సొంత ఇమేజ్ నే నమ్ముకున్నారు.. వారిని నమ్మలేదట

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ జానారెడ్డి. ఇప్పుడు యువకులతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తలపడుతున్నారు. జానారెడ్డి పై తలపడుతున్న ప్రధాన పార్టీలకు చెందిన [more]

Update: 2021-04-17 09:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ జానారెడ్డి. ఇప్పుడు యువకులతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తలపడుతున్నారు. జానారెడ్డి పై తలపడుతున్న ప్రధాన పార్టీలకు చెందిన ప్రత్యర్థులు ఇద్దరూ వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ తక్కువే. జానారెడ్డి అనుభవమంత వయసు లేని వారు. అయితే ఈ ఎన్నికల్లో జానారెడ్డి చేతి గుర్తుపై నమ్మకం పెట్టుకోలేదు. కేవలం తన సొంత ఇమేజ్ పైనే ఆధారపడుతున్నారు.

సొంత వ్యూహాలతోనే….

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు రెండు నెలల నుంచే జానారెడ్డి సాగర్ లో పర్యటిస్తున్నారు. తనకున్న వ్యూహాలను అమలుపరుస్తున్నారు. పెద్దగా కాంగ్రెస్ నేతల పై జానారెడ్డి ఆధారపడటం లేదు. స్థానిక నాయకత్వానికే మండలాల వారీగా జానారెడ్డి బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ నేతలను మండలాల వారీగా అప్పగించినా వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేశారు.

ఆయన ఒక్కరికే కాదు….

జానారెడ్డి గెలుపు ఆయన ఒక్కరికే కాదు కాంగ్రెస్ కు కూడా జీవన్మరణ సమస్య. 2014 నుంచి కాంగ్రెస్ కు రాష్ట్రంలో గడ్డు కాలమే నడుస్తుంది. ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపు ఒక్కటే చెప్పుకోదగింది. ఇక వరస పరాజయాలతో కాంగ్రెస్ తమకంటే వెనక్కు వెళ్లిపోయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి వలసలు కూడా కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామాతో పార్టీ పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది.

భవిష్యత్ ఉండాలంటే…?

దీంతో జానారెడ్డి గెలుపును కాంగ్రెస్ లోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక జానారెడ్డికి కూడా ఈ గెలుపు అనివార్యం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే జానారెడ్డి ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించక తప్పదు. ఇప్పుడు గెలిస్తే మరోసారి తన పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వినపడే అవకాశముంది. అందుకే జానారెడ్డికి ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సొంత ఇమేజ్ పైనే ఆధారపడుతున్నారు. పార్టీ కంటే తనను చూసి ఓటేయమని ఆయన అభ్యర్థించడం విశేషం. మొత్తం మీద జానారెడ్డి గెలుపు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ కు మలుపు కానుంది.

Tags:    

Similar News