జానారెడ్డి గెలుపు అవసరం ఆయనది కాదట

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు పైనే అందరి భవిష్యత్ ఆధారపడి ఉంది. తొలినాళ్లలో అనుకున్నంత మాత్రం జానారెడ్డికి గెలుపు సులువుగా లేదు. ఇందుకు అనేక [more]

Update: 2021-04-13 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు పైనే అందరి భవిష్యత్ ఆధారపడి ఉంది. తొలినాళ్లలో అనుకున్నంత మాత్రం జానారెడ్డికి గెలుపు సులువుగా లేదు. ఇందుకు అనేక సామాజిక సమీకరణాలు ఉన్నాయి. రెడ్ది సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా జానారెడ్డికి మద్దతిస్తుందన్న నమ్మకం లేదు. ఇతర సామాజికవర్గాల నుంచి కూడా జానారెడ్డికి సపోర్టు వస్తుందని చెప్పలేం. అభ్యర్థులను నిర్ణయించిన తర్వాత ఈక్వేషన్లు అలా చెబుతున్నాయి.

ఇతర నేతలకు….

ఇప్పుడు జానారెడ్డి గెలుపు ఇతర కాంగ్రెస్ నేతల చావుకొచ్చింది. జానారెడ్డి గెలిస్తే తిరిగి కాంగ్రెస్ రాష్ట్రంలో కొంత పుంజుకునే అవకాశాలున్నాయి. అలాగే ప్రజలు కూడా కొంత పార్టీ వైపు చూసే అవకాశముంది. అదే సమయంలో పార్టీ హైకమాండ్ సయితం సాగర్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే ఇక్కడి నేతలకు విలువ ఇస్తుంది. ఇప్పటివరకూ ఓటమి పాలయిన సీట్లలో ఏదో ఒక కారణం చూపి నేతలు తప్పించుకున్నారు.

హైకమాండ్ కఠిన నిర్ణయం…

కానీ జానారెడ్డి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు. గత ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో ఓటమి పాలయిన జానారెడ్డిని తిరిగి గెలిపించుకోలేక పోతే ఇక ఇక్కడి నేతల మొహం కూడా అధిష్టానం చూడకపోవచ్చు. పైగా తాము వ్యతిరేకించినా పీసీసీ చీఫ్ నియామకంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎవరెన్ని చెప్పినా పార్టీ భవిష్యత్ కోసం హైకమాండ్ పీసీీసీ చీఫ్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అందరూ ఐక్యంగా….

అందుకే జానారెడ్డి గెలుపు కోసం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా జానారెడ్డిని గెలిపించుకోవాలని ఇప్టటికే నేతలు రంగంలోకి దిగారు. సామాజికవర్గాల వారీగా నేతలు ప్రచారం చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా కాంగ్రెస్ నేతల్లో ఐక్యత కన్పిస్తుండటం విశేషం. అందరు కలసి కట్టుగా జానారెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ అందరూ ఏకమై ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం పీీసీసీ చీఫ్ నియామకమేనని అంటున్నారు.

Tags:    

Similar News