ఆ టీడీపీ సీనియ‌ర్ నిర్ణయం బాబుకు ఇక వేద‌నేనా ?

తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఎంత దీన‌స్థితిలో ఉందో ప్రత్యేకంగా చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. పార్టీ పుట్టిన‌ప్పటి నుంచే ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి వాళ్లే పార్టీకి భ‌విష్యత్తు [more]

Update: 2021-02-07 12:30 GMT

తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఎంత దీన‌స్థితిలో ఉందో ప్రత్యేకంగా చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. పార్టీ పుట్టిన‌ప్పటి నుంచే ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి వాళ్లే పార్టీకి భ‌విష్యత్తు ఉంద‌న్న న‌మ్మకం లేక బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. ఇలాంటి టైంలో పార్టీకి నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వ‌ర‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న సీనియ‌ర్ నేత‌.. ప్రముఖ సినీన‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్ తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని తిరిగి సినిమా రంగంలో యాక్టివ్ అవ్వాల‌నుకుంటున్నాన‌ని చెప్పడం పార్టీ శ్రేణులే కాదు… అటు చంద్రబాబు సైతం జీర్ణించుకోలేని ప‌రిస్థితి. ఆ మాట‌కు వ‌స్తే ముర‌ళీమోహ‌న్ పార్టీకి గ‌త ప‌దిహేనేళ్లుగా ఆర్థికంగా స‌పోర్ట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌రిధిలో ఉన్న రాజ‌మ‌హేంద్రవ‌రం లోక్‌స‌భ సీటు ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల‌కు ఆర్థికంగా స‌పోర్ట్ చేయ‌డంతో పాటు ఈ పార్లమెంటు ఖ‌ర్చంతా భ‌రిస్తున్నారు.

ఎంపీ అయ్యాక….?

2004 ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక 2005లో ఆయ‌న రాజ‌మండ్రిలో అడుగు పెట్టారు. అప్పటి నుంచే ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసుకుంటూ వ‌చ్చి 2009 ఎన్నిక‌ల్లో ముర‌ళీమోహ‌న్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వల్ప తేడాతో ఓడినా ఆ త‌ర్వాత మ‌రింత క‌సితో ఆయ‌న రాజ‌మండ్రి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పార్టీ కోసం ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఆర్థికంగా ఖ‌ర్చు చేయ‌డంతో పాటు ఈ పార్లమెంటు ప‌రిధిలో ఎమ్మెల్యే అభ్యర్థుల‌కు అటు పార్టీ అధిష్టానానికి కూడా భారీగా సాయం చేశారు. 1.67 ల‌క్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన ముర‌ళీమోహ‌న్ ఎంపీ అయ్యాక యాక్టివ్ కాలేక‌పోయారు. వ‌య‌స్సు పై బ‌డ‌డంతో చివ‌రి మూడేళ్లు అస‌లు ప్ర‌జ‌ల్లోకి రాలేదు.

నాడు రాజ్యస‌భ ఆఫ‌ర్‌.. అయినా ప‌ట్టుబ‌ట్టి లోక్‌స‌భ‌కు…

ముర‌ళీ మోహ‌న్ పార్టీకి చేసిన సాయానికి ఆయ‌న‌కు గ‌తంలోనే ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత చంద్రబాబు రాజ్యస‌భ సీటు ఆఫ‌ర్ చేశారు. అయినా తాను ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో గెలిస్తేనే మ‌జా ఉంటుంద‌ని ప‌ట్టుబ‌ట్టి ద‌శాబ్దన్నర కాలంగా రాజ‌మ‌హేంద్రవ‌రం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌తో మ‌మేకం అయ్యారు. 2014లో ఎంపీ అయ్యాక ఆయ‌న అంచ‌నాలు అందుకోలేదు.. ఇంకా చెప్పాలంటే పార్టీ ప్రతిప‌క్షంలో ఉండగా ఎంతో ఫైట్ చేసిన ఆయ‌న‌.. ఎంపీ అయ్యాక స్లో అయిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకుని పార్టీ కార్యాల‌యంలో యాక్టివ్‌గా ఉన్న త‌న కోడలు మాగంటి రూపాదేవిని బ‌రిలోకి దింపారు. ఆమె మార్గాని భర‌త్ రామ్ చేతిలో 1.20 ల‌క్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కుటుంబ సభ్యుల ఒత్తిడితో…..

ఎన్నిక‌ల్లో ఓడినా రూపాదేవికి రాజ‌కీయాల్లో రాణించాల‌న్న కోరిక ఉన్నా కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ రాజ‌కీయాలు మ‌న‌కు సూట్ కావు… తెలంగాణ‌లో వ్యాపారాలు… ఏపీలో రాజ‌కీయాలు క‌రెక్ట్ కాద‌ని కుటుంబ స‌భ్యుల ఒత్తిళ్లతో టోట‌ల్‌గా ముర‌ళీమోహ‌న్ ఫ్యామిలీయే రాజ‌కీయాల‌కు దూరం కావాల‌న్న నిర్ణయం తీసుకుంది. అందుకే తాజాగా మురళీమోహ‌న్ త‌మ కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటుంద‌ని.. తాను తిరిగి సినిమా రంగంలో యాక్టివ్ కావాల‌న్న నిర్ణయం చంద్రబాబుకు కాస్త బాధ‌గానే ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. గ‌తంలో చాలా మంది నేత‌లు పార్టీకి ఆర్థికంగా సాయం చేసినా రాజ్యస‌భ సీటు ప‌దే ప‌దే రెన్యువ‌ల్ చేసుకున్నారు. ముర‌ళీ మోహ‌న్ మాత్రం లోక్‌స‌భ‌కే పోటీ చేశారు. పార్టీలో ఎప్పుడూ కాంట్రవ‌ర్సీ కాని నేత ఇప్పుడు రాజ‌కీయాల‌కు దూరం కావ‌డంతో పాటు ఫ్యామిలీని కూడా దూరం చేయ‌డం బాబుకే కాదు.. టీడీపీకి కూడా పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.

Tags:    

Similar News