వారసుడికి లైన్ క్లియర్ ..ముహూర్తమే తరువాయి

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు కేటీఆర్ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే రిజర్వ్ అయిన సీఎం సీటు ఆయన ఎప్పుడు అధిష్టిస్తారు. ఇంకెంత దూరంలో ఉ:దనేదే [more]

Update: 2021-01-20 15:30 GMT

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు కేటీఆర్ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఇప్పటికే రిజర్వ్ అయిన సీఎం సీటు ఆయన ఎప్పుడు అధిష్టిస్తారు. ఇంకెంత దూరంలో ఉ:దనేదే చర్చ. గతంలో చాలా సార్లు వినిపించిన వాదనే అయినప్పటికీ పార్టీ పట్ల కొంత అసంతృప్తి లో ఉన్నవాళ్లు సైతం ఇక ఆయనకు పగ్గాలు వచ్చేసినట్లే అని బాహాటంగా పేర్కొంటున్నారు. కేసీఆర్ కంటే కేటీఆర్ పార్టీకి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తమ్మీద పార్టీలో సీనియర్ నాయకుడు అయిన హరీశ్ రావు వర్గానికి మినహా మిగిలిన వారంతా ఏకాభిప్రాయానికి వచ్చేసినట్లే. ఇప్పటికే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. అయితే కేసీఆర్ ఆ తర్వాత ఏం చేస్తారనేందుకు సమాధానం కరవు అవుతోంది. గతంలో జాతీయ రాజకీయాల నెపంతో తనయుడిని పీఠంపై కూర్చోబెట్టి హస్తినలో చక్రం తిప్పాలని భావించారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. కేసీఆర్ స్థాయిలో ఢిల్లీలో చేయాల్సిన పనులు లేవు. టీఆర్ఎస్ హస్తిన చదరంగంలో పావులు కదిపేందుకు అనువైన వాతావరణమూ లేదు. అయినా కేటీఆర్ ను సీఎం చేయాలనుకోవడమే ఆసక్తిదాయకం. ఆ మేరకు పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంలో ఏదో వ్యూహం ఉందనే వాదన వినవస్తోంది.

రెండేళ్లుగా ఆయనే…

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమవుతున్నారు. తొలిసారి ఎన్నికైన తర్వాత ఏదో కొద్దికాలం సెక్రటేరియట్ కు వెళ్లారు తప్పితే సచివాలయం మొఖం చూసిన పాపాన పోలేదు. మిగిలిన ముఖ్యమంత్రుల తరహాలో సమీక్షలు, ప్రజలలో పర్యటనలు కూడా ఆయన పెద్దగా నిర్వహించరు. ఎన్నికల వంటి సందర్భాల్లో మాత్రమే కనిపిస్తూ ప్రసంగిస్తారు. అప్పుడప్పుడూ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మీడియాతో మాట్లాడతారు. అందుకే సీఎం కార్యాలయం పెద్దగా చర్చల్లో ఉండదు. తెలంగాణలో ఇదొక విచిత్రమైన పరిస్థితి. రెండేళ్లుగా ముఖ్యమంత్రి నిర్వహించాల్సిన మంత్రుల స్థాయి సమీక్షలను కేటీఆర్ నిర్వహిస్త్తున్నారు. ఇప్పటికే 99 శాతం కేసీఆర్ బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నారని సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ తేల్చి చెప్పేశారు. పదవీ స్వీకరణ లాంఛనప్రాయంగానే ఆయన అభిప్రాయపడ్డారు. భజన బృందాలుగా వ్యవహరించే నాయకులు చేసే ప్రకటనలు వేరు. ఈటల వంటి సీనియర్ మంత్రి , అందులోనూ ఉద్యమంతో ముడిపడిన వ్యక్తి స్పష్టంగా చెప్పడంతో దాదాపు ఈదిశలో నిర్ణయం జరిగిపోయిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేటీఆర్ కు అధికారికంగా పట్టాభిషేకం చేసేస్తే ఎదురయ్యే పరిణామాలు, పర్యవసానాలకు కూడా కేసీఆర్ సిద్ధంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రగతి భవన్ కే పరిమితం…

కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమైనప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలు, విధివిధానాల విషయంలో చురుకైన పాత్రనే పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అజెండాకు సిద్దాంతకర్తగా తనను తాను నిర్వచించుకుంటున్నారు. నిజానికి ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేసీఆర్ కు ఎదురు లేదు. కానీ కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభ తగ్గుతూ వస్తోంది. బీజేపీ విసురుతున్న సవాల్ కు దీటైన సమాధానం చెప్పలేకపోతోంది. నాయకులు, అధికార యంత్రాంగం పటిష్ఠంగా ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ ను బీజేపీ నాయకులు సవాల్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ బొమ్మలేదని ముఖ్యమంత్రి ఫ్లెక్సీని బీజేపీ నేతలు చింపేశారు. అధికారులు, టీఆర్ఎస్ నాయకుల సంఖ్యతో పోలిస్తే బీజేపీ అక్కడ నామమాత్రమే. కానీ బీజేపీలో నెలకొన్న ఎదురుదాడి తత్వం, ఏమైనా ఫర్వాలేదనుకునే దూకుడు ధోరణికి ఇటువంటి సంఘటనలు అద్దం పడుతున్నాయి. కేసీఆర్ ను , టీఆర్ఎస్ పార్టీని బీజేపీ నాయకులు దూషించిన , విమర్శించిన స్థాయిలో గతంలో ఏ పార్టీ కూడా చేయలేకపోయింది. తాను పబ్లిక్ లో ఉండటం లేదు కాబట్టి పూర్తి గా అధికారాలు కేటీఆర్ కు అప్పగించేస్తే ఒక పనైపోతుందనేది కేసీఆర్ బావనగా చెబుతున్నారు.

ఒడుదొడుకులు వచ్చినా…

రాజకీయంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సాధించాల్సిన వాటి కంటే కేసీఆర్ చాలా ఎక్కువే దూరం నడిచారు. మర్రి చెన్నారెడ్డి వంటి వారికి సాధ్యం కాని తెలంగాణ స్వప్నాన్ని నెరవేర్చారు. ముఖ్యమంత్రిగా రెండుసార్లు నూతన రాష్ట్రానికి దిశానిర్దేశం చేశారు. తాను అనుకున్నట్లు పూర్తి సంత్రుప్తికరమైన గమ్యాన్ని చేరుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయంగా బీజేపీ విసురుతున్న సవాల్ ఎదుర్కోవడం ఇక తన బాధ్యత కాదని కేసీఆర్ భావిస్తున్నారు. వాటిని ఇక టీఆర్ఎస్ వారసత్వమే చక్కదిద్దుకోవాలనేది ఆయన భావన. తాను విజేతగానే ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవాలనేది కేసీఆర్ యోచనగా ఆయన తో సన్నిహితంగా మెలిగే వారు చెబుతున్నారు. పార్టీకి అవసరమైన సైద్ధాంతిక భూమిక, జాతీయ స్థాయిలో పార్టీ పోషించాల్సిన పాత్రపై కేసీఆర్ దృష్టి పెడతారంటున్నారు. నిజానికి కేసీఆర్ వయసు రీత్యా చూస్తే మరో పదేళ్లపాటు క్రియాశీలకంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించగలరు. తనకు సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా తిరుగులేదు. కానీ కేటీఆర్ కు ఆ స్టేచర్ రాదు. అందుకే తన పర్యవేక్షణలోనే అధికార పీఠాన్ని కూడా వారసుడికి సుస్థిరం చేయాలనే తలంపుతోనే తొందరపడుతున్నట్లుగా కొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో కేటీఆర్ కేంద్రస్థానంగా చర్చలు మొదలయ్యాయి. కొనసాగుతున్నాయి. సీఎం పీఠం అధిష్టించేవరకూ ఎండ్ కార్డు పడేలా లేదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News