దీదీ దిగిరాక తప్పదా?

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆలోచనలో [more]

Update: 2020-11-26 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకూ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్న మమత బెనర్జీ బీజేపీని నిలువరించాలంటే ఓట్లను చీలకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ లో బీజేపీ రోజురోజుకూ బలం పెంచుకుంటుడటం ఆందోళన కల్గిస్తుంది.

ఓటు బ్యాంకు చీలుతుందని…..

మరోవైపు ముస్లిం ఓటు బ్యాంకులో చీలకపై కూడా మమత బెనర్జీ ఆందోళనతో ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి అక్కడ ఆర్జేడీని దెబ్బతీసింది. బెంగాల్ లోనూ పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం మమత బెనర్జీలో చికాకు కల్గిస్తుంది. బెంగాల్ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఎంఐఎం అధినేత దృష్టి పెట్టారు. ఈసారి కనీసం యాభై స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.

బలంగా ఉన్న చోట….

ఇది మమత బెనర్జీకి ఇబ్బందికరంగా మారింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దక్షిణ 24 పరగాణా జిల్లా, మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్ పూర్, దక్షిణ దినాజ్ పూర్ లపై ఒవైసీ దృష్టి పెట్టారు. ఇక్కడ మొత్తం 60 స్థానాలు ఉండటంతో మమత బెనర్జీ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కొందరు ముస్లిం నేతలు ఒవైసీని సంప్రదించడం, ఆయన త్వరలో బెంగాల్ పర్యటనను పెట్టుకోవడంతో మమత బెనర్జీ ఒవైసీని ఎలా కట్టడి చేయాలన్న యోచనలోనే ఉన్నారు.

ఒవైసీ ప్రతిపాదనకు….

ఈ నేపథ్యలో ఒవైసీ ఒక ప్రతిపాదన తెచ్చారు. తాము మమత బెనర్జీతో కలసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒవైసీ ప్రకటించారు. ఇప్పుడు ఒవైసీ ప్రతిపాదనను అంగీకరించడం తప్ప మమతకు వేరే దారిలేదు. లేకుంటే ఎంఐఎం విడిగా పోటీ చేస్తే తనకు దీర్ఘకాలం నుంచి మద్దతు దారులుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకులో మమతకు కొంత కోత తప్పదు. అందుకే ఒవైసీ ప్రతిపాదనకు మమత దిగిరాక తప్పదంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News