సీబీఐ పప్పులు ఇక ఉడకవట

కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో సీబీఐని ప్రయోగించడం దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు సీబీఐని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందని [more]

Update: 2020-10-31 18:29 GMT

కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో సీబీఐని ప్రయోగించడం దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు సీబీఐని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందని గత కాంగ్రెస్ హయాం నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. బీజేపీ కూడా అందుకు మినహాయింప కాదు. అందుకే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు సీబీఐని తమ రాష్ట్రాల్లో రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

గతంలో కొన్ని రాష్ట్రాలు….

గతంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీబీఐకి నో ఎంట్రీ చెప్పేశారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని తొలగించారు. పశ్చిమ బెంగాల్ లో కూడా మమత బెనర్జీ సీబీఐకి తమ రాష్ట్రంలో నో ఎంట్రీ అని చెప్పేశారు. సీబీఐని రాజకీయ కక్షలకు ఉపయోగిస్తున్నారని మమత బెనర్జీ ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇందులోకి మహారాష్ట్ర ప్రభుత్వం చేరింది.

సుశాంత్ ఆత్మహత్య కేసు తర్వాత…..

ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకేసులో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ సీబీఐ రంగంలోకి దిగింది. దీనిపై రాజకీయంగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు సీబీఐ రాకను వ్యతిరేకించాయి. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో సీబీఐ విచారణ చేపట్టింది. ఇంతటితో సీబీఐ అస్త్రాలను బీజేపీ ప్రభుత్వం ఆపపోదని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి నో ఎంట్రీ చెప్పేసింది.

కూటమిలోని పార్టీల వత్తిడితోనే……

ఇకపై ఏదైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ తనంతట తానుగా దర్యాప్తు చేయలేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వత్తిడితోనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హక్కులను దుర్వినియోగం చేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివసేన చెబుతోంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగకుండా సీబీఐని మహారాష్ట్ర ప్రభుత్వం నిలువరించింది.

Tags:    

Similar News