“మహా”లో మరో పవన్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరికీ ఆనందం కల్గించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీ సయితం 105 స్థానాలతో సరిపెట్టుకుని ఇతరుల కోసం చూడాల్సిన పరిస్థితి. [more]

Update: 2019-11-01 18:29 GMT

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరికీ ఆనందం కల్గించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీ సయితం 105 స్థానాలతో సరిపెట్టుకుని ఇతరుల కోసం చూడాల్సిన పరిస్థితి. ఇక శివసేన అనుకున్న స్థానాల్లో విజయం సాధించినా దానికీ ఈ ఫలితాలు సంతృప్తికరంగా లేవు. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లు రావడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఎటూ శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలోనే కొంత హ్యాపీనెస్ కన్పిస్తుంది. ఇక మహారాష్ట్ర నవనిర్మాణ సేన మాత్రం ఏపీలో పవన్ కల్యాణ్ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా తయారయింది.

పేర్లలోనే కాదు….

ఇది జనసేన… అది మహారాష్ట్ర నవనిర్మాణ సేన. రెండింటికీ పేర్లలోనే కాదు. ఫలితాల్లోనూ పోలికలు కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ‌్ కు చెందిన జనసేన పార్టీ ఏపీలో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఇప్పుడు తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో సయితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా కేవలం ఒకే ఒక స్థానంలో గెలవడం విశేషం. ఈ పార్టీ అధినేత రాజ్ ఠాక్రే కూడా పవన్ కల్యాణ్ మాదిరిగానే మంచి ఇమేజ్ ఉంది. అయితే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం, చతికల పడటం మహా సేన కు మామూలు అయిపోయింది.

ఒంటరిగా పోటీ చేసి…..

శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే మహరాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో జరిగిన 2009 ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకున్న రాజ్ ఠాక్రే తర్వాత డీలా పడిపోయారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుండటం రాజ్ ఠాక్రేకు కలసి రావడం లేదంటున్నారు. శివసేన బీజేపీతో కలసి ఉండగా, రాజ్ ఠాక్రే ఇతర పార్టీలతో కలసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడమే దారుణ ఓటములకు కారణమంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఒక్క స్థానానికే రాజ్ ఠాక్రే పార్టీ పరిమితమయింది.

ఒక్క స్థానంతోనే…..

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన 110 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఈ 110 నియోజకవర్గాల్లో రాజ్ ఠాక్రే ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను కోరారు. సెంటిమెంట్ ను రంగరించారు. అయినా ప్రజలు రాజ్ ఠాక్రేను ఆదరించలేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ జనాకర్ష నాయకుడిగా ముద్రపడిన రాజ్ ఠాక్రే పార్టీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏపీలో జనసేనను మించిపోయేలా మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఉందన్న సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News