బలం పెంచుకోవాలనేనా…??

కర్ణాటక రాజకీయాలు ఇంత హాట్ హాట్ గా మారడానికి అసలు కారణం లోక్ సభ ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీట్ల కోసం పంచాయతీయే [more]

Update: 2019-01-31 18:29 GMT

కర్ణాటక రాజకీయాలు ఇంత హాట్ హాట్ గా మారడానికి అసలు కారణం లోక్ సభ ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీట్ల కోసం పంచాయతీయే సంకీర్ణ సర్కార్ లో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య విభేదాలు తలెత్తాయంటున్నారు. నిజానికి జనతాదళ్ ఎస్ కు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ. దానిని ప్రాంతీయ పార్టీ కన్నా ఉప ప్రాంతీయ పార్టీగానే చెప్పుకోవచ్చు. అలాంటి జనతాదళ్ ఎస్ కు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఊహించని ఛాన్స్ లభించింది. ఏకంగా ముఖ్యమంత్రి పదవి దక్కింది. జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలు ఈ తరుణంలోనే పార్టీని బలోపేతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కుమారస్వామి కూడా బడ్జెట్ లో రైతు రుణ మాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీకి ఓట్లు పెంచుకోవాలని చూస్తున్నారు.

అధిక స్థానాలను ఆశిస్తూ….

కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ ఎక్కువగా పోటీ చేయాలని భావిస్తుంది. కానీ జాతీయ స్థాయిలో పార్టీ బలం పెంచుకునే దిశగా దళపతి దేవెగౌడ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా తమకు పన్నెండు స్థానాలను కేటాయించాలని దేవెగౌడ కోరుతున్నారు. అయితే ఇందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదు. తాము 22 స్థానాల్లో పోటీ చేస్తామని ఆరు స్థానాలకంటే ఎక్కువ ఇచ్చుకోలేమని కాంగ్రెస్ పార్టీ దేవెగౌడకు సంకేతాలు పంపింది. దేవెగౌడ మైసూరు, మాండ్య, హాసన్, తుమకూరు, శివమొగ్గ, చిత్రదుర్గ, కోలార్, చిక్ బళ్లాపుర, చామరాజనగర, బెంగుళూరు నార్త్ స్థానాలను కోరుతున్నారు. ఇక్కడ జనతాదళ్ ఎస్ బలంగానే ఉండటంతో ఆయన ఈ స్థానాలను తమకు ఇవ్వాలని కోరుతున్నారు. మరో రెండు స్థానాలను కూడా దేవెగౌడ అడుగుతున్నారు.

ససేమిరా అంటున్న….

కాని కాంగ్రెస్ మాత్రం అన్ని స్థానాలను ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే విధాన సభ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చామని గుర్తు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా జేడీఎస్ ప్రతిపాదనపై అభ్యంతరం తెలుపుతున్నారు. అందుకే బీదర్, విజయపుర, రాయచూరుతో పాటు పాత మైసూరు జిల్లాలను జేడీఎస్ కు కేటాయిస్తామని కబురు పంపింది. అవసరమైతే సొంతంగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ బీజేపీ తర్వాత స్థానం తమకే దక్కడంతో లోక్ సభ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు సాధించుకోవడం అవసరమని, తమ అధినేతకు అత్యవసరమని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతోంది. చివరకు ఆరు నుంచి ఎనిమిది స్థానాలను మాత్రమే ఇవ్వగలమని అలా ఇష్టపడకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామన్న సంకేతాలను పంపింది.

బీజేపీ ఆఫర్ కూడా ఉందట….

అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కుమారస్వామి సర్కార్ పై బీజేపీ అవిశ్వాసం పెట్టాలని యోచిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ జనతాదళ్ ఎస్ తో మంతనాలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. యడ్యూరప్ప తరుపున ఇప్పటికే ఒకరు జేడీఎస్ తో టచ్ లోకి వెళ్లారంటున్నారు. జేడీఎస్ అడిగిన సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధమని కమలనాధులు కొత్త వ్యూహానికి దిగారంటున్నారు. అందువల్లనే కుమారస్వామి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటున్నారు. ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తగ్గితే జేడీఎస్ కు ఐదేళ్లూ ఊడిగం చేయాల్సి వస్తుందని, వాళ్ల గొంతెమ్మ కోర్కెలను తీర్చడం తమవల్ల కాదని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. దళపతి దేవెగౌడ మాత్రం కాంగ్రెస్ తోనే కలసి వెళ్లే యోచనలో ఉన్నారు. ఆయన కనీసం పది స్థానాలను సాధించుకునే పనిలో ఉన్నారు. మరి ఎన్ని సీట్లు దక్కించుకుంటారో దళపతి చూడాల్సిందే.

Tags:    

Similar News