తండ్రి ఇక పనికిరాడన్న మాటేగా?

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి పెద్ద కోరికే ఉంది. తండ్రి దేవెగౌడ ఎత్తులు ఈ మధ్య కాలంలో పనిచేయకపోవడం, పార్టీ పరిస్థితి దారుణంగా తయారు కావడంతో ఏమీ చేయలేని [more]

Update: 2020-02-28 17:30 GMT

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి పెద్ద కోరికే ఉంది. తండ్రి దేవెగౌడ ఎత్తులు ఈ మధ్య కాలంలో పనిచేయకపోవడం, పార్టీ పరిస్థితి దారుణంగా తయారు కావడంతో ఏమీ చేయలేని పరిస్థితులో ఉన్నారు. చివరకు తండ్రి దేవెగౌడ, కుమారుడు నిఖిల్ గౌడలను కూడా కన్నడ ప్రజలు ఓడించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకూ తమ కుటుంబానికి తిరుగులేదని భావించిన కుమారస్వామి వరస ఓటములతో ఇబ్బంది పడుతున్నారు. దేవెగౌడకు కూడా వయసు మీద పడటంతో పార్టీకి అంతా తానే అయి వ్యవహరించాల్సి ఉంది.

ఉప ప్రాంతీయ పార్టీగా….

నిజానికి కన్నడనాట జనతాదళ్ ఎస్ ప్రాంతీయ పార్టీ కాదు ఉప ప్రాంతీయ పార్టీగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాలకే ఆ పార్టీ పరిమితమయింది. కొన్ని వర్గాలకే అది చేరువ కాగలిగింది. ఒక్కలిగ సామాజికవర్గం అండదండలతో ఇన్నాళ్లూ నెట్టుకు రాగలిగారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కుమారస్వామి కోసం దేవెగౌడ వేసిన తప్పటడుగులతో క్యాడర్ కూడా చెల్లాచెదురయింది.

విధానం లేకుండా…..

జనతాదళ్ ఎస్ కు ఒక విధానం లేదన్న భావన కన్నడనాట బలంగా నాటుకుపోయింది. అధికారం కోసం, ప్రధానంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారని, ఎవరినైనా విభేదిస్తారన్న విమర్శలు కుమారస్వామి గత కొన్నేళ్లుగా మూటగట్టుకున్నారు. అధికారం కోసం బీజేపీతో చేతులు కలిపినా, అదే పదవి కోసం కాంగ్రెస్ తో కలసి నడిచినందునే కుమారస్వామి పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందన్నది కాదనలేని వాస్తవం.

అందుకే వ్యూహకర్త…..

అందుకే కుమారస్వామి ఇక ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ పార్టీని పటిష్టం చేసేందుకు, ముఖ్యంగా క్యాడర్ లో జోష‌ నింపేందుకే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారంటున్నారు. ప్రశాంత్ కిషోర్ తో పెద్దగా కన్నడనాట ఒరిగేదేమీ లేకపోయినా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, క్యాడర్ లో ధైర్యం నింపేందుకే ప్రశాంత్ కిషోర్ ను కుమారస్వామి ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారని చెబుతున్నారు. మరి కొన్ని ప్రాంతాలకే పరిమితమయిన పార్టీని ప్రశాంత్ కిషోర్ ఎలా పైకి తెస్తారన్నది ఆసక్తికరమే.

Tags:    

Similar News