కోనకు సెగ…. బాప‌ట్లలో మారిన పొలిటిక‌ల్ సీన్‌

గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశ‌, నిస్పృహ‌లు క‌నిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం [more]

Update: 2020-12-21 14:30 GMT

గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశ‌, నిస్పృహ‌లు క‌నిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. బాప‌ట్లలో పొలిటిక‌ల్‌ సీన్ ఎందుకు ఇలా మారిపోయింది ? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. మాజీ స్పీక‌ర్‌, మాజీ గ‌వ‌ర్నర్ కోన ప్రభాక‌ర్ రాజ‌కీయ వార‌సుడు అయిన కోన ర‌ఘుప‌తి బాప‌ట్లలో వైసీపీ నుంచి రెండుసార్లు వ‌రుస‌గా గెలుస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత బ్రాహ్మణ సామాజిక వ‌ర్గం కోటాలో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించినా జ‌గ‌న్ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని అప్పగించారు. ఆయ‌న సౌమ్యుడు, వివాద ర‌హితుడు, దూకుడు రాజ‌కీయాల‌కు దూరం. వివాదాల‌కు మ‌రింత దూరం. ఇదే.. కొన్నాళ్లుగా ఆయ‌నకు ప్లస్ అయింది.

అభివృద్ధి విషయంలో….

ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దగా అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోయినా.. ప్రజ‌లు కోన ర‌ఘుప‌తి వెంటే ఉన్నారు. 2014లో విజ‌యం సాధించిన ర‌ఘుప‌తి.. అప్పట్లో పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో తాను ఏమీ చేయ‌లేక‌పోయానంటూ.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారం చేసుకున్నారు. ఇది కొంత వ‌ర‌కు స‌హేతుక‌మైన విష‌యం కావ‌డం, మ‌రోవైపు టీడీపీ నుంచి పోటీ చేసిన నాయ‌కుడు ప్రజ‌ల‌కు దూరంగా ఉండ‌డం, అంతో ఇంతో కోన ర‌ఘుప‌తి స్థానికంగా ఉండ‌డంతో ప్రజ‌లు ఆయ‌న చెప్పింది విన్నారు. ఓట్లు వేశారు. మ‌రి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. డిప్యూటీ స్పీక‌ర్ అయ్యారు. ఈ క్రమంలో నైనా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవాలి క‌దా ? అంటే.. ఆయ‌న ఎక్కడా ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న‌వ‌ద్దకు వ‌చ్చేవారిని ఊర‌డింపు వాక్యాలు చెబుతున్నారే త‌ప్ప స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం కృషి చేయ‌డం లేదు.

ప్రజలకు దూరంగా…..

పైగా.. గ‌తంలో మాదిరి కోన ర‌ఘుప‌తి ప్రజ‌ల మ‌ధ్యకు రావ‌డ‌మూ లేదు. తాను రాజ్యాంగ బ‌ద్ధమైన ప‌ద‌విలో ఉన్నాన‌ని (నిజానికి కాదు. స్పీక‌ర్ మాత్రమే రాజ్యాంగ బ‌ద్ధం) చెబుతున్నారు. దీంతో ప్రజ‌లు, అభిమానులు, పార్టీ కార్యక‌ర్తలు కూడా విసిగిపోతున్నార‌నేది వాస్తవం. నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా ఆధిప‌త్యం చెలాయిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి వ‌రుస‌గా రెండుసార్లూ కూడా మాజీ మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి నాన్ లోకల్ అయినా విజ‌యం సాధించారు. ఈ వ‌ర్గం ఓట్లే 35 వేల వ‌ర‌కు ఉన్నాయి. వీరంతా గ‌త ఎన్నిక‌ల‌కు ముందే రెడ్లకే వైసీపీ సీటు ఇవ్వాల‌ని.. పార్టీ త‌మ‌దే అంటూ నానా హ‌డావిడి చేసినా జ‌గ‌న్ చివ‌ర‌కు సిట్టింగ్‌గా ఉన్న కోన ర‌ఘుప‌తికే సీటు ఇచ్చారు.

ప్లానింగ్ లేకపోవడంతో…

అయితే దూకుడు లేక‌పోవ‌డం, రెండుసార్లు గెలిచినా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై ప్లానింగ్ లేక‌పోవ‌డం కోన ర‌ఘుప‌తికి మైన‌స్ అయ్యాయి. ఇదిలావుంటే.. టీడీపీలో మారిన ప‌రిణామాల‌కు ప్రజ‌లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ ప్రజా స‌మ‌స్యల‌పై కాకితో క‌బురుపెట్టినా స్పందిస్తున్నారు. తానే స్వయంగా నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రతి గ్రామానికీ వెళ్తున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆయ‌న త‌న‌కు టికెట్ ఇవ్వక‌పోయినా.. పాద‌యాత్రగా తిరిగారు. ఇప్పుడు ఎలానూ ఇంచార్జ్‌గా ఉన్నారు క‌నుక‌.. ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు. దీంతో ఎవ‌రు త‌మ‌కు ఏప‌ని కావాల‌న్నా.. న‌రేంద్రవ‌ర్మ వైపు చూస్తున్నారు.

ఆయన దూకుడు పెంచడంతో…..

ఇక‌, వేగేశ్న త‌న అనుచ‌రుల బ‌లాన్ని పెంచుకున్నారు. గ్రామ గ్రామాన‌, మండ‌లాల ప‌రిధిలోనూ అనుచ‌రుల‌ను పెట్టి.. త‌న పోన్ నెంబ‌రును ప్రజ‌ల‌కు చేరువ చేశారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న న‌రేంద్ర వ‌ర్మ పార్టీల‌తో సంబంధం లేకుండా సొంత నిధుల‌తో ప్రజ‌ల‌కు చేరువ అవుతున్నారు. విచిత్రం ఏంటంటే రెడ్డి వ‌ర్గంలో కూడా కొంద‌రు న‌రేంద్ర వ‌ర్మకు ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తోన్న ప‌రిస్థితి బాప‌ట్లలో ఉంది. రెడ్లలో కొంద‌రిని కోన ర‌ఘుప‌తి ప‌క్కన పెడితే మ‌రి కొంద‌రు పైన పార్టీ మాది.. మా సీఎం ఉన్నాడు అని లెక్క చేయ‌ట్లేదు. ఈ ప‌రిణామాలు.. డిప్యూటీ స్పీక‌ర్‌లో ద‌డ‌పుట్టిస్తున్నాయి. మ‌రి ఇప్పట‌కి అయినా ఆయ‌న ప‌రిస్థితి చ‌క్కదిద్దుకుంటాడా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News