ఇప్పట్లో ఆగదు.. మనమూ తాళం తీయొద్దు

మహారాష్ట్రను కరోనా వైరస్ వదిలేట్లు లేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు నమోదు చేసింది. మహారాష్ట్ర నుంచి ఎవరైనా వస్తున్నారన్నా ఇతర రాష్ట్రాలకు [more]

Update: 2020-05-20 17:30 GMT

మహారాష్ట్రను కరోనా వైరస్ వదిలేట్లు లేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు నమోదు చేసింది. మహారాష్ట్ర నుంచి ఎవరైనా వస్తున్నారన్నా ఇతర రాష్ట్రాలకు గుండెదడ ప్రారంభమయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఏపీలకు వచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో మహారాష్ట్ర అంటేనే దేశ వ్యాప్తంగా దడ ప్రారంభమయింది. దేశంలో నమోదవుతున్న మూడో వంతుల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.

మే 31 వ తేదీ వరకూ…

దీంతో మే 31వ తేదీ వరకూ మహారాష్ట్రలో లాక్ డౌన్ ను పొడిగిచాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ మినహాయింపులను కూడా అమలు పర్చకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సీనియర్ మంత్రులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ను ఎత్తివేసినా, ఎక్కువ మినహాయింపులు ఇచ్చిన మహారాష్ట్రలో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదముందని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు.

అత్యధిక కేసులు….

ఇప్పటికే మహారాష్ట్రలో 26 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ముంబయి, పూనే, ఔరంగాబాద్, మాలేగావ్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. పోలీసులు కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. ముంబయి ధారవి మురికివాడ అందరూ ఊహించనట్లుగానే కరోనాతో హడలెత్తి పోతోంది.

లాక్ డౌన్ నిబంధనలను….

దీంతో మే 31వతేదీ వరకూ మహారాష్ట్రలో లాక్ డౌన్ ను కొనసాగించాలని ఉద్దవ్ థాక్రే నిర్ణయించారు. ప్రధానంగా హాట్ స్పాట్ లు, కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రం స్ట్రిక్ట్ గా నిబంధనలను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ప్రజా రవాణాకు మాత్రం మహారాష్ట్రలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశంలేదు. కరోనా లేని ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వనున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను భయపెడుతోంది.

Tags:    

Similar News