అత్తను ముంచుతున్నది మేనల్లుడేనా?
ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు కుటుంబ ప్రాతిపదికన ఏర్పాటైనవే. ఇంకా మరింత స్పష్టంగా, పచ్చిగా చెప్పాలంటే వాటికి ప్రాతిపదిక కులం. పైకి రాష్ర్ట ప్రయోజనాలే లక్ష్యమని గొప్పగా చెప్సుకున్నప్పటికీ [more]
ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు కుటుంబ ప్రాతిపదికన ఏర్పాటైనవే. ఇంకా మరింత స్పష్టంగా, పచ్చిగా చెప్పాలంటే వాటికి ప్రాతిపదిక కులం. పైకి రాష్ర్ట ప్రయోజనాలే లక్ష్యమని గొప్పగా చెప్సుకున్నప్పటికీ [more]
ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు కుటుంబ ప్రాతిపదికన ఏర్పాటైనవే. ఇంకా మరింత స్పష్టంగా, పచ్చిగా చెప్పాలంటే వాటికి ప్రాతిపదిక కులం. పైకి రాష్ర్ట ప్రయోజనాలే లక్ష్యమని గొప్పగా చెప్సుకున్నప్పటికీ అసలు విషయం మాత్రం ఇదే. పంజాబ్ లోని అకాలీదళ్ కావచ్చు, కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్సు కావచ్చు, మహారాష్ర్టలో శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని తెరాస, ఏపీలోని వైసీపీ, తెలుగుదేశం, కర్ణాటకలోని జనతాదళ్ (ఎస్), బీహార్ లోని ఆర్ జే డీ, బెంగాల్లోని టీఎంసీ… ఇలా రాష్ర్టమేదైనా, పార్టీ ఏదైనా అన్ని పార్టీల అసలు సిద్దాంతమిదే. వాటిల్లో పెత్తనమంతా కుటుంబాలదే. పైకి ఇతర వర్గాలను కీలక పదవుల్లో నియమించినప్పటికీ అసలు అధికారమంతా కుటుంబ నాయకత్వానిదే. అధినేత పరమపదిస్తే అతని భార్య, కుమారుడు, కూతురు, అల్లుడు, కోడలు లేదా ఇతర సమీప బంధువులే పగ్గాలు చేపడతారు. వారు కాదన్నా పార్టీ శ్రేణుల నుంచే అలాంటి డిమాండ్ తెరపైకి వస్తుంది. జాతీయ పార్టీఅయిన కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటైన భాజపా, వామపక్షాలు ఇందుకు అతీతం.
ఇతర పార్టీలకు భిన్నంగా…..
కుటుంబ నాయకత్వం వల్ల పార్టీకి ఎంత మేలో, అంతే కీడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ వాదిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ ఆ పార్టీ సీపీఎం కు బి-టీమ్ గా మారిందంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. సీపీఎంపై ఒంటరి పోరాటం జరిపి 2011లో అధికారాన్ని అందుకున్నారు. 2016లో మరింత మెజార్టీతో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మమతా బెనర్జీ అవివాహితురాలు. ఆమెకు కుటుంబ బాదరబందీలు ఏమీ లేవు. దీంతో టీఎంసీ ఇతర ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆచరణలో అది అవాస్తవమని నిరూపితమైంది.
అనధికార వారసుడిగా….
మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తెరపైకి తీసుకువచ్చారు. అనధికారికంగా తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ప్రస్తుతం అభిషేక్ గురించి పార్టీలో చర్చ నడుస్తోంది. అభిషేక్ పేరుకే టీఎంసీ యువజన విభాగం అధిపతి అయినప్పటికీ ఆయన కనుసన్నల్లోనే యావత్ పార్టీ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. పార్టీయే కాదు, ప్రభుత్వం సైతం ఆయన పర్యవేక్షణలోనే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ఎన్నిక అయినా టిక్కెట్ల పంపిణీ నుంచి, నామినేటెడ్ పోస్టుల నియామకాల వరకూ అభిషేక్ మాటే అంతిమంగా చెల్లుబాటు అవుతుంది. దీంతో పార్టీలోని సీనియర్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేవలం సీనియర్లే కాదు, పార్టీ వ్యవస్థాపన నుంచి మమతా బెనర్జీతో నడిచిన వారు సైతం ప్రస్తుతపరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. చేసేదేమీ లేక అనేక మంది సీనియర్లు పార్టీ నుంచి బయటకు పోతున్నారు.
అభిషేక్ లక్ష్యంగానే….
తాజాగా సువేందు అధికారి భాజాపా లో చేరారు. అధికారి పార్టీలో మమతా బెనర్జీ తరవాత స్థానంలో ఉన్నారు. మిడ్నపూర్, పురులియా, బంకూర తదితర జిల్లాల్లో దాదాపు 50 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఆయనకుంది. ముకుల్ రాయ్ 2017 లోనే పార్టీని వీడారు. ఆయన ఇప్పుడు భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు. 33 సంవత్సరాల అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ ఎంపీ. 2014, 2019ల్లో ఆయన ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. మొదటిసారి 71వేలు, రెండోసారి 3.20 లక్షల భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. మమతా బెనర్జీ సోదరుడి కుమారుడైన అభిషేక్ దిల్లీలో ఎంబీఏ చదివారు. ఇప్పుడు అభిషేక్ లక్ష్యంగా బాజపా పావులు కదుపుతోంది. డిసెంబరు మొదటివారంలో బెంగాల్లో పర్యటించిన అధ్యక్షుడు జేపీ నడ్డా, మూడోవారంలో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా సైతం అభిషేక్ నియోజకవర్గం డైమండ్ హార్బర్ లోనే ర్యాలీలు, సభలు నిర్వహించారు. తన ఎదుగుదలను జీర్ణించుకోలేకే విపక్షాలు ముఖ్యంగా భాజపా ఎదురుదాడి చేస్తున్నాయని అభిషేక్ అంటున్నారు. బెంగాలీల భరోసా ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– ఎడిటోరియల్ డెస్క్