అవి కేవీపీ మామ బాణాలేనా…?

రాజకీయాల్లో తెర చాటు నుంచి కూడా బాణాలు దూసుకువస్తాయి. పరిస్థితి బాగులేకపోతే అవి గట్టిగా గుచ్చుకుని చిచ్చు కూడా రేపుతాయి. ఇక రాష్ట్ర రాజకీయాల్లో జగన్ మధ్యాహ్న [more]

Update: 2021-04-21 02:00 GMT

రాజకీయాల్లో తెర చాటు నుంచి కూడా బాణాలు దూసుకువస్తాయి. పరిస్థితి బాగులేకపోతే అవి గట్టిగా గుచ్చుకుని చిచ్చు కూడా రేపుతాయి. ఇక రాష్ట్ర రాజకీయాల్లో జగన్ మధ్యాహ్న మార్తాండుడుగా వెలుగొందుతున్నా కూడా మబ్బుల మాదిరిగా ఆయన మీద ఉన్న సీబీఐ కేసులు అపుడపుడు అలా ముఖం కనిపించకుండా అడ్డుపడుతూంటాయి. జగన్ అంతటి వాడిని కాలూ చేయి కదలనీయకుండా చేసేవి ఈ కేసులే అన్న ప్రచారం కూడా ఉంది.

సన్నిహితులే అలా..?

తాజాగా జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టుకు వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు వెళ్లారు. అయితే డాక్యుమెంట్లు సరిగ్గా లేవని కోర్టు దాన్ని వాయిదా వేసింది. మళ్లీ అన్ని వివరాలతో సమర్పించమని కూడా కోరింది. అయితే ఈ వార్త మాత్రం వైసీపీ వర్గాల్లో దావానలంగా వ్యాపించింది. ఇంతకీ ఈ రాజు గారు ఎవరు అంటే నాడు వైఎస్సార్ కి సన్నిహితుడు. అంతకు మించి
వైఎస్సార్ కి ఆత్మ లాంటి సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు స్వయాన వియ్యంకుడు. అదే కేవీపీని జగన్ మామ అని సంభోదించేటంత చనువు ఉంది. ఇక విధంగా చూస్తే జగన్ మీద సొంత వారే బాణాలు వేస్తున్నారు అని చెప్పుకోవాలేమో.

త్రిమూర్తులు అలా….?

ఇక జగన్ మీద గత కొన్నాళ్ళుగా ముగ్గురు నాయకులు అదే పనిగా విరుచుకుపడుతున్నారు. వారిలో ఒకరి ఎంపీ రఘురాముడు అయితే మరొకరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మూడవ వారు విశాఖకి చెందిన సబ్బం హరి, ఈ ముగ్గురినీ కలిపే కనెక్టివిటీ ఒకటి ఉంది. అదే కేవీపీ అని అంటున్నారు. తన సొంత సామాజిక వర్గమనే కేవీపీ 2009 ఎన్నికల్లో సబ్బం హరికి చివరి నిముషంలో వైఎస్సార్ ద్వారా అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు అని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. హరి వైసీపీ ప్రవేశం వెనక, బయటకు రావడం వెనక కూడా కేవీపీ సలహాలు ఉన్నాయని కూడా అనుమానించేవారున్నారు. ఇక ఉండవల్లి విషయానికి వస్తే ఆయనకు కేవీపీ అంటే గురు సమానం. వైఎస్సార్ కంటే కూడా కేవీపీయే తనకు మొదట పరిచయం, తొలి ప్రాధాన్యం అని కూడా ఒక దశలో ఉండవల్లి చెప్పుకున్నారంటేనే ఈ బంధం బహు గట్టిది అని అర్ధమవుతోందిగా.

దూరమెందుకు…?

ఇక రాజ్యసభ సభ్యత్వం ముగిశాక కేవీపీ కనీసం బయటకు రావడంలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పెద్దగా పనిలేకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక కేవీపీకి జగన్ కి మధ్య దూరం ఎందుకు పెరిగింది అన్నది కూడా ఒక చర్చ. జగన్ ఆయన్ని సొంత కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు. మామా అని ఆప్యాయంగా పిలుస్తారు. కానీ వైసీపీలోకి కేవీపీ రాలేదు, జగన్ ఆయన్ని పిలిచి పెద్ద పీట వేయలేదు. మరి ఈ మతలబు ఏమిటో ఎవరికీ అర్ధం కాదు, మరో వైపు కేవీపీకి సన్నిహితంగా ఉన్న వారంతా జగన్ అంటే మండిపోతున్నారు. ఆఖరుకు జగన్ బెయిల్ రద్దు చేయించాలన్న పట్టుదలతో స్వయంగా కేవీపీ వియ్యకుడు అయిన రఘురామక్రిష్ణంరాజు కంకణం కట్టుకున్నాడు అంటే దీని వెనక ఎవరున్నారు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా ఉందిట. ఏది ఏమైనా జగన్ ఎవరిని అయినా ఎదిరిస్తారని పేరు. దేనికైనా ఆయన చివరాఖ‌రునే నిలబడతారు. రాయబేరాలు రాజీ వ్యవహారాలు ఆయన దగ్గర లేవని కూడా వైసీపీ నేతలు అంటారు. ఏది ఏమైనా వైఎస్సార్ ఆత్మ సన్నిహితులే జగన్ తో చెడుగుడు ఆడడం రాజకీయ చిత్ర్రంగానే చూడాలి.

Tags:    

Similar News