ఎల్వీ అక్కడకు వెళ్లి వచ్చిన తర్వాతే..?

ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వేటు పెద్ద దుమారాన్నే రేపుతోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎల్వీ సుబ్రమణ్యం మంచి అధికారిగా [more]

Update: 2019-11-07 03:30 GMT

ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వేటు పెద్ద దుమారాన్నే రేపుతోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎల్వీ సుబ్రమణ్యం మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలు అందించి ఈ స్థాయికి చేరుకున్నారు. వైఎస్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందని కూడా ప్రచారం ఉంది. అప్పట్లో చంద్రబాబు ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్ కేసుల్లో ముద్దాయి అంటూ నిందించడం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆయన్ని తీసుకువచ్చి ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా జగన్ ని గెలిపిస్తున్నారంటూ ఎన్నికల వేళ బాబు ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక జగన్ సీఎం అయిన తరువాత ఎల్వీ సుబ్రమణ్యాన్ని తనతో పాటే ఢిల్లీకి తీసుకువెళ్ళి మరీ ప్రధానితో సమావెశం జరిపారు. ఇంతలా ఎఎల్వీ సుబ్రమణ్యం కి ప్రాధాన్యత ఇచ్చే జగన్ హఠాత్తుగా ఆయనపై గుస్సా పెంచుకుని బదిలీ వేటు వేయడాన్ని ఎవరూ హర్షించలేకపోతున్నారని అంటున్నారు. నిజానికి ఎల్వీ సుబ్రమణ్యం వంటి వారికి రాజకీయాల కంటే విధి నిర్వహణ పట్ల నిబద్ధతే తెలుసు. అదే వారికి ఇష్ఠం కూడా. మరి ఏ రాజకీయాలకు ఎల్వీ సుబ్రమణ్యం బలి అయ్యారా అని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

వారం తిరగకముందే….

ఇక ఎల్వీ సుబ్రమణ్యం ఈ మధ్యనే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ పుట్టిన రోజు వేడుకలకు వచ్చారు. రోజంతా ఆయన పీఠంలోనే ఉన్నారు. ఆయన్ని స్వామీజీ కూడా ఆశీర్వదించారు. మరి పీఠం నుంచి అలా అమరావతి వెళ్ళగానే ఎల్వీ సుబ్రమణ్యం పీఠం కదిలిపోయింది. ఇది కూడా అనూహ్య పరిణామమేనని చెబుతున్నారు. శారదా పీఠానికి వచ్చిన వారికి పదవులు దక్కడమే ఇంతవరకూ అంతా చూశారు. ఇపుడు పీఠం కదిలిపోయిన తొలి వ్యక్తిగా ఎల్వీ సుబ్రమణ్యం మిగిలారు. ఆయనకు స్వామీజీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా స్వామీజీ కూడా జగన్ కి మంచి సన్నిహితులు అన్నది కూడా తెలిసిన విషయమే. తాను సీఎం అయ్యాక జగన్ శారదాపీఠానికే వచ్చారు. అదే విధంగా పుట్టిన రోజున కూడా ఫోన్ ద్వారా శుభాభివందనాలు తెలిపారు. ఇక ఎల్వీ సుబ్రమణ్యం ఎపిసోడ్ లో వినిపిస్తున్న విషయం అన్య మత ప్రచారం దేవాలయాల్లో జరుగుతూంటే అడ్డుకునేలా చూశారని చెబుతున్నారు. అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్ అయినా దళిత కులంతో గెలిచారు అని. దీని మీద రాష్ట్రపతి కార్యాలయం కోరిన వివరాలు ప్రకారం ఆమె క్రిస్టియన్ అని ఎల్వీ సుబ్రమణ్యం రాసేందుకు సిధ్ధపడ్డారని, అలా చేయవద్దు అన్న వత్తిళ్ళు పట్టించుకోనందువల్లనే బదిలీ చేశారని అంటున్నారు.

హిందూ ధర్మ పరిరక్షణనేనా…?

ఈ ప్రచారమే నిజం అయితే పెందుర్తి స్వామీజీ ఎల్వీ సుబ్రమణ్యంకి అండగా నిలబడాలని ధార్మిక సంఘాలు కోరుతున్నాయి. జగన్ వద్ద తన పలుకుబడి ఉపయోగించి అయినా ఈ విషయంలో ఎల్వీ సుబ్రమణ్యంకి న్యాయం చేయాలని కూడా విన్నవించుకుంటున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం పై వేటుతో ఏపీలోని బ్రాహ్మణ సమాజం మొత్తం కలత చెందినదన్నది నిజం అంటున్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులకు విలువ లేదని పోరాటాలు చేసిన వారు, మేధావులు, మాజీ ఐఏఎస్ లు కూడా జగన్ న్యాయం చేస్తారనే భావించారు. జగన్ ఎల్వీ సుబ్రమణ్యంని కొనసాగించినపుడు అంతా హర్షం వ్యక్తం చేశారు కూడా.

స్వామీజీ వద్దకు వచ్చి…..

ఇపుడు అదే జగన్ వేటు వేయడాన్ని మాత్రం ఎవరూ సహించలేకపోతున్నారు. టీడీపీకి, వైసీపీకి తేడా ఏంటన్న ప్రశ్న కూడా వస్తోందిపుడు. ఇక హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎందాకైనా వెళ్తానని స్వామీజీ ఎపుడూ అంటారు. ఆయన అప్పట్లో చంద్రబాబు క్రష్ణా పుష్కరాల సందర్భంగా గుడులూ గోపురాలు కూల్చేసినపుడు ఆందోళన‌లు చేపట్టారు, ఇపుడు హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో కనుక ఎల్వీ సుబ్రమణ్యం గట్టిగా పనిచేస్తూ వేటుకు బలి అయినట్లైతే స్వామీజీ వంటి వారు కూడా అండగా ఉండాలని అంటున్నారు. శారదాపీఠానికి వచ్చిన వారికి పదవులు దక్కాలి తప్ప పోకూడద‌న్న సెంటిమెంట్ ని కొనసాగించేందుకైనా స్వామీజీ జగన్ తో మంతనాలు జరిపేందుకు సిధ్ధపడతారా అన్న చర్చ ఇపుడు సాగుతోంది.

Tags:    

Similar News