వీరి డౌట్స్ ఇవేనట

అమరావతి లోనే మొత్తం రాజధాని ఉండాలన్నది టిడిపి , జనసేన ప్రధాన డిమాండు. అదే అక్కడి రైతులు కోరుకుంటున్నది. దీనికోసం రోడ్డెక్కిన వారందరిపై ప్రధాన పార్టీలకు సందేహం [more]

Update: 2020-01-02 05:00 GMT

అమరావతి లోనే మొత్తం రాజధాని ఉండాలన్నది టిడిపి , జనసేన ప్రధాన డిమాండు. అదే అక్కడి రైతులు కోరుకుంటున్నది. దీనికోసం రోడ్డెక్కిన వారందరిపై ప్రధాన పార్టీలకు సందేహం వెంటాడుతుందా ? వారు ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు లొంగిపోయి ఉద్యమం మధ్యలో విడిచిపెడితే తమ పరిస్థితి ఏమిటన్నది టిడిపి, జనసేన పార్టీలను వెన్నాడుతుందా? అవుననే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. వారికోసం తాము రోడ్డెక్కి చొక్కా చించుకున్నాక పోరాటంలో వుండాలిసిన వారు నిష్క్రమిస్తే రాజకీయంగా ఈ రెండు ప్రధాన పార్టీలకు తీరని నష్టం తప్పదు. ఆ అనుమానమే ఉండటమే ఇద్దరు నేతల వ్యాఖ్యల వెనుక అంతరార్ధం గా కనిపిస్తుంది.

మీరు తప్పుకుంటే …

రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత ప్రతి చోటా ఒక మాట పదేపదే చెప్పారు. మీరు ఉద్యమిస్తున్నంత కాలం మీ వెనుక నేను ఉండి సహకరిస్తా, అదే మీరు తప్పుకుంటే నేనేమీ చేయలేను. ఇవే వ్యాఖ్యలను చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి లోని రైతులకు అన్యాయం జరగకుండా జగన్ సర్కార్ చూడాలన్నది అన్ని వర్గాలనుంచి వస్తున్న డిమాండ్. మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడంలేదు అయితే క్యాపిటల్ కోసం భూములు ఇచ్చిన వారు రోడ్డున పడకుండా చూడాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు తక్కువే అని చెప్పొచ్చు. అందుకే త్రి క్యాపిటల్స్ పై తక్షణం నిర్ణయం తీసుకోకుండా సర్కార్ వెనక్కి తగ్గి కూలంకుషంగా అన్ని అంశాలు పరిగణలోనికి తీసుకుని ముందుకు వెళుతుంది. రైతుల లబ్ధికి అన్ని చర్యలు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంది.

రైతులకోసం సర్కార్ ….

ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేయడం, వ్యవసాయ జోన్ గా అభివృద్ధి పరచడం, భూములు వెనక్కి ఇవ్వాలని కోరేవారికి ఇచ్చి ప్లాట్ లు అభివృద్ధి పరిచి ఇవ్వాలన్న వారికి ఆ విధంగా చేసి ఇవ్వాలన్న పలు ప్రతిపాదనలు సర్కార్ ముందుకు నిపుణులు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ కోణాల్లో ఈ అంశాలన్నీ చర్చించే అమరావతి లో రైతుల ఆగ్రహాన్ని పూర్తిగా చల్లార్చే ప్రణాళికను జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారపార్టీ నుంచి సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు అంగీకరించి ఉద్యమానికి స్వస్తి చెబితే తమ గతేమి కాను అన్నదే ఉద్యమానికి నాయకత్వం వహించాలనుకుంటున్న పార్టీలకు వచ్చిన డౌట్.

ఆర్టీసీ ఉద్యమం లాగానే….

తెలంగాణ లో ఇదే తీరులో ఆర్టీసీ ఉద్యమానికి కెసిఆర్ చెక్ పెట్టి విపక్షాలకు ఝలక్ ఇచ్చారు. అలాగే జగన్ తన వ్యూహం అమలు చేస్తే నష్టపోతామని విపక్షాల్లో చర్చ నడుస్తుంది. అదే జరిగితే రాజధాని ఉద్యమం తో వైసిపి పై ప్రజల్లో వ్యతిరేక ధోరణి ప్రబలిందని విపక్షాలు చేసే ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. అలాంటి స్థితి రాకుండా ముందే వారిని సంఘటిత పరిచి ఐక్య పోరాటం కొనసాగేలా చేయడం విపక్షాలకు కత్తిమీద సామే అని నిపుణులు చెబుతున్నారు. వచ్చే రోజుల్లో రాజధాని రాజకీయం మరింత రసవత్తరంగా మారనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న అంశం ఆసక్తికరం గా వుంది.

Tags:    

Similar News