ఇక షూష్కో.. మా తడాఖా.. మందు బాబుల ఉద్యమమే ఆలస్యమా?

ఏపీ లో జగన్ సర్కార్ మద్యం పాలసీ మందు ప్రియుల్లో మంటలు రేపుతోంది. నచ్చిన బ్రాండ్ ఎంపిక చేసుకునే అవకాశం ఎందుకు లేదంటూ సోషల్ మీడియా ను [more]

Update: 2020-03-07 05:00 GMT

ఏపీ లో జగన్ సర్కార్ మద్యం పాలసీ మందు ప్రియుల్లో మంటలు రేపుతోంది. నచ్చిన బ్రాండ్ ఎంపిక చేసుకునే అవకాశం ఎందుకు లేదంటూ సోషల్ మీడియా ను వేదికగా చేసుకుని మద్యం ప్రియులు రెచ్చిపోతున్నారు. అసలే మద్యం షాపుల సమయాన్ని కుదించడం, ఆ తరువాత మద్యం ధరలు చుక్కల నంటడంతో తాగకుండానే అంతా దీనిపై ఊగిపోతున్నారు. వీరి ఆందోళనలకు టిడిపి మద్దతు ప్రకటించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు అలుముకుంది.

బ్రాండ్ లతో బ్యాండ్ …

దేశంలో ఏ రాష్ట్రం లో లేని బ్రాండ్ లను దింపి రెగ్యులర్ బ్రాండ్స్ కి చెక్ చెప్పి ప్రభుత్వ షాపుల్లో మద్యాన్ని విక్రయాలు సాగుతున్నాయి. బార్లలో అయితే మాత్రం అన్ని బ్రాండ్ లు లభించే వెసులుబాటు వున్నా ధర చాలా ఎక్కువ కావడంతో మద్యం ప్రియుల కోపం నషాళానికి ఎక్కుతుంది. దాంతో తాగి చాలా మంది సోషల్ మీడియా లో వైసిపి సర్కార్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. జగన్ సర్కార్ ను కెసిఆర్ సర్కార్ ను పోలుస్తూ తెలంగాణ కు జై కొట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలను టిడిపి సోషల్ మీడియా వింగ్ బాగా వైరల్ చేస్తుంది.

షో స్టార్ట్ చేసేసారు ….

ఏపీ లో కొత్త మద్యం పాలసీ వచ్చిన నాటినుంచి టిడిపి బాహాటంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. చంద్రబాబు అసెంబ్లీ నుంచి ప్రజాచైతన్య యాత్రల్లోనూ కామెడీ చేసేస్తున్నారు. తమ్ముళ్ళు మనం కోరిన బ్రాండ్స్ దొరుకుతున్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బాబు తీరుపై మహిళలు మండిపడుతున్న మద్యం ప్రియుల్లో మాత్రం మంచి జోష్ పెరుగుతుంది. అక్కడితో ఆగకుండా పార్టీ నేతలతో బ్రాండ్ లు ముందేసుకుని టిడిపి నాయకులు మీడియా సమావేశాల ముందుకు వచ్చి షో స్టార్ట్ చేసేశారు. దీనిపైనా వైసిపి నేతలు సెటైర్లు పేలుస్తున్నా ఏ పార్టీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కొన్ని బ్రాండ్ లు మాత్రమే అమ్మకాల వెనుక జె ట్యాక్స్ అంటూ టిడిపి నానాగోలా మొదలు పెట్టింది. ఈ ఆరోపణలను మాత్రం వైసిపి సమర్ధంగా తిప్పికొట్టలేకపోతుంది.

అసంతృప్తి పెరిగిపోతుంది …

తమ ఆవేదన ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు బాగా లభిస్తూ ఉండటంతో మద్యం ప్రియులు సంఘాలుగా ఎక్కడికక్కడ ఏర్పడి పోరాటానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా లో వీరి పోస్ట్ లు ఇవే సూచిస్తున్నాయి. వీరికి వెనుక నుంచి కావలిసినంత సపోర్ట్ మేము ఇస్తామంటూ టిడిపి నాయకులు ఉండటంతో రాబోయే రోజుల్లో మద్యం బ్రాండ్ లు ధరలపై మందు ప్రియులు చెలరేగే లాగే కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఏపీ లో దశలవారీ మద్యపాన నిషేధం విధిస్తామని మద్యాన్ని కొనుగోలు చేయలేనంత ధరలు పెంచుతామని ముందే చెప్పిన వైసిపి ఇప్పుడు రాబోతున్న మందు ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Tags:    

Similar News