జానారెడ్డిని అదే గెలిపిస్తుందా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే సీనియర్ నేత జానారెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారన్న సంకేతాలు [more]

Update: 2021-04-28 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయింది. ఇక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే సీనియర్ నేత జానారెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. ఆయన తనకు చివరి ఛాన్స్ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కూడా జానారెడ్డి సాగర్ ప్రజలకు తెలిపారు. ఇదే ఆయన గెలుపునకు అవకాశంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.

అన్ని విధాలుగా….

జానారెడ్డి కీలకమైన నేత. కాంగ్రెస్ ను నమ్మకంగా అంటిపెట్టుకుని ఉండే నేత. గత ఎన్నికల్లోనూ తక్కువ మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. దీనికి తోడు పెద్దాయనకు ఈసారి అవకాశమిస్తే బాగుంటుందన్న చర్చ సాగర్ ప్రజల్లో బలంగా ఉందంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు యువకులు కావడంతో జానారెడ్డికి కలసి వచ్చిందంటున్నారు. వయసురీత్యా, అనుభవం దృష్ట్యా జానారెడ్డి పెద్దవాడు కావడంతో ఈసారి ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారంటున్నారు.

ఎన్నడూ లేని తరహాలో….

జానారెడ్డి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డారు. నేతలతో సంబంధం లేకుండా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. తన ఇద్దరు కొడుకులతోనే ఆయన ఎన్నికను చక్కబెట్టారు. దాదాపు మూడుసార్లు జానారెడ్డి నియోజకవర్గాన్ని పర్యటించి వచ్చారు. ముందుగానే తన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో జానారెడ్డికి ఇది సాధ్యమయిందనే చెప్పాలి. ప్రతి గ్రామానికి వెళ్లి తన కు ఈసారి అవకాశమివ్వాలని జానారెడ్డి కోరారు.

సామాజికవర్గాల వారీగా…?

బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు సామాజిక వర్గంగా బలమైన వారు కావడంతో ఇతర సామాజిక వర్గాలపై జానారెడ్డి ఎక్కువగా దృష్టి పెట్టారు. తనను గెలిపించడంవల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో జానారెడ్డి వివరించడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించినా రోజు తాను స్వయంగా పర్యవేక్షించి ముఖ్యనేతలు చేజారిపోకుండా జానారెడ్డి చూసుకోగలిగారు. మొత్తం మీద పోలింగ్ తర్వాత వస్తున్న విశ్లేషణలను బట్టి జానారెడ్డికి ఎడ్జ్ ఉన్నట్లు కనపడుతుంది.

Tags:    

Similar News