పరాయి వాడయిపోయారే….!!

సేవలకు విలువ లేదు.. త్యాగాలకు గుర్తింపు లేదు… కరివేపాకులా తీసేశారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ స్వచ్ఛందంగా రాజకీయ విరమణ చేశారా? లేక బలవంతంగా [more]

Update: 2019-03-22 16:30 GMT

సేవలకు విలువ లేదు.. త్యాగాలకు గుర్తింపు లేదు… కరివేపాకులా తీసేశారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ స్వచ్ఛందంగా రాజకీయ విరమణ చేశారా? లేక బలవంతంగా పంపారా? అద్వానీ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఆయన పార్టీని రెండు సీట్ల నుంచి అధికారం వరకూ తేగలిగారు. అటువంటి అద్వానీకి టిక్కెట్ నిరాకరించడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాయనను పక్కన పెట్టేసి ఏం సాధిస్తారన్న ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు.

కనీస కృతజ్ఞత లేకుండా…….

2014 ఎన్నికల తర్వాత నుంచి భారతీయ జనతా పార్టీ మొత్తం ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేతుల్లోకి వచ్చేసింది. వీరిద్దరి మాటే వేదం అయింది. కనీసం రాష్ట్రపతిగా సీనియర్ నేత అద్వానీని పంపాలన్న ఆలోచన కూడా వీరికి రాలేదు. ఈ పదవి కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే భర్తీ చేశారన్న విమర్శలున్నాయి. దశాబ్దాలుగా భారత్ లో పాతుకుపోయిన కాంగ్రెస్ ను బయటకు పంపి కమలం పార్టీకి జీవం పోశారన్న కనీసం కృతజ్ఞత వారిలో కొరవడింది. అద్వానీ తాను పోటీ చేయలేనని చెప్పలేదు. అలాగని చేస్తానని చెప్పలేదు. కానీ ఆయనకు గౌరవం ఇవ్వదలచుకుంటే ఆయన సమ్మతితోనే గాంధీనగర్ టిక్కెట్ ను ప్రకటిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

కూతురికీ ఇవ్వకుండా…..

అందుతున్న సమాచారం ప్రకారం అద్వానీ కూతురు ప్రతిభా అద్వానీకి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. అయితే దీనికి కూడా కేంద్ర నాయకత్వం తిరస్కరించినట్లు చెబుతున్నారు. గాంధీనగర్ అద్వానీకి కంచుకో్ట. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నది కమలం పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరి మనసులో మాట. అలాంటి అద్వానీని పార్టీకి పరాయి వాడిగా చేయడం కమలం పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్ర నాయకత్వంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు విన్పిస్తున్నాయి.

కరివేపాకులా తీసేసి……

అద్వానీ పార్టీలో ఊరికే అమాంతం వీరిలా ఎదగలేదు. ఆయన జనసంఘ్ నుంచి సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి బీజేపీలో కీలకనేతగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీకి దేశ వ్యాప్తంగా జీవం పోశారు. ఏనాడు పార్టీ సిద్ధాంతాలకు నీళ్లొదలలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను తూ.చ. తప్పక పాటించే అద్వానీకి మోదీ, అమిత్ షాలు సరైన బహుమతి ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆయన స్థానంలో గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న అమిత్ షా ఈ ఎన్నికల్లో మాత్రం గాంధీనగర్ నే ఎంచుకోవడం అద్వానీకి పొగపెట్టడానికే అంటున్నారు. మొత్తం మీద అద్వానీ రాజకీయ శకం ముగిసినట్లే. బాధాకరం.

Tags:    

Similar News