పట్టువదలని విక్రమార్కుడే

భట్టి విక్రమార్క కొంత దూకుడు పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం భట్టి తప్ప పెద్దగా ఎవరూ యాక్టివ్ గా లేరు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క [more]

Update: 2020-09-29 09:30 GMT

భట్టి విక్రమార్క కొంత దూకుడు పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం భట్టి తప్ప పెద్దగా ఎవరూ యాక్టివ్ గా లేరు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిలదీయడంతో పాటు ప్రత్యక్ష్యంగా ప్రజల వద్దకు వెళుతుండటం భట్టి విక్రమార్క ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు ఇప్పుడు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్పించి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇకపార్లమెంటు సమావేశాలు ఉంటే ఇక్కడ ఉండరు.

నేతలకు కొదవ లేకున్నా…..

నిజానికి కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొరత లేదు. సీనియర్ నేతలు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. జానారెడ్డి, దమోదర రాజనరసింహ, గీతారెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి తదితర నేతలు ఉన్నా వారు సైలెంట్ గానే ఉంటున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీలో ఎవరూ కలసి రావడం లేదు. ఆయన కాళ్లకు సొంత పార్టీ నేతలే అడ్డం పెడుతున్నారు. ఒక్క భట్టి విక్రమార్క విషయంలో పార్టీ నేతలందరూ కలసి వస్తుండటం విశేషం.

అంతా తానే అయి….

దీంతో భట్టి విక్రమార్క పార్టీని అంతా తానే అయినడిపిస్తున్నాడు. అసెంబ్లీ సమావేశాలకు ముందు భట్టి విక్రమార్క తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాకు అందుతున్న వైద్యం, సేవలను ప్రత్యక్ష్యంగా జిల్లాలు తిరిగి చూశారు. పర్యటన తర్వాత దీనిపై ఒక ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యపై మాట్లాడటానికి ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క భావించారు.

హైదరాబాద్ లో ఇళ్లు…..

ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వానికి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. లక్ష ఇళ్లు ఎక్కడో చూపాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి తలసాని రెండు రోజుల పాటు భట్టిని తీసుకెళ్లి చూపించారు. అయితే నగరంలో కట్టామని చెప్పి జిల్లాల్లో కట్టినవి చూపుతున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో లక్ష ఇళ్లు కాదు కదా యాభై వేల ఇళ్లు కూడా కట్టలేదని చెప్పి ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క ఇరకాటంలో పడేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారనే అనుకోవాలి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్క లీడ్ రోల్ పోషిస్తున్నారు.

Tags:    

Similar News