ఆశ్చర్యం.. అనన్య సామాన్యం.. సీన్ చూస్తే ఇలా?

నిన్న మొన్నటి దాకా ఉగ్రవాదంతో ఊపిరాడని జమ్ము కశ్మీర్ లో సరికొత్త పరిస్థితి నెలకొంటోంది. దేశాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. శాంతి కుసుమాలు వెల్లి విరుస్తున్నాయి. దశాబ్దాల తరబడి [more]

Update: 2020-08-20 16:30 GMT

నిన్న మొన్నటి దాకా ఉగ్రవాదంతో ఊపిరాడని జమ్ము కశ్మీర్ లో సరికొత్త పరిస్థితి నెలకొంటోంది. దేశాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. శాంతి కుసుమాలు వెల్లి విరుస్తున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగిన అశాంతి బదులు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 370వ అధికరణ రద్దు నాటి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పోలీసుల కాల్పులు తగ్గాయి. వేర్పాటువాద నాయకుల దూకుడు తగ్గింది. ఉగ్రవాదుల సంచారం వెనకటి మాదిరిగా లేదు. పోలీసులు కాస్త ఊపిరి పీలుచకుంటున్నారు. ముఖ్యంగా కశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ఏడాది కిందిటికి ఇప్పటికి ఎంతో తేడా కనపడుతోంది. 370వ అధికరణ రద్దు చేసి ఈ నెల 5వ తేదీకి సంవత్సరం పూర్తయింది. మొత్తంమీద పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ప్రజలు భయానికి దూరంగా గడుపుతున్నారు.

మరో మూడేళ్లలో…..

కశ్మీరులో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసుతంటే ఆశ్ఛర్యం కలగక మానదు. కేంద్రపాలిత పారంతానికి రెండు ఎయిమ్స్ లను మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా రెండు ఎయిమ్స్ లు లేవు. జమ్మూలో ఒకటి లోయలో మరొకటి ఎయిమ్స్ ల నిర్మాణం జరుగుతోంది. జమ్మూలోని సాంబ జిల్లాలోని విజయ్ నగరలో రూ.1661 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద పనులు చేపట్టారు. 2023 నాటికి ఇవి పూర్తవుతాయని అంచనా. ఎయిమ్స్ పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని అంచనా. లోయలోని పుల్వామా జిల్లాలోని అవంతీపురలో రూ.1828 కోట్లతో మరో ఎయిమ్స్ పనులు చేపట్టారు. 2025 నాటికి పనులు పూర్తవుతాయని అంచనా. ఈ ప్రాంతం ఉగ్రవాదానికి కేంద్రంగా ఉండేది. ఎయిమ్స్ పనిచేయడం మొదలైతే లోయలోనిప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయి. ఇవి కాక మరో 9 వైద్య కళాశాలలనుకేంద్రం మంజూరు చేసింది. కేవలం వైద్య సౌకర్యాలే కాక విద్యా సౌకర్యాలకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

ఏ రాష్ట్రాలకు ఇవ్వని విధంగా…..

ఐఐటీ, ఐఐఎంలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు శ్రీనగర్ లో మాత్రమే నిట్ ఉంది. ఐఐటీ, ఐఐఎంల పనులు పూర్తయితే జమ్మూ కాశ్మీర్ విద్యా కేంద్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా పెద్ద రాష్ట్రాల్లో కూడా ఐఐటీ, ఐఐఎంలు లేకపోవడం గమనార్హం. దీనిని బట్టి కశ్మీరుకు కేంద్రం ప్రాధాన్యం ఏమిటో విదితమవుతోంది. ఉమ్మడి ఏపీలో ఒక్క ఐఐఎం కూడా లేకపోవడం గమనార్హం. 2014లో విభజన అనంతరం తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఐఎంలు మంజూరయ్యాయి. 9 వైద్య కళాశాలలు, ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంలతో విద్య, వైద్య సౌకర్యాలు మరింత విస్తృతం కానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కలగనుంది. అనంతనాగ్, బారాములాల, రాజౌరీ, దోడా, కథువాలలో కోట్ల రూపాయలతో కేంద్రం వైద్య కళాశాలలను మంజూరు చేసింది. పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుసు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ కరోనా కారణంగా ఈ సదస్సు వాయిదా పడింది. కరోనా తగ్గిన తరవాత నిర్వహిస్తామని పారిశ్రామిక అభివృద్ది మండలి ఎండీ రవీంద్రకుమార్ తెలిపారు.

కొత్త గవర్నర్ నియామకంతో…..

అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు కొత్త గవర్నరుగా మనోజ్ కుమార్ సిన్హాను కేంద్రం నియమించింది. ఇంతకుముందు గవర్నర్ గా పనిచేసిప జీసీ ముర్ము ఐఏఎస్ అధికారి. ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైఖరి ఉపయుక్తం కాదన్న భావనతో ముర్మును బదిలీ చేసి కాగ్ కు చీఫ్ గా నియమించింది. ఆయన స్థానంలో యూపీకి చెందిన కమలం నాయకుడు మనోజ్ కుమార్ సిన్హాను నియమించింది. ఉన్నతాధికారులకు బదులు రాజకీయ నాయకుడిని గవర్నరుగా నియమించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. కరోనా వైరస్, లదాఖ్ లో గొడవలు లేనట్లయితే ఇంకా మెరుగుపడేవన్న అభిప్రాయం ఉంది. 370వ అధికరణ రద్దు అనంతరం ఉగ్రవాద సంస్థలలో యువత చేరడం బాగా తగ్గిపోయింది. 2019 ఆగస్టు 5 వతేదీకి ముందు ఏడాది కాలంలో 172 మంది యువకులు ఉగ్రవాద సంస్థలలో చేరగా, ఈ ఏడాది కాలంలో ఆ సంఖ్య వందకే పరిమితం కావడం గమనార్హం. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్ల ఘటనలు 241 నుంచి 162కు పరిమితమయ్యాయి. ఎదురుకాల్పుల ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. లోయలో మారుతున్న పరిస్థితులకు ఇంతకుమించి వేరే నిదర్శనం అక్కరలేదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News