జానారెడ్డిని కార్నర్ చేసినట్లుందిగా?

సీనియర్ నేత జానారెడ్డి గెలుపు కోసం ఈ వయసులోనూ కష్టపడుతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక దఫా ప్రచారం ముగించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జానారెడ్డిని [more]

Update: 2021-04-09 09:30 GMT

సీనియర్ నేత జానారెడ్డి గెలుపు కోసం ఈ వయసులోనూ కష్టపడుతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక దఫా ప్రచారం ముగించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జానారెడ్డిని ఓడించేందుకు అన్ని పార్టీలూ శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నాయి. జానారెడ్డిని సాగర్ లో ఓడించగలిగితే కాంగ్రెస్ ను ఇక తెలంగాణలో క్లోజ్ చేసినట్లవుతుందన్నది టీఆర్ఎస్ ఆలోచన. అందుకే అన్ని రకాలుగా సాగర్ లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది.

బీజేపీ టార్గెట్ కూడా…..

ఇక బీజేపీ టార్గెట్ కూడా జానారెడ్డి కావడం విశేషం. ఇక్కడ టీఆర్ఎస్ కంటే జానారెడ్డిని ఓడించడం బీజేపీకి కావాల్సింది. ఎందుకంటే టీఆర్ఎస్ కు ప్రత్నమ్నాయం తామేనని చెప్పుకుంటూ వస్తుంది. పార్లమెంటు ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వచ్చేసినట్లేనని బీజేపీ భావిస్తుంది. ఈ సమయంలో జానారెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయి.

ప్రజల్లో ఒకింత….

అందుకే టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన టార్గెట్ జానారెడ్డి కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. జానారెడ్డి నాగార్జున సాగర్ లో బలమైన నేత. గత ఎన్నికల్లోనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పెద్దాయన కావడం, కాంగ్రెస్ నే నమ్ముకుని ఉంటాడన్న విశ్వాసం ప్రజల్లో ఉండటంతో జానారెడ్డి వైపు ఒకింత మొగ్గు ఉండే అవకాశముంది. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నేతలు ఇక్కడ జానారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అన్ని రకాలుగా……

దీంతో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది బరిలోకి దిగారు. వీరంతా ఏదో ఒక పార్టీకి చెందిన వారే అంటున్నారు. సామాజిక వర్గాల వారీగా, అందులోనూ రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జానారెడ్డి ఓట్లకు గండి కొట్టాలనే అధికార టీఆర్ఎస్ వారి చేత నామినేషన్లు వేయించిందన్న విమర్శలున్నాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జానారెడ్డిని ఓడించేందుకు పెద్దయెత్తున నిధులను కూడా వెచ్చిస్తుందటున్నారు. మొత్తం మీద సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించడానికి అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags:    

Similar News