశలన్నీ అడియాసలయినట్లేనా? ఇక ఆయన రాజకీయ వారసత్వం అక్కరకు రాదా? ఇదీ ఆయన పడుతున్న ప్రధానమైన టెన్షన్. కేసులు ఇప్పుడుంటాయి. వెళతాయి. [more]

Update: 2019-09-04 09:30 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆశలన్నీ అడియాసలయినట్లేనా? ఇక ఆయన రాజకీయ వారసత్వం అక్కరకు రాదా? ఇదీ ఆయన పడుతున్న ప్రధానమైన టెన్షన్. కేసులు ఇప్పుడుంటాయి. వెళతాయి. దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ రాజకీయం అలా కాదు. భవిష్యత్తు ఎంతో ఉన్న తన కుటుంబం 2019 ఎన్నికల తర్వాత వివిధ రకాల ఆరోపణలతో భ్రష్టుపట్టి పోయింది. కోడెల శివప్రసాద్ దిగులంతా ఆయన రాజకీయ వారసత్వంపైనే అంటున్నారు ఆయన సన్నిహితులు.

మంచి పేరున్నా….

తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఒకనాడు పల్నాడు పులిగా ప్రసిద్ది గాంచారు. పల్నాడులో చీమ చిటుక్కుమనాలన్నా కోడెల శివప్రసాద్ కు తెలియాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేసిన కోడెల శివప్రసాద్ తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తగిన ప్రాధాన్యత లభించింది. పల్నాడు ప్రాంతంలో పట్టున్న నేతగా పేరున్న కోడెల శివప్రసాద్ కు ఎన్టీరామారావు, చంద్రబాబులు ఇద్దరూ మంచి ప్రయారిటీ ఇచ్చారు.

పరువు గంగపాలు చేసి…..

అయితే 2019 ఎన్నికలకు ముందు నుంచే ఆయన పరపతి గణనీయంగా తగ్గిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచిన తర్వాత కోడెల శివప్రసాద్ నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడు శివరామ్ కు అప్పగించారు. ఇదే ఆయన చేసిన పెద్దతప్పుగా కోడెల కుటుంబ సభ్యులు సయితం అంగీకరిస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని దందాలకూ తెరలేపిన శివరామ్ తండ్రి శివప్రసాద్ కు చెడ్డపేరు తెచ్చారు. పైసలు లేనిదే పనికాదన్నట్లుగా సొంత పార్టీ నేతలను సయితం వదలకపోవడంతో కోడెల శివప్రసాద్ గత ఎన్నికల్లో ఘోరంగ ఓటమి పాలయ్యారు.

వారసత్వంపై ఆందోళన….

తర్వాత ఎన్నికలకు శివరామ్ ను రాజకీయ అరంగేట్రం చేయించాలనుకున్నారు కోడెల శివప్రసాద్. సత్తెన పల్లిలో మంచి ఫౌండేషన్ వేద్దామనుకున్నారు. కానీ అనేక ఆరోపణలు, అనేక కేసులు కోడెల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాయి. కేసులు గిట్టని వారు పెట్టారనుకున్నప్పటికీ, ప్రభుత్వం వేధింపులేనని చెప్పాలనకున్నా అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే జిల్లాలోనే ఏ ఎమ్మెల్యేకు రానంత బ్యాడ్ నేమ్ కోడెల శిపవ్రసాద్ కుటుంబానికి వచ్చింది. దీనికి కారణం శివరామ్ అని చెప్పకతప్పదు. కుమార్తెపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూడా కోడెల కుటుంబాన్ని పక్కన పెట్టాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. దీంతో కోడెల ఆవేదనంతా తన రాజకీయ వారసత్వం గురించేనన్నది ఆయన వర్గంలో విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News