రూరల్ రూలర్ కోటంరెడ్డి..?
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించిన నెల్లూరు జిల్లాలో ఈసారి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఈసారి జిల్లాలో మరింత బలపడినందున మొత్తం [more]
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించిన నెల్లూరు జిల్లాలో ఈసారి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఈసారి జిల్లాలో మరింత బలపడినందున మొత్తం [more]
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించిన నెల్లూరు జిల్లాలో ఈసారి ఎటువంటి ఫలితాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఈసారి జిల్లాలో మరింత బలపడినందున మొత్తం అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేయాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. ఇక, గత ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపలేకపోయినా ఈసారైనా జిల్లాలో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచించింది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నించింది. ప్రతీ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో జిల్లాలోని అన్ని స్థానాల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని 25 వేల భారీ మెజారిటీతో గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కచ్చితంగా గెలుచుకుంటామని భావిస్తుంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ పోటీ చేశారు.
బలమైన నేతగా ఉన్న కోటంరెడ్డి
2014లో ఇక్కడ పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీ.. బీజేపీకి వదిలేసింది. బీజేపీ అభ్యర్థి సురేష్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 25 వేల ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచినా ప్రతిపక్షానికి పరిమితం కావడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కోటంరెడ్డి ఫెయిల్ అయ్యారు. అయితే మాస్ లీడర్ గా గుర్తింపు ఉండటం, ప్రజల్లో ఉంటారనే పేరుండటం ఆయనకు కలిసి వచ్చింది. ఇదే సమయంలో పలు వివాదాలు ఆయనపై రావడం కొంత చేటు చేసింది. ఆయన స్వంత బలంతో పాటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండటంతో ఆయన విజయంపై ధీమాగా ఉన్నారు.
టీడీపీకి కలిసొచ్చిన అభివృద్ధి
ఇక, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ మేయర్ కావడం ఆయనకు కలిసివచ్చింది. ఈ నియోజకవర్గం పరిధిలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 26 రెవెన్యూ డివిజన్లు ఉండటంతో ఆయన అభివృద్ధి ఆయనకు ఖాతాలో వేసుకున్నారు. నెల్లూరు నగరంలో ఈ ఐదేళ్ల కాలంలో బాగా అభివృద్ధి జరిగింది. ఇది సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణకు, రూరల్ లో మేయర్ అజీజ్ కు కలిసివచ్చిందని టీడీపీ లెక్కలు కట్టుకుంటుంది. అయితే, గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. 2009లో ఈ స్థానాన్ని సీపీఎంకు వదిలేసింది. 2014లో బీజేపీకి కేటాయిచింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ బలంగా లేదు. ఇక, మొదట పార్టీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీ ప్రకటించింది. తర్వాత ఆయన టిక్కెట్ వదులుకొని వైసీపీలో చేరారు. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం లేదనే ఆయన పార్టీ మారారనే ప్రచారం జరగడం ఎన్నికల ముందు టీడీపీకి మైనస్ అయ్యింది.
జనసేన ఎవరికి మైనస్..?
ఇక, ఇక్కడ జనసేన ప్రభావం కూడా ఉండవచ్చు. 2009లో ప్రజారాజ్యం ఇక్కడ రెండో స్థానంలో ఉంది. సీపీఎంకు కూడా ఇక్కడ కొంత బలం ఉంది. ఇప్పుడు సీపీఎం, జనసేన కలిసి పోటీ చేయడం, రెడ్డి సామాజకవర్గానికి చెందిన మనుక్రాంత్ రెడ్డి పోటీ చేయడంతో భారీగానే ఓట్లు సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే జరిగింది. విజయావకాశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నా మెజారిటీ మాత్రం భారీగా తగ్గవచ్చు అనే విశ్లేషణలు ఉన్నాయి.