ఎవరన్నారు కలవరని?

రాజకీయాల్ల్లో విడిపోవడం కలవడం అన్నది కూడా వ్యూహమే. అంతిమ లక్ష్యం వారు కోరుకున్నది జరగాలన్నదే. అందుకోసం ఏమైనా చేస్తారు. ఇక ఉత్తరాంద్ర్హాలో చూసుకుంటే విజయనగరం జిల్లాలో మంత్రి [more]

Update: 2020-09-25 12:30 GMT

రాజకీయాల్ల్లో విడిపోవడం కలవడం అన్నది కూడా వ్యూహమే. అంతిమ లక్ష్యం వారు కోరుకున్నది జరగాలన్నదే. అందుకోసం ఏమైనా చేస్తారు. ఇక ఉత్తరాంద్ర్హాలో చూసుకుంటే విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణకు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే మండుతుందని అందరికీ తెలిసిందే. ఇద్దరికీ ఒక్కరే గురువు. ఆయనే దివంగత సాంబశివరాజు. అక్కడ ఓనమాలు నేర్చిన ఈ ఇద్దరూ రాజకీయంగా కాంగ్రెస్ లోనే పాఠాలు చదివారు. కాలం, క్యాస్టూ కలసి వచ్చి బొత్స ఉన్నతమైన పదవులు అధిరోహించారు. కులమే అడ్డుగా నిలిచి కోలగట్ల కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.

మూడు దశాబ్దాలుగా …..

ఇదిలా ఉంటే కోలగట్ల వీరభద్రస్వామి మూడు దశాబ్దాలుగా ఉంటూ పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో చేరినా కూడా వెనక ఉండి వెన్నుపోట్లు పొడిచింది మాత్రం బొత్స వర్గం అంటారు. అలా బొత్స అంటే కోలగట్ల వర్గం నిప్పులు చెరుగుతుంది. నిజానికి కోలగట్ల వీరభద్రస్వామి అంటే జగన్ కి ఇష్టం. అంతకు ముందు వైఎస్సార్ కి ఆయన ప్రీతిపాత్రుడే. కానీ ఆయనకు ఏ పదవి ఇచ్చినా బొత్సకు గిట్టదు కాబట్టి అలాగే ఖాళీగా ఉంచేశారు. జగన్ ఆయన్ని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇచ్చారు. ఇక మంత్రి కోరిక మాత్రం ఇప్పటికీ తీరలేదు.

అక్కడా దెబ్బే …..

ఇక విజయనగరం మేయర్ పదవిని తన కూతురు శ్రావణికి ఇప్పించుకుని తన రాజకీయ వారసురాలిగా చూసుకుందామనుకున్న కోలగట్ల వీరభద్రస్వామి కోరిక తీరలేదు. మేయర్ సీటుకు రిజర్వేషన్ తెచ్చి కోలగట్ల ఆశలు బొత్స వర్గం కాకుండా చేసిందని కూడా గుర్రు ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఈ ఇద్దరు నేతల్లొ కలసిపోయారని టాక్ నడుస్తోంది. దానికి ఇద్దరికీ ఉన్న కొన్ని మైనస్ పాయింట్లేనని అంటున్నారు. బొత్స ప్రభ మెల్లగా తగ్గుతోంది. జగన్ టేబిల్ మీద బొత్స వర్గం చేస్తున్న ఆగడాల జాబితా ఉందని అంటున్నారు. దానికి తోడు బోత్స హై హ్యాండ్ మెంటాలిటీ కూడా జగన్ దృష్టిలో ఉందని అంటున్నారు. ఈ పరిణామాలతో బొత్స కాస్తా తగ్గారని చెబుతున్నారు. జిల్లాలో వర్గాలు లేకుండా అందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్నారని చెబుతున్నారు.

కలివిడిగా…..

ఇక నిన్నటి వరకూ ఇద్దరూ శత్రువులుగా ఉండేవారు, విడివిడిగా రాజకీయం చేసేవారు. కానీ ఇపుడు మాత్రం కలివిడిగా సందడి చేస్తున్నారు. ఇద్దరూ ఒకే మాట అంటున్నారు. కలసిమెలసి ఉండాలనుకుంటున్నారుట. ఇది నిజంగా ఆశ్చర్యపోయే నిర్ణయమే. బొత్స కోలగట్ల వీరభద్రస్వామి కలవరు అని డిసైడ్ అయిన వారు కూడా ఆసక్తిగా ఈ పరిణామాలను చూస్తున్నారుట. ఇక కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయంగా వచ్చే ఎన్నికల నుంచి రిటైర్ అవుదామనుకుంటున్నారు. తన వారసులను రంగంలోకి దించాలనుకుంటున్నారు. బొత్స కూడా తన రాజకీయ హవాకు బ్రేకులు పడుతున్నాయని గ్రహించి పాత స్నేహానికి బాటలు వేశారని చెబుతున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే జగన్ నుంచి వచ్చిన సూచనల మేరకే ఇద్దరూ జిల్లాలో ఒక్కటిగా ఉంటున్నారని అంటున్నారు. ఈ పరిణామం వల్ల వైసీపీకి రాజకీయంగా లాభం చేకూరుతుందని అంటున్నారు. మొత్తానికి కోలగట్ల వీరభద్రస్వామికి మరో ఏడాదిలో మంత్రి పదవి దక్కుతుందా అన్న చర్చ కూడా నడుస్తోందిట.

Tags:    

Similar News