సమాఖ్య సంక్షోభం…
రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నానాటికీ ముదురుపాకాన పడుతోంది. భారతప్రజాస్వామ్య మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. రాజకీయ ఆధిక్యం కోసం సమాఖ్య స్ఫూర్తికి తూట్లుపొడిచేలా నాయకులు [more]
రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నానాటికీ ముదురుపాకాన పడుతోంది. భారతప్రజాస్వామ్య మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. రాజకీయ ఆధిక్యం కోసం సమాఖ్య స్ఫూర్తికి తూట్లుపొడిచేలా నాయకులు [more]
రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నానాటికీ ముదురుపాకాన పడుతోంది. భారతప్రజాస్వామ్య మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. రాజకీయ ఆధిక్యం కోసం సమాఖ్య స్ఫూర్తికి తూట్లుపొడిచేలా నాయకులు వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. పరిధులు మీరుతున్నారు. వ్యక్తిగత స్పర్థలు శ్రుతిమించి పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ప్రమాణాల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. దానిని పక్కనపెట్టి రచ్చబండగా మారిపోవడమే విషాదం. ఎన్నికల తరుణంలో ఈ రాజకీయ చిచ్చు మరింతగా ప్రజ్వరిల్లుతోంది. సహకార సమాఖ్య అంటూ ఎంత ఘనంగా చెప్పుకున్నప్పటికీ ఏక కేంద్రంగానే భారత్ విరాజిల్లుతోంది. అధికార పంపిణీలో కేంద్ర ప్రభుత్వానికే అగ్రభూమిక లభిస్తోంది. అంతిమ తీర్పూ కేంద్రానిదే. అందువల్ల ఎంతగా పేచీ పెట్టినా రాష్ట్రాలు సామంతపాత్రకే పరిమితమవుతున్నాయి. ప్రజాదరణ కలిగిన ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ విషయంలో తామంటే గిట్టని కేంద్రప్రభుత్వంతో నిత్యం ఘర్షణకు దిగుతున్నారు. కలకత్తాలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, రాష్ట్ర పోలీసులు ప్రొటోకాల్ ను మరిచి పరస్పరం అరెస్టులకు, ఘర్షణలకు దిగడం ఏమంత చిన్నవిషయం కాదు. సమాఖ్య సంక్షోభంగానే అభివర్ణించాలి.
మమత మంకుపట్టు…
తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమబంగలో తిరుగులేని ప్రజాదరణ ఉన్నమాట వాస్తవం. జాతీయ స్థాయిలోనే అంతటి పాప్యులారిటీ కలిగిన నాయకులను వేళ్లమీద లెక్కించవచ్చు. కాంగ్రెసు నుంచి విడివడి తన రాష్ట్రంలో కాంగ్రెసు ఉనికినే ప్రశ్నార్థకం చేసిన పోరాట యోధురాలు. కమ్యూనిస్టులను ఒంటిచేత్తో ఎదుర్కొని పోరాడి సొంతంగా ఎదిగారు. అటువంటి మమతకు ఎడతెగని అభిజాత్యం, అవసరానికి మించిన అహం సహజ లక్షణాలుగా వచ్చి చేరాయి. దాంతోనే అసలు సమస్య మొదలవుతోంది. తాను అధికారంలో ఉన్న పశ్చిమబంగ ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఆమె భావిస్తూ ఉంటారు. ఆమెతో పోరాటం చేయలేక కమ్యూనిస్టులు అలసిపోయారు. కాంగ్రెసు పార్టీ నేతలు అణిగిమణిగి ఆమె దయాదాక్షిణ్యాలు లభిస్తాయేమోనని ఎదురుచూసే స్థితికి వచ్చేశారు. రాష్ట్రంలో తిరుగులేదు కాబట్టి దేశంలో జాతీయ నాయకురాలిగా ఎదగాలని చాలాకాలంగా ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక బలమైన కేంద్రప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆమె ఆధిపత్య ధోరణికి సవాల్ ఎదురయ్యింది. అది క్రమేపీ ఘర్షణగా రూపుదాల్చింది. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు దాని పర్యవసానంగానే చూడాలి.
