కంపు.. కంపు.. కర్నూలుకు ఇదేం గతి?

కర్నూలు త్వరలో న్యాయ రాజధాని కాబోతోంది. ఒకప్పుడు కర్నూలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉంది. అలాంటి కర్నూలులో కరోనా వైరస్ దేశంలోనే ముందుంది. దేశంలోని అన్ని [more]

Update: 2020-04-23 08:00 GMT

కర్నూలు త్వరలో న్యాయ రాజధాని కాబోతోంది. ఒకప్పుడు కర్నూలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉంది. అలాంటి కర్నూలులో కరోనా వైరస్ దేశంలోనే ముందుంది. దేశంలోని అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు కర్నూలులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నది గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కర్నూలు యంత్రాంగం రేయింబవళ్లూ కరోనా నియంత్రణకు కృషి చేస్తుంది. ప్రభుత్వం కూడా కర్నూలులో ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. అయితే కరోనా కంటే రాజకీయ వైరస్ కర్నూలు జిల్లాను ఎక్కువగా పీడిస్తుంది.

వైరస్ కంటే పాలిటిక్స్ కే…..

కర్నూలు జిల్లా నేతలు వైరస్ కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై మాజీ మంత్రి అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు. హఫీజ్ ఖాన్ వల్లనే కర్నూలులో కరోనా కేసులు పెరుగుతున్నాయని అఖిలప్రియ ఆరోపించారు. హఫీజ్ ఖాన్ అధికారులకు సహకరించకపోగా, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అఖిలప్రియ విమర్శించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా అఖిలప్రియ డిమాండ్ చేశారు.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు….

దీనికి వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. తాను కరోనా వైరస్ వ్యాప్తికి కారణమని నిరూపిస్తే కర్నూలు రాజ్ విహార్ సెంటర్ లో ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. తాను అధికారులకు పూర్తిగా సహకరించానని, మర్కజ్ నుంచి వచ్చిన వారిని గుర్తించి వారిని ఒప్పించి క్వారంటైన్ కు పంపడంలో తాను పడిన శ్రమ అధికారులకు తెలుసునన్నారు. కర్నూలులో వ్యాధి ప్రబలడానికి అనేక కారణాలున్నా తనను టార్గెట్ చేయడమేంటని హఫీజ్ ఖాన్ నిలదీశారు.

కారణాలు అందరికీ తెలిసినా…?

ఇలా కర్నూలు జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కలసికట్టుగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు ఈ సమయంలోనూ రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు పట్టణమే కాకుండా నంద్యాలలోనూ కేసులు ఎక్కువగా ఉండటాన్ని ఈ సందర్బంగా కొందరు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద కర్నూలు రాజకీయాలు కరోనా సమయంలో కంపు రేపుతున్నాయి

Tags:    

Similar News