జనం వద్దనేంతవరకూ … ?

ప్రజా సేవ చేసుకుంటామని జనాల వద్దకు వచ్చి బతిమాలి బామాలి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ఇక ఆ కుర్చీ సుఖానికి అలవాటుపడిపోయి ఎప్పటికీ అక్కడే ఉండి పోవాలనిపిస్తుంది. [more]

Update: 2021-05-21 03:30 GMT

ప్రజా సేవ చేసుకుంటామని జనాల వద్దకు వచ్చి బతిమాలి బామాలి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ఇక ఆ కుర్చీ సుఖానికి అలవాటుపడిపోయి ఎప్పటికీ అక్కడే ఉండి పోవాలనిపిస్తుంది. దాంతోనే వస్తోంది అసలు తంటా. ఈలోగా కాలాలెన్నో తిరిగిపోతున్నా పదవీ దాహం మాత్రం తీరదు. ఎట్టకేలకు ఒకనాడు ఓటేసి ఆదరించిన జనాలే ఇక మీరు వద్దు అని ముఖాన చెప్పేశాక గానీ జ్ణానోదయం కలగదు. ఇది నేతల తప్పు కాదేమో, వారిని వరించిన పదవుల తప్పేమో. తాజాగా తెలంగాణా కాంగ్రెస్ వృద్ధ నేత కుందుర్తి జానారెడ్డి రాజకీయ పదవీ విరమణ ప్రకటనను చూస్తే ఇదే అనిపిస్తోంది.

అవమానంగానేనా …?

జానారెడ్డి చిన్న నాయకుడు కాదు, ఎన్నో యుద్ధాలను చూసిన నేత. అయితేనేమి, నాగార్జున సాగర్ లో తండ్రి నోముల నరసింహయ్య ఆయన కుమారుడు నోముల భగత్ చేతుల్లో రెండు సార్లు ఓడాక గానీ తత్వం బోధపడలేదు. ఇక చాలు, నా రాజకీయ జీవితానికి స్వస్తి. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను అని జానారెడ్డి అనడం వెనక అవమాన భావమే కనిపించింది. అదే ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఈ మాట అనేవారా. తానే కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని పదే పదే చెప్పుకునే జానారెడ్డి ఇపుడు వరస ఓటముల తరువాత రాజకీయాల నుంచి తప్పుకోవడం అనివార్యమే తప్ప మరోటి కాదు అన్న విశ్లేషణ ఉంది.

ఏజ్ గుర్తు చేస్తున్నారా…?

నా వయసు ఇపుడు డెబ్బై అయిదేళ్ళు. ఇంకా రాజకీయాలేంటి అంటూ జానారెడ్డి వైరాగ్యాన్నే ప్రదర్శించారు. ఇక ఆయన కంటే పెద్ద వారు ఎందరో దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. అయితే వారు గెలిచి చేస్తున్నారు. ఓడితే ఇలాగే అంటారేమో. ఇక చాలా మంది నేతలు తమ వయసుని మరచి మరీ ఇంకా పదవుల కోసం పరితపిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయానికి వస్తే ఎపుడో డెబ్బై దశకంలో రాజకీయాలను మొదలెట్టి ఇప్పటికీ అలుపు రాలేదు అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు కూడా చంద్రబాబుకు మరోలా అర్ధమైంది అన్న సెటైర్లు ఉన్నాయి. తన కొడుకుతో సమానమైన జగన్ తో చంద్రబాబు నేడు పోరాడుతున్నారు. 2024 ఎన్నికలకు ఆయన‌ సిద్ధం అంటున్నారు.

గమనించాల్సిందే…?

కాలం తెచ్చే మార్పుని గమనించి పరుగు ఆపేవారే స్థిత ప్రజ్ణత సాధించిన వారు అని చెప్పాలి. కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుంది. అలాగే కొత్త తరం వచ్చినపుడు పాతతరం మర్యాదగా తప్పుకోవాల్సిందే. కానీ కొందరు మాత్రం గత వైభవాన్ని తలుస్తూ తామింకా పాదుషాలమే అని పగటి కలలు కంటారు. అలాంటి వారు అదే కాల చక్రం కింద నిర్ధాక్షిణ్యంగా నలిగిపోవాల్సిందే. అనంత కాల గమనంలో వ్యక్తులతో పని ఉండదు. వర్తమాన కాలానికి ఒకరు నాయకుడు అయితే వచ్చే కాలానికి కూడా ఇంకొకరు తయారు గా ఉంటారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించకపోతే జనాలే మీరు మాకొద్దు బాబూ అనాల్సి వస్తుంది. భారత దేశంలో ఎన్నికల్లో పోటీకి ఏజ్ లిమిట్ లేకపోవడంతో ఎంతదాకానైనా అంటూ పరుగులు తీసే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అయిపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వారికి జానారెడ్డి కంపల్సరీ పొలిటికల్ రిటైర్మెంట్ ఒక సున్నితమైన హెచ్చరిక అవుతుందేమో చూడాలి మరి.

Tags:    

Similar News