మోడీ, షా..మొండితనం..
పార్టీని విస్తరించడమే ఏకైక లక్ష్యంగా మెషీన్ పాలిటిక్స్ నడపటంలో ఆరితేరిపోయారు మోడీ, అమిత్ షాలు. తమ బాటలో ఎంతటి వారు ఎదురొచ్చినా నిర్దాక్షిణ్యంగా తొక్కిపారేయడమే వారికి తెలిసిన విద్య. భారతీయ సాంస్క్రుతిక మూలాలు బలంగా వేళ్లూనుకుని ఉన్న పశ్చిమబంగలో బీజేపీ నామమాత్రపు పార్టీగా ఉండటాన్ని వారు సహించలేకపోయారు. సాంస్క్రుతిక హిందూ జాతీయ వాదాన్ని ఇక్కడ పునరుజ్జీవింప చేయాలని సంకల్పించారు. మమత నడిపే మైనారిటీ పాలిటిక్స్ వారి ఆలోచనకు చక్కగా ఉపకరించాయి. దీనిని జీర్ణించుకోలేని మమత బెనర్జీ కేంద్రప్రభుత్వంతో కొంత అనవసర ఘర్షణకు దిగుతూ వచ్చారు. చిట్ ఫండ్ కుంభకోణాలు, ఆర్థిక అక్రమాల్లో త్రుణమూల్ నేతల ప్రమేయాన్ని పట్టుకుని పీటముడి బిగించేశారు మోడీ. అదే ఇప్పుడు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ఘర్షణగా మారింది. నిజానికి సార్వభౌమాధికారం కలిగిన కేంద్రప్రభుత్వానికి కొన్ని విశేషాధికారాలుంటాయి. భారత శిక్షా స్మ్రుతి, నేర స్మ్రుతి వంటివి దేశమంతటికీ ఒకేలా వర్తిస్తాయి. పశ్చిమబంగ ఇందుకు మినహాయింపు కాదు. ఈ విషయంలో చట్ట నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన మమత, మోడీ, షాలు తెగేవరకూ లాగుతున్నారు. తెరపడని సమస్యకు బీజం వేస్తున్నారు.
అగ్గి రాజేసేవారే అందరూ…
కొంపలంటుకుపోతుంటే చలికాచుకునే వారే రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అందులోనూ ఎన్నికల సమయం. ప్రస్తుతం పశ్చిమబంగలో కేంద్రం, రాష్ట్రం తలపడుతున్న ఘట్టాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. దీని నుంచి తమకు ఏరకమైన రాజకీయ ప్రయోజనం లభిస్తుందనే ఆలోచిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ మొదలు ప్రాంతీయపార్టీల అధినేతల వరకూ అందరిదీ అదే ధోరణి. బీజేపీ పొడగిట్టని వారంతా ఒక్కటై మమతకు అండగా నిలుద్దామంటూ నినదిస్తున్నారు. ఇందులో ఉచితానుచితాలు, తప్పొప్పుల ప్రసక్తి తలెత్తడం లేదు. మూకుమ్మడి మద్దతు ప్రకటిస్తున్నారు. మమతకు, మోడీ షాల కు మధ్య మరింతగా అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం వ్యక్తులకే పరిమితం కాబోవడం లేదు. వ్యవస్థ కుదేలైపోయే ప్రమాదం పొంచి చూస్తోంది. సుప్రీం కోర్టు వంటి న్యాయపీఠాలు జోక్యం చేసుకుని ఇటువంటి ఘట్టాలు పునరావ్రుతం కాకుండా గైడ్ లైన్స్ జారీ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. లేకపోతే ఈ దేశ రాజకీయ నాయకులు మన వ్యవస్థలను కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసేందుకూ వెనకాడరు.