ఇప్పుడేం చేయనున్నారు?

కాంగ్రెస్‌కు అత్యంత విధేయులు, ఆది నుంచి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్న వారు కేవీపీ రామ‌చంద్రరావు, తిక్కవ‌ర‌పు సుబ్బరామిరెడ్డి. ఇందిరా గాంధీ హ‌యాం నుంచి కూడా పార్టీకి విధేయులుగా [more]

Update: 2020-02-04 05:00 GMT

కాంగ్రెస్‌కు అత్యంత విధేయులు, ఆది నుంచి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్న వారు కేవీపీ రామ‌చంద్రరావు, తిక్కవ‌ర‌పు సుబ్బరామిరెడ్డి. ఇందిరా గాంధీ హ‌యాం నుంచి కూడా పార్టీకి విధేయులుగా ఉన్నారు. పార్టీ వ్యూహాన్ని అమ‌లు చేయ‌డంలోను, స‌ల‌హాలు, సూచనలు ఇవ్వడంలోనూ సీనియ‌ర్లుగా చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా చెక్కుచెద‌ర‌ని నాయ‌కుల్లో ఈ ఇద్దరూ ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఏపీకి చెందిన అనేక మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. వేరే వేరే జెండాలు క‌ట్టుకుని అజెండాలు మార్చుకున్నారు. కానీ, కేవీపీ, సుబ్బరామిరెడ్డిలు మాత్రం ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా కాంగ్రెస్ లోనే కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

వర్గాలు లేకుండా….

పార్టీ ప‌రంగా చూసుకుంటే కేవీపీ, సుబ్బరామిరెడ్డిల‌ను కాంగ్రెస్ ఎప్పుడూ బాగానే చూసుకుంది. వారికి స‌ల‌హాదారులుగా, ఇంచార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించింది. అత్యంత కీల‌క‌మైన ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ)లోనూ మెంబ‌ర్లుగా ప‌ద‌వులు కేటాయించింది. ఒక్కమాట‌లో చెప్పాలంటే ఏపీ స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధినేత‌లు సోనియా, రాహుల్ గాంధీలు ప‌ర్యటిస్తే ఈ ఇద్దరు నాయ‌కులు ఖ‌చ్చితంగా ఉండాల్సిందే. అదేవిధంగా ఏపీ, తెలంగాణ‌ల్లో కాంగ్రెస్ ప‌రిస్థితుల‌ను కూడా ఎప్పటిక‌ప్పుడు ఈ ఇద్దరి నాయ‌కుల ద్వారా తెలుసుకోవ‌డం సోనియా స‌హా రాహుల్‌కు ప‌రిపాటి. నిజానికి ఇదే రేంజ్‌లో వీ హ‌నుమంత‌రావు వంటివారు ఉన్నప్పటికీ వ‌ర్గ ప్రాధాన్యం లేకుండా రాజ‌కీయాలు చేసిన నాయ‌కులుగా ఈ ఇద్దరికీ గుర్తింపు ఉంది.

రెండు నెలల్లో….

ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే కేవీపీ, సుబ్బరామిరెడ్డిలు ప్రస్తుతం రాజ్యస‌భ స‌భ్యులుగా ఉన్నారు. అయితే, వీరి రాజ్యస‌భ స‌భ్యత్వ కాలం ఆరు సంవ‌త్సరాలు వ‌చ్చే రెండు నెలల్లోనే ముగియ‌నుంది. అయితే, వీరు మ‌ళ్లీ మ‌రోసారి రెన్యువ‌ల్ కోరుకుంటున్నారు. నిజానికి వీరికి రాజ్యస‌భ స‌భ్యత్వాల‌ను పునరుద్ధరించ‌డం కాంగ్రెస్‌కు కూడా అవ‌స‌ర‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ‌ల్లో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకు వెళ్లాంటే ఇలాంటి సీనియ‌ర్లను వ‌దులుకోకూడ‌ద‌నే భావ‌న కాంగ్రెస్‌లో ఉంది. అయితే, ఈ ఇద్దరికీ స‌భ్యత్వాల‌ను పున‌రుద్ధరించాలంటే రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ‌లంగా ఉండాలి. కానీ, ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేదు.

ప్రయత్నాలు చేస్తున్నా….

ఇక‌, తెలంగాణ‌లో ఉన్నప్పటికీ అక్కడి నాయ‌కులు పోటీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే సుబ్బ‌రామిరెడ్డి ఛ‌త్తీస్‌గ‌ఢ్ కోటా నుంచి త‌న ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. సుబ్బరామిరెడ్డి ఛ‌త్తీస్‌ఘ‌డ్ సీఎంతో పాటు అక్కడ నేత‌ల‌ను బాగా కాకా ప‌ట్టేస్తున్నార‌ని కూడా టాక్‌. ఇక, కేవీపీ కూడా త‌న‌దైన శైలిలో ప్రయ‌త్నాల‌ను ముమ్మరం చేశారు. ఆయ‌న‌కు మిత్రుడైన ఒడిసా సీఎంను ఇప్పటికే సంప్రదించార‌ని, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కోటా నుంచి త‌న‌కు వ‌చ్చేందుకు ఉన్న మార్గాల‌ను అన్వేషిస్తున్నార‌ని స‌మాచారం. ఒక‌వేళ ఇది కుద‌ర‌క‌పోతే త‌మిళ‌నాడు లేదా క‌ర్ణాట‌క నుంచైనా ఆయ‌న రాజ్యస‌భ‌కు వెళ్లాల‌ని ప్రయ‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి వీరి ప్రయ‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

Tags:    

Similar News