ఇక అంతమైపోయినట్లేనా?

కర్ణాటక జనతాదళ్ ఎస్ తీవ్ర సంక్షోభంలో పడింది. దేవెగౌడ మాటలను కూడా నేతలు బేఖాతరు చేస్తున్నారు. ఇందుకు కారణం కుమారస్వామి. రాజకీయంగా కుమారస్వామి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీనే [more]

Update: 2019-11-16 18:29 GMT

కర్ణాటక జనతాదళ్ ఎస్ తీవ్ర సంక్షోభంలో పడింది. దేవెగౌడ మాటలను కూడా నేతలు బేఖాతరు చేస్తున్నారు. ఇందుకు కారణం కుమారస్వామి. రాజకీయంగా కుమారస్వామి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీనే ముంచేసేటట్లున్నాయి. కుమారస్వామిని పేరు చెబితేనే పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. దేవెగౌడకు గౌరవమిచ్చే నేతలు కుమారస్వామి అంటే మండిపడటానికి కారణాలేంటి? జేడీఎస్ దేవెగౌడతోనే అంతమవుతుందా? అనే చర్చ పార్టీలో మొదలయింది.

తీరు అప్పుడూ…ఇప్పుడూ….

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకున్నా ఆయన తీరు ఒక్కలాగే ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను తీసుకోరు. తాను అనుకున్న నిర్నయాలనే అమలు చేస్తారు. అది ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా ఒకటే తీరు. దీంతో కర్ణాటక జేడీఎస్ లో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. కుమారస్వామి ఒంటెద్దు పోకడలను భరించలేని పార్టీ నేతలు జేడీఎస్ ను వీడేందుకు సిద్ధపడుతున్నారు. దేవెగౌడ సముదాయించినా కుమారస్వామిని కట్టడి చేయాలని చెబుతుండటం విశేషం.

కూలిపోవడానికి కూడా….

నిజానికి కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కాంగ్రెస్ నేతలు ఒక కారణమయితే మరో కారణం కుమారస్వామి అనేది పార్టీ నేతల అభిప్రాయం. సంకీర్ణ సర్కారులో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు విదేశాల్లో కుమారస్వామి సేదతీరడాన్ని ఇప్పటికీ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. అప్పుడే కుమారస్వామి ముందుకు వచ్చి ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడి ఉంటే ప్రభుత్వం కుప్పకూలిపోయేది కాదన్నది వారి అభిప్రాయం.

ఏకపక్ష నిర్ణయాలతో…..

ఇక లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కుమారస్వామి పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలనూ తీసుకోలేదంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పుట్టణ్ణను పార్టీ నుంచి పంపివేయడం కూడా కుమారస్వామి దుందుడుకు చర్యలకు నిదర్శనమని చెబుతున్నారు. బీజేపీకి అండగా నిలుస్తామని కుమారస్వామి చేసిన ప్రకటన కూడా తప్పుడు నిర్ణయమని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో జేడీఎస్ లో కుమారస్వామిని వ్యతిరేకించే వర్గం ఎక్కువగా కన్పిస్తుంది. కుమారస్వామి తీరు మార్చుకోకుంటే ఎప్పుడైనా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడే అవకాశముంది. మరి కుమారస్వామి తన తీరును మార్చుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News