ఇప్పటికైనా అర్థమయిందిగా…?

వామపక్షాలకు గొప్ప చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వరకూ చూసుకున్నా ఒకనాడు అధికారం అంచులదాకా వచ్చారు తొలినాళ్ళలో వారే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు [more]

Update: 2019-11-03 06:30 GMT

వామపక్షాలకు గొప్ప చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వరకూ చూసుకున్నా ఒకనాడు అధికారం అంచులదాకా వచ్చారు తొలినాళ్ళలో వారే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు నిఖార్సైన పోటీ ఇచ్చేవారు. తరువాత కాలంలో వామ‌పక్ష ఉద్యమం రెండుగా చీలడంతో బలం తగ్గిపోయింది. ఆనక రాజకీయాల్లో కులతత్వం, ప్రాంతీయ భావన, సంకుచితమైన ఆలోచనలు వచ్చేశాక వామపక్షాలు మెల్లగా బ్యాక్ బెంచీలకు వెళ్ళిపోయారు. ఇక డబ్బు, కండబలం పోటీలోకి దిగిపోయాక పూర్తిగా తప్పుకోవాల్సివచ్చింది. అయినా వామపక్షల పాత్ర, వారి అవసరం ఎప్పటిపుడు సమాజానికి గుర్తుకువస్తూనే ఉంది. నూతన ఆర్ధిక విధానాలు జోరుగా అమలవుతున్న వర్తమానంలో కామేడ్ల ప్రాధాన్యత పెరుగుతోంది. కానీ వారిని మెయిన్ స్ట్రీం రాజకీయాల్లోకి రానీయకుండా పెట్టుబడి శక్తులు అడ్డుకట్ట వేస్తూనే ఉన్నాయి. మరో వైపు చూస్తే వారిలోనూ గతం కంటే పోరాట పటిమ తగ్గింది.

తోక పార్టీలుగా…..

తోక పార్టీలు వామ పక్షాలు అని సులువుగా కేసీఆర్ లాంటి వారు అనేస్తున్నారంటే అది వారి గతి గమ్యంలో చోటు చేసుకున్న అయోమయంగానే చెప్పాలి. ఇక ఏపీలో జగన్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు వారిని దరిదాపుల్లోకి రానీయకుండా జాగ్రత్తపడుతున్నారు. పొత్తుల ఎత్తులకు మొదట్లోనే వైసీపీ ససేమిరా అనేసింది. చంద్రబాబు దశాబ్దం క్రితం వరకూ వారిని అక్కున చేర్చుకుని ఇప్పుడు కరివేపాకుని చేసేశారు. ఇక ఏపీలో ఏదోలా కనిపించాలనుకుని తాపత్రయపడిన దానికి ఫలితమే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు. అప్పట్లో మూడవ రాజకీయ వేదిక తమదేనని వామ‌పక్షాలు అనుకున్నాయి. తరువాత పవన్ వారికి ఇచ్చిన విలువ, సీట్ల కేటాయింపులో వివక్ష చివరి నిముషం వరకూ సీట్ల మార్పుచేర్పులతో అవమానించి గందరగోళంలోకి నెట్టడంతో మౌనంగానే భరించారు. అయితే ఎన్నికల్లో పవన్ జనసేనా ఓడింది. వామపక్షాలు ఓడిపోయాయి. అన్నిటికంటే వారిని, ఆ పార్టీలను ఆభిమామనించే వారికి బాధించింది ఒకటి ఉంది. అదే సిద్ధాంతాలు ఓడిపోతున్నాయని. అందుకే కామ్రెడ్స్ ఇపుడు ఏపీలో మళ్ళీ మొదటి నుంచీ అడుగులు వేస్తున్నాయి.

ఘాటైన లేఖ….

జనసేనాని లాంగ్ మార్చ్ కి వామపక్షాలు తప్పక వస్తాయని అంతా భావించారు. ఎందుకంటే ఎన్నికలలో పొత్తు ఉంది కాబట్టి. పవన్ సైతం అదే నమ్మకంతో పిలిచారు. కానీ కామ్రేడ్స్ మాత్రం ససేమిరా రామని తెగేసి చెప్పాయి. అంతే కాదు. పవన్ భవిష్యత్తు రాజకీయ కోణాన్ని కూడా రేఖామాత్రంగా బయటపెట్టాయి. బీజేపీని కూడా పిలిచిన చోట మేము రామని సిధ్ధాంతాన్ని వల్లించినా పవన్ బీజేపీకి కన్ను గీటుతున్నాడన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. పైగా తమతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పెద్దగా పట్టించుకోని జనసేనకు సరైన సమయంలో రిటార్ట్ ఇచ్చాయి. తాము ఎపుడూ ఎర్రన్నలమేనని కూడా నిరూపించుకున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇప్పటికైతే కామ్రెడ్స్ ది ఒంటరి బాటగానే చెప్పాలి. ప్రజా సమస్యలపై వారు చేసిన పోరాటాలు ఎవరూ చేయేలేరు కూడా. దాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగితే రేపటి రోజున అరుణ కాంతులు ఆంధ్రాలో విరిసినా విరియవచ్చు.

Tags:    

Similar News