కూటమి ఎప్పటికీ ప్రమాదమేనా …?

మరాఠా రాజకీయాలు గమనించినా, మొన్నటి కర్ణాటక రాజకీయాలు తరచి చూసినా, ఏపిలో గత చరిత్రలు తిరగేసినా జాతీయ స్థాయి రాజకీయాల్లో సంకీర్ణ భాగోతాలు తెరిచి చూసినా కూటములు [more]

Update: 2019-11-27 15:30 GMT

మరాఠా రాజకీయాలు గమనించినా, మొన్నటి కర్ణాటక రాజకీయాలు తరచి చూసినా, ఏపిలో గత చరిత్రలు తిరగేసినా జాతీయ స్థాయి రాజకీయాల్లో సంకీర్ణ భాగోతాలు తెరిచి చూసినా కూటములు ఎప్పుడు కొంప ముంచుతాయన్నది చాటి చెబుతుంది. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత నడిచే పొత్తుల రాజకీయం అధికారం అందుకునేందుకు తప్ప విలువలను పాటించే విధంగా ఏమాత్రం సాగడం లేదు. అందువల్లే భాగస్వాములు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి విజయం సాధించాకా తమ ఆలోచనలు మార్చుకుంటున్నాయి. మిత్రుడుగా వున్న పార్టీ బద్ధశత్రువుగా మారిపోవడానికి ఆ పార్టీ బలపడుతుందన్న ఆందోళనే రాజకీయ బంధాన్ని తెంపేస్తుంది. కర్ణాటకలో కుమార స్వామి సర్కార్ కుప్పకూలడానికి బిజెపి కన్నా భాగస్వామి కాంగ్రెస్ నే ప్రధాన కారణం. అదే విధంగా మహారాష్ట్రలో బిజెపి, శివసేన కలిసి పోటీ చేసి విడిపోవడానికి సేన ముఖ్యమంత్రి పీఠం పై కన్నేయడమే రీజన్.

విపక్షానికి సిద్ధం కావడం లేదు …

ఒక పార్టీకి అధికారం మరో పార్టీకి విపక్ష బాధ్యతలను ప్రజలు ఎన్నికల్లో అప్పగిస్తారు. అధికారపక్షం సక్రమంగా తమ పని నిర్వర్తిస్తే ప్రజలు తిరిగి ఆశీర్వదిస్తారు. లేదు విపక్షం తమ పాత్ర సమర్ధంగా పోషించడం అదే సమయంలో అధికారంలో ఉన్నవారు బాధ్యతలను విస్మరించడం చేస్తే ప్రతిపక్షాన్ని అందలం ఎక్కిస్తారు. ఇది అందరికి తెలిసిందే. గతంలో రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు పూర్తి మార్పు ఇప్పుడు కనిపిస్తుంది. విపక్షంలో ఉండేందుకు ఏ పార్టీ ఇష్టపడటం లేదు. అధికారం కోల్పోయిన వెంటనే అప్పటివరకు ప్రత్యర్థిగా ఉన్నవారితో సైతం చేతులు కలిపేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. దాంతో విపక్షంలో వుండాలిసిన వారు అధికార పక్షంలో అక్కడ వుండాలిసిన వారు ప్రతిపక్షంలో కూర్చొవాలిసి వస్తుంది. దాంతో ఓట్లేసిన ప్రజలు ఒకటి తలిస్తే మరొక సిత్రం పొలిటికల్ తెరపై ఆవిష్కృతం అవుతుంది.

మహారాష్ట్ర రాజకీయాలను చూస్తే….

మహారాష్ట్ర తాజా రాజకీయాలు దేశ వాసులకు చెబుతున్నది ఒక్కటే. ఏ పార్టీని గెలిపించినా పూర్తి మెజారిటీతో విజయం ఇవ్వాలని లేకపోతే జనం కోరుకొని కలగూర గంప ప్రభుత్వం ఏలుబడిలో చిక్కుల్లో చిక్కుకోక తప్పదన్నది తేల్చి చెబుతుంది. అధికారపక్షం తో సమానంగా విపక్షాన్ని బలపరచడం వల్ల ప్రజలకు ఒరిగేదీమీ లేకపోగా స్వార్ధ రాజకీయాలు సాగేందుకు బాటలు వేసిన వారు గా మిగిలిపోయి ఆ శిక్షను జనమే అనుభవిస్తారని చరిత్ర చెప్పేస్తుంది. సంకీర్ణ రాజకీయ యుగం గతంలో చూసిన దేశ ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. కేంద్రంలో మోడీ సర్కార్ ను, యుపి లో బిజెపికి అలాగే ఏపిలో వైసిపి కి అఖండ మెజారిటీ అందించడానికి లాలూచీ రాజకీయాలకు ఛీ కొట్టడమే అని భావించాలి. ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇదే ధోరణి మొదలైనా మధ్యప్రదేశ్, కర్ణాటక, తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భిన్నంగా స్పందించి ప్రజలు తిరిగి సంకీర్ణ యుగానికే తెరతీస్తున్నారా అనిపించే తీర్పే కనిపిస్తుంది

Tags:    

Similar News