కోట్ల కుదురుకునేదెప్పుడు?

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి… ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడిగా, మాజీ కేంద్రమంత్రిగా సుపరిచితులు. అయితే గత రెండు ఎన్నికలలో వరస ఓటమితో కోట్ల సూర్య [more]

Update: 2019-09-07 13:30 GMT

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి… ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడిగా, మాజీ కేంద్రమంత్రిగా సుపరిచితులు. అయితే గత రెండు ఎన్నికలలో వరస ఓటమితో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పూర్తిగా డీలా పడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి రెండు టిక్కెట్లను దక్కించుకున్న కోట్ల కుటుంబం దారుణంగా పరాజయం పాలయింది. అప్పటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువగా గడుపుతున్నారు. రాజధాని, పోలవరం పై ఇంత రచ్చ జరుగుతున్నా కోట్ల నుంచి ఎలాంటి కామెంట్స్ విన్పించడం లేదు. కర్నూలులో దాదాపుగా కోట్ల కోట కూలిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

తన కంచుకోట అని….

2014 ఎన్నికలకు ముందు వరకూ కోట్ల కుటుంబమే కర్నూలు ఎంపీ అని భావించేవారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కూడా ప్రత్యేక ఓటు బ్యాంకు ఉండేది. అయితే వైసీపీ రెండుసార్లు బీసీ అభ్యర్థులకు సీటు ఇవ్వడంతో కోట్ల వ్యక్తిగత ఓటు బ్యాంకుకు కూడా భారీగా చిల్లిపడిందని చెబుతారు. 2014 ఎన్నికల్లో బుట్టా రేణుక, 2019 ఎన్నికల్లో డాక్టర్ సంజీవ్ కుమార్ ను పోటీకి నిలిపి వైసీపీ బీసీ ఓటర్లను దగ్గరకు చేర్చుకుంది. దీంతో అనేక నియోజకవర్గాల్లో ఉన్న సొంత సామాజిక వర్గం నుంచి కూడా కోట్లకు సపోర్ట్ అందలేదు. అందుకే ఘోరంగా ఓటమ చవిచూడాల్సి వచ్చింది.

అన్ని సామాజికవర్గాలు…

కర్నూలు జిల్లా అంటేనే రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉంటుంది. పేరుకు బీసీ, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నా గ్రామ స్థాయిలో పెత్తనం, పట్టు రెడ్డి సామాజిక వర్గానికే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ వైసీపీని సహజంగానే రెడ్డి సామాజికవర్గం ఓన్ చేసుకుంటుంది. ఇక బీసీలందరూ తమ సామాజిక వర్గానికే ఓట్లు వేస్తారు. ఇకఎస్సీలు కూడా జగన్ పార్టీకి అండగా నిలబడ్డారు. దీంతో కోట్ల కోట మొత్తం కూలిపోయినట్లేనన్నది విశ్లేషకుల అంచనా. వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం.

అన్నింటికీ దూరంగా….

అందుకే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ మారినా లాభం లేకపోయిందన్న ఆవేదనలో కోట్ల ఉన్నారు. చంద్రబాబునాయుడు వద్దకు కూడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాకపోవడానికి కారణాలివేనట. అయితే కొంతకాలంగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కోట్ల సన్నిహితులు ఖండిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దాదాపుగా ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనని, ఆయన ఏ పార్టీలోకి మారరన్నది అందుతున్న సమాచారం. మొత్తం మీద కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తిరిగి కోలుకుని రాజకీయాల్లో కొనసాగుతారో? ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి ఉంది.

Tags:    

Similar News