ఆయనకు చేతకావడం లేదా?

నిజానికి రాజకీయాల్లో పెద్దగా శిక్షణ అవసరం లేదు. అందులో పడితే అదే అలవాటు అవుతుంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మాత్రం రాజకీయం ఏమాత్రం ఒంటబట్టడం [more]

Update: 2020-09-16 17:30 GMT

నిజానికి రాజకీయాల్లో పెద్దగా శిక్షణ అవసరం లేదు. అందులో పడితే అదే అలవాటు అవుతుంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మాత్రం రాజకీయం ఏమాత్రం ఒంటబట్టడం లేదు. ఆయన చర్యలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెడుతున్నాయి. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో సంకీర్ణ సర్కార్ అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇందుకు పాలనాపరమైన అనుభవం లేకపోవడమే కారణమన్న వ్యాఖ్యలు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల నుంచే విన్పిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకూ….

ఉద్ధవ్ థాక్రే మొన్నటి వరకూ శివసేన అధినేత. తన తండ్రి బాల్ థాక్రే నుంచి వారసత్వంగా శివసేన పగ్గాలు అందుకున్నారు. శివసేన సంగతి అందరికీ తెలిసిందే. ఏ సమస్యపైనైనా దూకుడుతో వెళుతుంది. ప్రధానంగా ప్రాంతీయ వాదాన్ని ప్రజల్లోకి బలంగా చొప్పించడంలో శివసేన ముందుంటుంది. మతపరంగా, ప్రాంతీయ పరమైన వివాదాల్లో శివసేన ముందుంటుంది. అదే శివసేనకు రాజకీయంగా ప్లస్ మైనస్ అని చెప్పుకోవాలి.

ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి….

థాక్రే కుటుంబం మొన్నటి వరకూ ప్రత్యక్ష్య రాజకీయాల్లో పాల్గొన లేదు. బాల్ థాక్రే నుంచి ఉద్ధవ్ థాక్రే వరకూ శివసేనకు నాయకత్వం వహించారు తప్పించి ఎన్నడూ పోటీ చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్యథాక్రే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి థాక్రే కుటుంబం ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రజలతో సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయాల జోలికి రాలేదు. తాము బ్యాక్ ఉండి పార్టీని నడిపిస్తుండటమే వారికి తెలిసింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ థాక్రే బీజేపీ తో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

వివాదాస్పదమైన నిర్ణయాలతో…..

అయితే పాలనాపరమైన అనుభవం లేకపోవడతో ఆయన దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు భాగస్వామి పార్టీల నుంచే విన్పిస్తున్నాయి. గతంలో లాక్ డౌన్ పొడిగింపు, నిబంధనల సడలింపులోనూ భాగస్వామ్య పార్టీలు తప్పుపట్టాయి. తాజాగా కంగనా రనౌత్ విషయంలోనూ శివసేన దూకుడు నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే విఫలమయ్యారన్న విమర్శలు సంకీర్ణ ప్రభుత్వం నుంచే విన్పిస్తుండటం విశేషం. ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News