పొడిగింపు సరే… చెల్లింపు..?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరో పది రోజులకు పైగా లాక్ డౌన్ అమలు కానుంది. పరస్పర విరుద్ధ కారణాలతో రెండు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని [more]

Update: 2021-05-19 15:30 GMT

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరో పది రోజులకు పైగా లాక్ డౌన్ అమలు కానుంది. పరస్పర విరుద్ధ కారణాలతో రెండు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. కేసులసంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. కాబట్టి మరికొన్ని రోజులు ప్రజా కార్యకలాపాలను నిషేధిస్తున్నామంటూ తెలంగాణ ప్రకటించింది. కేసుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి కట్టడి కోసం లాక్ డౌన్ వ్యవధి పెంచుతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. కారణాలు వేరైనా నిర్ణయం ఒక్కటే. దేశ వ్యాప్తంగా పరిస్తితులు ఒకే రకంగా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టే సాహసం ఎవరూ చేయడం లేదు. అయితే ప్రజలకు సంబంధించి ఉపాధి, నిత్యావసరాల వంటి వాటిపై ఏర్పాట్లు చేయకుండానే లాక్ డౌన్ లు పొడిగించుకుంటూ పోతున్నారు. దీనివల్ల మొత్తం దేశ జనాభాల్లో 45శాతం ప్రజల జీవన స్థితిగతులు తారుమారవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్థిర ఆదాయమూ, శాశ్వత ఉద్యోగమూ ఉన్నవారికి ఫర్వా లేదు. కానీ అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న వారి కి వేతనాలు, పోషణ సంగతి ఏమిటనే ప్రశ్న కు సమాధానం లేదు. ప్రయివేటు కంపెనీలు సైతం లాక్ డౌన్ లో జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. కానీ దానిని అమలు చేసేవారెవరు? ఇప్పటికే చాలా కంపెనీలు జీతాలలో కోతలు విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు అవకాశం దొరికిందని ఉద్యోగాలు తీసేస్తున్నాయి. వీటిపై ప్రభుత్వాల పర్యవేక్షణ, నిఘా కనిపించడం లేదు.

బతుకు బరువు…

ఒకవైపు నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అదే సమయంలో గ్రామాల నుంచి పట్టణాలకు రవాణా వ్యవస్థ పూర్తి స్తాయిలో పనిచేయడం లేదు. దూరప్రాంతాల నుంచి కూరగాయల వంటివి గతంలో మాదిరిగా సరఫరా కావడం లేదు. దాంతో నగరాలు, పట్టణాల్లో కొరత ఏర్పడి రేట్లు పెంచేస్తున్నారు. ప్రజలకు దొరకడమే మహాభాగ్యం అన్నట్లుగా మారింది. ఇదంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల సంగతి. దిగువ స్థాయిలో ఉన్న ప్రజల విషయానికొస్తే నోటిలోకి నాలుగువేళ్లు వెళ్లే వాతావరణం కనిపించడం లేదు. గత సంవత్సరం కరోనా కారణంగా 20 కోట్ల మంది ప్రజలు పస్తులున్నారనేది ఒక అంచనా. ఇప్పుడు పరిస్థితులు అంతకంటే మెరుగ్గా ఏమీ లేవు. పైపెచ్చు అప్పటికంటే వైద్య ఖర్చులు భారంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం మనిషికి అయిదు కేజీల బియ్యం చొప్పున సరఫరా చేస్తామంటూ ప్రకటించింది. పేదరికం కార్డులు ఉన్నవారికే ఇది వర్తి స్తుంది. రోజువారీ కూలి కోసం వలసకు వెళ్లిన వారు పూర్తిగా స్వగ్రామాలకు చేరుకోలేదు. వారికి ఈ సదుపాయం కూడా అనుమానమే. ప్రస్తుతం జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి. కేవలం బియ్యంతోనే ప్రజల అవసరాలన్నీ తీరిపోవు. నగదు రూపంలో ఎంతోకొంత పేదలకు అందేలా ఏర్పాటు చేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

పేదరికానికి పెను శాపం..

మనదేశం పేరుకు అభివ్రుద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటుంది. రానున్న అయిదేళ్లలో ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చుతుందని లెక్కలు వేసుకుంటున్నాం. కానీ ఇంకా రోజుగడవని పేదరికం వెంటాడటం సిగ్గు చేటు. సాధారణ పరిస్థితుల్లోనే మనదేశంలో ప్రపంచంలోని పేదల్లో 40శాతం వరకూ ఉంటారని అంచనా. కరోనా వంటి అసాధారణ రోగాలు దీనిని మరింత పెంచుతున్నాయి. దనికులు, పేదల మధ్య మరింత అంతరం పెరుగుతోంది. ఇది సామాజిక అసహనానికి దారి తీసే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలకు పెట్టుబడి, ఆదాయమూ ప్రజలే. వారు సంపాదిస్తూ కొనుగోళ్లు చేస్తూంటేనే పన్నుల రూపంలో సొమ్ము సమకూరుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏదో రూపంలో ప్రజల చేతిలో సొమ్ములు ఉండేలా ప్రభుత్వాలు చూసుకోవాలి. బ్యాంకు రుణాలు, ప్యాకేజీలు అమలు చేయడం తప్పనిసరి.

లాక్ వేయండి…

అన్ని వ్యాపార వ్యవహారాలపైనా ప్రభుత్వాలు నియంత్రణలు విధించాయి. అయినా మద్యం ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ద పడటం లేదు. ప్రజల్లో ఉండే వ్యసనాన్ని తెలివిగా ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇన్ని కష్టాల్లో ఉన్నా తాగుబోతులు మందు కొనుగోళ్లు ఆపడం లేదు. తలతాకట్టు పెట్టైనా వారి వ్యసనాలను సంతృప్తి పరుచుకుంటున్నారు. దీనివల్ల కుటుంబాలు కష్టాల పాలవుతున్నాయి. కనీసం లాక్ డౌన్ ముగిసే వరకూ మద్యం అమ్మకాలను నిషేధిస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలు తిరెపిన పడతాయి. ప్రభుత్వాలు అందించే సాయం ఎలాగూ లేదు. కనీసం ఈ పుణ్యమైనా కట్టుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు.

కేంద్రం తప్పించుకుంటోంది…

గడచిన ఏడాది లాక్ డౌన్ లో చాలా హడావిడి చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మౌనం వహిస్తోంది. తన బాధ్యత నుంచి దాదాపు తప్పించుకుంటోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా పన్నుల్లో మినహాయింపులు ఇవ్వడం లేదు. క్లిష్ట సమయంలో రవాణా వ్యవస్థకు కీలకమైన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పరుగులు తీస్తున్నాయి. గతంలో వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు ప్యాకేజీలు అంటూ ప్రకటించింది. అవి ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. ఈ సారి మళ్లీ వాటి ఊసెత్తడం లేదు. అందుకే లాక్ డౌన్ నిర్ణయం తాను తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల నెత్తిన రుద్దింది. వైద్య, ఆరోగ్య వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడులతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లు ప్రకటిస్తున్నాయి. పొడిగిస్తున్నాయి. వాక్సిన్లు పంపిణీ పెంచడం, ఉచితంగా వైద్య సదుపాయాల వంటి వాటిని మాత్రం విస్మరిస్తున్నాయి. మొత్తమ్మీద ఎప్పుడు తెర పడుతుందో తెలియని కరోనాతో లాక్ డౌన్ లు సైతం ఎఫ్పుడు ముగుస్తాయో తెలియడం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News