కోట్ల ఎఫెక్ట్… ఎవరికి ప్లస్… ఎవరికి మైనస్..?
ఆంధ్ర పదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్లుగా అధికారం, హోదాకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి [more]
ఆంధ్ర పదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్లుగా అధికారం, హోదాకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి [more]
ఆంధ్ర పదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్లుగా అధికారం, హోదాకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి పూర్వవైభవం కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో కీలక నేత అయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉంటూ… టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించిన కోట్ల కుటుంబం అదే టీడీపీలో చేరుతుండటం జిల్లా రాజకీయాల్లో మార్పులకు అవకాశమిచ్చింది. కోట్ల కుటుంబం తమ పార్టీలో చేరడం ద్వారా కొంత బలహీనంగా ఉన్న కర్నూలు జిల్లాలో బలం పుంజుకునే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే, ఆయన రాక టీడీపీలో కొంతమంది నేతలకు ఎర్త్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక, కోట్లను వైసీపీలోకి కాకుండా టీడీపీలో చేరడంతో వైసీపీకి కొంత నష్టంతో పాటు మేలు కూడా చేసే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
టీడీపీలో టిక్కెట్ల చిచ్చు రేగుతుందా..?
కర్నూలు జిల్లాలో బలమైన నేతగా ఉన్న సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపిస్తారు. డోన్, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. కర్నూలు జిల్లాలో వైసీపీతో పోల్చుకుంటే బలహీనంగా ఉన్న టీడీపీకి ఇది కలిసి వస్తుంది. ఇక, కోట్ల వంటి బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి అనుకూలంగా ఉన్న రెడ్డి ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకోవాలనేది కూడా టీడీపీ వ్యూహం. అయితే, కోట్ల కుటుంబానికి ఏయే సీట్లు ఇస్తారనేది ఇప్పుడు కర్నూలు నేతల్లో చర్చనీయాంశమైంది. కర్నూలు ఎంపీ స్థానాన్ని కోట్ల అడిగే అవకాశం ఉంది. అయితే, అక్కడ ఇప్పటికే ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. ఆమె మరోసారి టిక్కెట్ తనదే అనే ధీమాతో ఉన్నారు. కోట్ల రాకతో ఆమె టిక్కెట్ కు ఎర్త్ ఖాయమని తెలుస్తోంది. ఇక, డోన్ తో పాటు మరో అసెంబ్లీ స్థానాన్ని సైతం కోట్ల కుటుంబం అడుగుతోంది. గత ఎన్నికల్లో డోన్ నుంచి కేఈ ప్రతాప్ టీడీపీ నుంచి పోటీ చేశారు. కోట్ల కుటుంబానికి ఆ టిక్కెట్ దక్కే అవకాశం ఉండటంతో ఆయనకు ఈసారి ఛాన్స్ కష్టమే అంటున్నారు.
వైసీపీకి నష్టమేనా..?
ఇక, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోసం వైసీపీ కొంత ప్రయత్నం చేసిన చేర్చుకోలేకపోయారు. అయితే, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రత్యర్థి టీడీపీలో చేరడం ద్వారా వైసీపీకి కొంత మేర నష్టమే. కానీ, సామాజకవర్గ సమీకరణలను బట్టి చూస్తే వైసీపీకి కొంత మేలు కూడా జరుగుతుందని అంటున్నారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీ ఓటర్లు అధికం. కోట్లను గనుక చేర్చుకొని ఉంటే ఆయనకు ఈ స్థానాన్ని కేటాయించాల్సి వచ్చేది. ఇక, వైసీపీ రెడ్డి పార్టీ అనే ముద్ర మరింత బలోపేతమయ్యేది. ఇప్పుడు కర్నూలు ఎంపీ స్థానాన్ని బీసీలకు కేటాయించేందుకు వైసీపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ బీసీలకే కేటాయించి గెలుచుకుంది. దీంతో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీకి అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కోట్ల కుటుంబం కనుక వచ్చి ఉంటే పాతవారిని కదిలించి కొత్త తలనొప్పులు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇక, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరినా ఆయన సోదరుడు మాత్రం వైసీపీలోకి రావడం వైసీపీకి కొంత మేలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి కోట్ల వంటి బలమైన నేత ప్రత్యర్థి పార్టీ టీడీపీలో చేరడం వైసీపీకి కొంత నష్టం చేసేదే అయినా… ఈ సమయంలో ఆయనను వైసీపీలో చేర్చుకోకపోవడం కూడా మేలే చేస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి.