రిలాక్స్ అవ్వడానికి లేదా..?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోనట్లే ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా ఇంకా ఆపరేషన్ ముగిసిపోలేదనే అనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష సమావేశానికి [more]

Update: 2019-01-19 16:30 GMT

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోనట్లే ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా ఇంకా ఆపరేషన్ ముగిసిపోలేదనే అనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కాకపోవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య సయితం వారికి తీవ్ర హెచ్చరికలు పంపారు. శాసనసభ పక్ష సమావేశానికి రాని వారిపై వేటు వేస్తారమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని సిద్ధరామయ్య ఒకింత తీవ్ర స్వరంలోనే హెచ్చరించారు.

వేటు కోసమే ఎదురు చూస్తున్నారా?

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి నలుగురు శాసనసభ్యులు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 80 మంది శాసనసభ్యులుంటే 76 మంది మాత్రమే హాజరయ్యారు. రమేష్ జార్ఖిహోళితో పాటు మహేష్ కుమట హళ్లి, ఉమేష్ జాదవ్ లు శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కాలేదు. వీరు ముగ్గురు ఇటీవల పార్టీ మారతారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా తో భేటీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని మొత్తానికి మనసు మార్చుకుని గుర్గావ్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరు మీడియాకు కూడా కంటపడలేదు. వీరిపై పార్టీ బహిష్కరణ వేటు వేస్తే సులువుగా బీజేపీలో చేరవచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్లు ఉందని వారి సన్నిహితులే చెబుతున్నారు.

రిస్క్ ఎందుకని…?

ప్రస్తుతం కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి పార్టీ మారితే స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేస్తారు. మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ రిస్క్ ఎందుకు తీసుకోవడం అనుకున్నారేమో… కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ తనంతట తానుగా వేటు వేస్తే అది తమ మంచికేనన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. బళ్లారి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాగేంద్ర సయితం గైర్హాజరయ్యారు. ఇప్పటికీ వీరంతా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పతో టచ్ లో ఉన్నారని సమాచారం. యడ్యూరప్ప సూచన మేరకే వీరు సమావేశానికి డుమ్మ కొట్టారని కూడా కాంగ్రెస్ భావిస్తుంది.

అసహనంతో కుమార……

అయితే వీరితో పాటు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభ పక్ష సమావేశానికి హాజరవ్వడం విశేషం. . ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం ఈ రాజకీయ పరిణామాల పట్ల అసహనంతో ఉన్నారు. పాలనకు సక్రమంగా చేయకుండా బీజేపీ దొంగాటలాడుతుందని దుయ్యబట్టారు. ఇటు కాంగ్రెస్ పైన కూడా విమర్శలకు దిగారు. ప్రతి పనికీ కాంగ్రెస్ పై ఆధారపడాల్సి వస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఇప్పుడు సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెస్ దిగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి నోటీసులతో సరిపెట్టారు. అయితే ఆ పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News