కుంగిపోలేదట…!!

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తిరిగి యాక్టివ్ కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయన పూర్తిగా డీలా పడ్డారు. వరస ఓటములు కుమారస్వామిని మానసికంగా కుంగదీశాయి. [more]

Update: 2020-01-08 18:29 GMT

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తిరిగి యాక్టివ్ కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయన పూర్తిగా డీలా పడ్డారు. వరస ఓటములు కుమారస్వామిని మానసికంగా కుంగదీశాయి. దీంతో గత కొద్దిరోజులుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. బీజేపీ కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక జేడీఎస్ మద్దతు కూడా బీజేపీకి అవసరం లేదు. దీంతో కుమారస్వామిని బీజేపీ పట్టించుకోవడం లేదు. దీంతో ఓటములను ఆయన పక్కన పెట్టి తిరిగి యాక్టివ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

పార్టీ వ్యవహారాలకు దూరంగా….

కుటుంబ పార్టీగా, కన్నడ నాట ఉప ప్రాంతీయ పార్టీగా పేరు తెచ్చుకున్న జనతాదళ్ ఎస్ కు గడ్డు రోజులు వచ్చాయనే చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపకుడు దేవెగౌడ, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఓటమి పాలు కావడంతో అనేక సభల్లో కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబాన్ని ఎవరు ఓడించారో తనకు తెలుసునని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. దీంతో పాటు ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు బలం లేకపోతే తాను మద్దతిస్తానని కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఘోర ఓటమితో…..

అయితే ఉప ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. జనతాదళ్ ఎస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేదు. దీంతో కుమారస్వామి పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం మానేశారు. దీంతో జనతాదళ్ ఎస్ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. పైగా బీజేపీ ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది. కాంగ్రెస్ నాయకత్వ లేమితో అవస్థలు పడుతుంది.

దేవెగౌడ సూచనల మేరకు…..

దీంతో తండ్రి దేవెగౌడ సూచనల మేరకు తిరిగి యాక్టివ్ అవ్వాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను, క్యాడర ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కుమారస్వామిపైనే ఉంది. అందుకే ఆయన తిరిగి పార్టీ వ్యవహారాల్లో మునిగితేలాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి పండగ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలను చూస్తారని, బలహీనంగా ఉన్న జేడీఎస్ నియోజకవర్గాల్లో కుమారస్వామి పర్యటిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద కుమరస్వామి తిరిగి మునుపటి ఎనర్జీతో మూవ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News