మమత మూడోసారి?

మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మమత ఇందులో సక్సెస్ [more]

Update: 2020-12-06 17:30 GMT

మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మమత ఇందులో సక్సెస్ అయితే ఆమెకు హ్యాట్రిక్ విజయం ఖాయమంటున్నారు విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరిగా పార్టీలోకి చేర్చుకుంటోంది.

మానసికంగా…..

మమత బెనర్జీని మానసికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇప్పటికే పార్టీ నేతలను తన వైపునకు తిప్పుకుంటోంది. మమత బెనర్జీకి ఒకరకంగా ఇది దెబ్బే. పార్టీ క్యాడర్ లో ఆత్మస్థయిర్యం దెబ్బతింటుంది. ఈ కారణంతో మమత బెనర్జీ కొత్త ఎత్తులను వేస్తున్నారు. మమత బెనర్జీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని బీజేపీ అంచనా వేస్తుంది.

వ్యతిరేక ఓటు…..

అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్, వామపక్షాల కూటమి కొంత చీల్చే అవకాశముందని మమత బెనర్జీ అంచనా వేస్తున్నారు. అవి కొంత బలపడితే తనకు ఉపయోగం ఉంటుందని మమత బెనర్జీ భావిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. అయితే తాను ఒంటరిగా బరిలోకి దిగితే బీజేపీని ఎదుర్కొనలేమని భావిస్తున్న మమత కీలక వర్గాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మద్దతును కూడగట్టుకునేందుకు…..

ఇందులో భాగంగా మమత బెనర్జీ గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతును కూడగట్టగలిగారు. గూర్ఖా జనముక్తి మోర్చా బిమల్ గురుంగ్ వర్గం మమత బెనర్జీకి సపోర్ట్ చేసింది. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడంతో తాము మద్దతిస్తున్నట్లు మోర్చా నేత రోషన్ గిరి ప్రకటించారు. మమతకు ఇది కొంతవరకూ మేలు చేసే అంశమే. దీంతో పాటు ఎంఐఎంను కూడా కలుపుకుని పోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ వ్యూహరచనకు ధీటుగా మమత బెనర్జీ విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News