మరీ అంత కోపమా… చాల్లే సంబడం?

అందుకే ఒకప్పుటి రాజకీయాలు అంటూ ఎవరైనా దీర్ఘాలు తీసేది. రాజకీయాల రంగు రుచి వాసన అన్నీ ఇపుడు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మానవత్వం కోణం పూర్తిగా కనుమరుగు [more]

Update: 2021-05-01 00:30 GMT

అందుకే ఒకప్పుటి రాజకీయాలు అంటూ ఎవరైనా దీర్ఘాలు తీసేది. రాజకీయాల రంగు రుచి వాసన అన్నీ ఇపుడు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మానవత్వం కోణం పూర్తిగా కనుమరుగు అవుతోంది. ఒకే కుటుంబంలో భార్యదో పార్టీ అయితే భర్తది వేరే పార్టీ అంటూ పాలిటిక్స్ చొచ్చుకువచ్చేశాక ఇక వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుతుంటే అంత మంచిదేమో. ఏది ఏమైనా కూడా ఇంకా రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే వారికే ఇలాంటివి చూసినపుడు కొంత బాధ కలుగుతుంది.

ఇదేం ప్రతిన….?

భీష్ముడు ప్రతిన పూనాడు అంటే దానికి అర్ధం పరమార్ధం ఉన్నాయి. ఇక రాజకీయ జీవులు కూడా ప్రత్యర్ధుల మీద శపధం చేస్తూంటారు. తాము అధికారంలోకి వస్తే ఫలనాది చేస్తామని, ఫలనా వారి కధ తేల్చేస్తామని. అయితే అవన్నీ రాజకీయ పడికట్టు భాషలో పడి కొట్టుకుపోతాయి. ఆ పరిభాషే అంత అని సర్దుకుపోవచ్చు కానీ. తండ్రి తరువాత అంతటి వాడు, సొంత మేనమామ అయిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ విషయంలో ఆయన మేనల్లుడు శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ తాజాగా చేసిన శపధం మాత్రం అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంది అంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ్మినేని బట్టలు నడి రోడ్డు మీద ఊడదీసి పరుగులు పెట్టిస్తాను అని కూన రవికుమార్ అనడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు.

తీవ్ర అసహనం …..

కూన రవికుమార్ కి ఆవేశపరుడు అన్న పేరు ఉంది. ఆయనే ఇపుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కులా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. దాంతో ఆయన దూకుడు రాజకీయమే చేస్తున్నారు. ఊ అంటే చాలు పోలీసుల మీదనే కూన రవికుమార్ ప్రతాపం చూపిస్తారు అన్న ప్రచారమూ ఉంది. తాజాగా ముగిసిన పరిషత్ ఎన్నికల వేళ కూడా ఒక డీఎస్పీ అంతటి పోలీస్ ఉన్నత అధికారి మీద కూన రవికుమార్ నోరు చేసుకోవడంతో ఆయన మీద మళ్లీ కేసు పెట్టాల్సివచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలా ఎన్నో సార్లు పోలీస్ కేసుల్లో కూన ఇరుక్కున్నారు. దాంతో ఆయనలో అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటోంది.

మైనస్సేనా…?

ఇక కూన రవికుమార్ 2014 ఎన్నికల్లో ఒకే ఒకసారి ఆముదాలవలస నుంచి గెలిచారు. అయితే ఆయన ఇపుడు ఒకేసారి మామతో పాటు, ఆయన‌ కుమారుడు తనకు బావ వరస అయ్యే తమ్మినేని చిరంజీవి నాగ్ ని కూడా ఎదుర్కోవాల్సివస్తోంది. తమ్మినేని ఇంట ఇపుడు బోలెడు పదవులు ఉన్నాయి. తమ్మినేని భార్య కూడా సర్పంచ్ గా గెలిచారు. కుమారుడు అధికార పార్టీలో వెలిగిపోతున్నాడు. దాంతో ఎక్కడ ఆముదాలవలసలో తన పట్టు జారుతుందో అన్న బెంగతోనే కూన రవికుమార్ ఇలా దూకుడు చేస్తున్నారు అంటున్నారు. ఇక టీడీపీలో కూడా ఆయనే దిక్కు అన్నట్లుగా సీన్ ఉండడంతో కూన జోరు పెంచేస్తున్నారు. దాంతో పోలీసు కేసులు కూడా ఆ వెనకనే వస్తున్నాయి. ఇక తమ్మినేని ఫ్యామిలీ కూడా కూన రవికుమార్ విషయంలో గట్టిగానే ఉంది. ఈ పరిణామాలను తట్టుకోలేని కూన భాష కూడా దారుణంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. లేకపోతే వయసులో పెద్దాయన అయిన తమ్మినేనిని బట్టలూడదీసి పరుగులు పెట్టిస్తాను అనడమేంటి అన్న చర్చ అయితే సాగుతోంది. కూన రవికుమార్ సహనంతో రాజకీయాలు చేయకపోతే అదే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News