ఇక ఆశలు పెంచుకోవడమూ వేస్టే

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్, బీజపీలకు సంతృప్తికరమైన ఫలితాలనే ఇచ్చాయి. మూడోసారి అధికారంలోకి రావడంతో టీఎంసీ తన పట్టును నిలుపుకుంది. ఇక గత ఎన్నికల్లో మూడు [more]

Update: 2021-05-23 18:29 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్, బీజపీలకు సంతృప్తికరమైన ఫలితాలనే ఇచ్చాయి. మూడోసారి అధికారంలోకి రావడంతో టీఎంసీ తన పట్టును నిలుపుకుంది. ఇక గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి 70కి పైగా స్థానాలను సాధించడంతో ఉత్సాహంతో ఉంది. ఎప్పటికైనా బెంగాల్ ను చేజిక్కించుకుంటామన్న నమ్మకంతో ఉంది. ఓట్ల శాతాన్ని కూడా బీజేపీ గణనీయంగా పెంచుకుంది. కానీ వామపక్ష పార్టీలు మాత్రం ఇక్కడ చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది.

మూడు దశాబ్దాల పాటు….

పశ్చిమ బెంగాల్ అంటేనే వామపక్షాలు గుర్తుకు వస్తాయి. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వామపక్ష పార్టీలు ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెంచుకున్నాయి. 2011 వరకూ కామ్రేడ్లు అధికారంలోనే ఉన్నారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ చేతుల్లో ఓడిపోయారు. 2011 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఓటమి పాలయినప్పటికీ 30.1 శాతం ఓట్లను సాధించుకుంది. దాదాపు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ ను పాలించిన వామపక్షాలు ఈ ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయిపోయాయి.

కేవలం ఐదు శాతం…..

బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీలు కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం కేవలం ఐదు శాతమే. కాంగ్రెస్ పరిస్థిితి కూడా దాదాపుగా అంతే ఉంది. అంటే పశ్చిమ బెంగాల్ లో వామపక్ష పార్టీలు కనుమరుగయినట్లేనన్నది విశ్లేషకుల అంచనా. వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్న చోట కూడా బీజేపీ విజయం సాధించింది.

బీజేపీకి షిప్ట్ అవ్వడంతో….?

ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా వామపక్షాలు సాధించుకోలేకపోయాయి. బీజేపీ అధికారంలోకి రాకూడదని భావించిన బెంగాలీలు ఎక్కువ శాతం టీఎంసీ వైపు చూశారని విశ్లేషణలు విన్పిస్తున్నాయి. టీఎంసీ వ్యతిరేక ఓటు సహజంగా వామపక్షాలకు రావాల్సి ఉండగా, అది బీజేపీ చేజిక్కించుకుంది. ఫలితంగా పశ్చిమ బెంగాల్ లో వామపక్ష పార్టీలకు చోటు లేకుండా పోయింది. ఇక పశ్చిమ బెంగాల్ పై వామపక్షాలు ఆశలు వదిలేసుకోవల్సిందే.

Tags:    

Similar News